Site icon HashtagU Telugu

TDP Mahanadu 2025: చరిత్ర తిరగ రాసేలా కడప మహానాడు..టీడీపీ పండుగ

Tdp Mahanadu 2025

Tdp Mahanadu 2025

TDP Mahanadu 2025: ఇటివల జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, తెలుగుదేశం పార్టీ ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడును కడపలో అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. కడపలో మహానాడు నిర్వహించడం ఇది తొలిసారి కాగా, ఇది చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

మహానాడు ఏర్పాట్లను సమీక్షించేందుకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు కీలక నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అంతకు ముందే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో కూడా ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు.

మహానాడులో తొలి రోజు పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది. రెండో రోజు కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలపై చర్చిస్తారు. 28న పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతిని మహానాడు వేదికపై ఘనంగా నిర్వహించనున్నారు. మూడో రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది.

ఇక మినీ మహానాడుల సందర్భంగా, ఈ నెల 18, 19, 20 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో, 22, 23 తేదీల్లో జిల్లాల స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నేతలకు సూచించారు.

రాయలసీమ రూపు రేఖలు మార్చిన తెదేపా

చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో మహానాడు తిరుపతిలో జరిగినా, కడపలో ఈ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. ‘‘రాయలసీమ ప్రజల హృదయాల్లో తెలుగుదేశం పార్టీ స్థిరంగా నిలిచింది. ఇది ఆ ప్రాంతంలో తెదేపా చేసిన అభివృద్ధి, తెచ్చిన మార్పుల ఫలితం. ఫ్యాక్షన్ రాజకీయాలను నిర్మూలించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. సాగునీరు అందకా బాధపడుతున్న ఈ ప్రాంతానికి నీటిని అందించేందుకు ఎన్టీఆర్‌ సంకల్పంతో పలు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి లిఫ్ట్‌ ప్రాజెక్టులు తెదేపా పాలనలోనే ప్రారంభమయ్యాయి.

2014 తరువాత తెదేపా పాలనలో ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి మంచి ఫలితాలు సాధించామని చంద్రబాబు తెలిపారు. ఒకవైపు కరవు ప్రాంతాన్ని పచ్చని భూమిగా మార్చేందుకు, మరోవైపు పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కడప, కర్నూలు విమానాశ్రయాలు తెదేపా హయాంలోనే నిర్మించబడ్డాయి అని ఆయన గుర్తు చేశారు.

మహానాడుతో తెదేపాలో నూతనోత్సాహం

తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ ఎంతో చురుకుగా పనిచేస్తోందని, మహానాడు ద్వారా వారికి మరింత నూతనోత్సాహం రాబోతుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులు, కార్యకర్తలకు వసతి, రవాణాలో ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని సంబంధిత నేతలకు సూచించారు.

మహానాడు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి: లోకేశ్‌

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, ‘‘ఎన్టీఆర్‌ హయాం నుంచే మహానాడును పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నో అవరోధాలు వచ్చినా, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ మహానాడును విజయవంతం చేశారు. అదే ఉత్సాహంతో 2024 ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించగలిగాం,’’ అని చెప్పారు.

ఈసారి మహానాడును మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. వసతి, రవాణా అంశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు, సీనియర్‌ నాయకులు, మహానాడు కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో లోకేశ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక 28న

మహానాడులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక 28వ తేదీన జరగనుంది. నామినేషన్ల స్వీకరణ 27న జరుగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మొదటి రెండు రోజుల కార్యక్రమాలకు యూనిట్‌, క్లస్టర్‌, మండల, జిల్లా స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం 23 వేల మందిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మూడో రోజు బహిరంగ సభకు సుమారు 50 వేల మందికి ఆహ్వానాలు పంపించామని తెలిపారు.

కడప మహానాడు – రాయలసీమకు శాశ్వత పరిష్కార దారి

రాయలసీమ వెనుకబాటు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కడప మహానాడు ఒక కీలక వేదికగా నిలవబోతోందని మాజీ మంత్రి, ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ప్రాంత అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక అవకాశాలు వంటి అంశాలపై దీని ద్వారా స్పష్టమైన దిశా నిర్దేశం జరుగుతుందన్నారు.