Site icon HashtagU Telugu

Jr NTR Amit Shah Meet : జూనియ‌ర్, షా భేటీపై టీడీపీ గ‌ప్ చిప్

Babu Jr Ntr Lokesh

Babu Jr Ntr Lokesh

జూనియ‌ర్, అమిత్ షా భేటీ మీద స్పందించ‌డానికి తెలుగుదేశం సందేహిస్తోంది. వాళ్ల భేటీపై టంగ్ స్లిప్ అయిన బుద్ధా వెంక‌న్న‌కు అక్షింత‌లు ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. గ‌తంలో జూనియర్ ను ప‌లు సంద‌ర్భాల్లో టీడీపీలోని లోకేష్ గ్రూప్ కార్న‌ర్ చేసింది. ఆయ‌న సినిమాలు విడుద‌ల అయిన‌ప్ప‌డు ప్లాప్ టాక్ తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నించిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. ప్రీమియ‌ర్ షోలు ప్ర‌ద‌ర్శించిన రోజే ప్లాప్ అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టే వాళ్ల‌ను టాక్ ఉంది. ప్ర‌త్యేకించి `అర‌వింద్ స‌మేత` చిత్రం విష‌యం ప్లాప్ టాక్ తీసుకురావ‌డానికి లోకేస్ టీమ్ లోని కొంద‌రు బాగా ప‌నిచేశార‌ని జూనియ‌ర్ అభిమానుల అనుమానం. ఇప్పుడు జూనియ‌ర్, షా భేటీని కూడా నాన్ సీరియ‌స్ కోణంలో తీసుకెళ్ల‌డానికి. ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టార‌ని, అయితే చంద్ర‌బాబు ఆ ప్ర‌య‌త్నాన్ని ఆదిలోనే క‌ట్ చేశార‌ని వినికిడి.

ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ ల‌భించ‌డం చాలా క‌ష్టం. బీజేపీతో పొత్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ ప‌లుమార్లు షా తో భేటీ కావాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆయ‌న అవ‌కాశం ల‌భించ‌లేదు. ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప‌లుమార్లు అపాయిట్మెంట్ కోసం ప్ర‌య‌త్నం చేసి చాలా సంద‌ర్భాల్లో విఫ‌లం అయ్యారు. కానీ, జూనియ‌ర్ తో డిన్న‌ర్ చేయాల‌ని అమిత్ షా కోరుకోవ‌డం మామూలు విష‌యం కాదు. అలాంటి భేటీని త‌క్కువ చేసి చూపాల‌ని `బుద్దా` చేసిన ప్ర‌య‌త్నానికి ఆదిలోనే బ్రేక్ ప‌డింది.

జూనియ‌ర్ క్రీయాశీలకంగా వ‌స్తేనే టీడీపీ భ‌విష్యత్ అని న‌మ్మేవాళ్లు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. నంద‌మూరి రాజ‌కీయ వార‌సునిగా విశ్వ‌సిస్తోన్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. అందుకే, చంద్ర‌బాబు ఎక్క‌డికి వెళ్లిన‌ప్ప‌టికీ ఏదో ఒక రూపంలో జూనియ‌ర్ కోసం డిమాండ్ ఎదుర‌వుతోంది. కానీ, లోకేష్ భ‌విష్య‌త్ దృష్ట్యా జూనియ‌ర్ ను చంద్ర‌బాబు దూరంగా పెడుతున్నారు. ఆ విష‌యాన్ని టీడీపీలోని ఎవ‌ర్ని క‌దిలించిన‌ప్ప‌టికీ చెబుతారు. అందుకే, లోకేష్ టీమ్ లోని కొంద‌రు వ్యూహాత్మ‌కంగా జూనియ‌ర్ ను ప‌లు సంద‌ర్భాల్లో చుల‌క‌న చేసే ప్ర‌యత్నం చేశార‌ని చెప్పుకుంటారు. అదే టీడీపీకి తెలియ‌ని మైన‌స్ పాయింట్ గా ఎన్నిక‌ల్లో ఉంటుంద‌ని జూనియ‌ర్ హార్డ్ కోర్ అభిమానులు భావిస్తారు.

కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ ఖ‌చ్చితంగా జూనియ‌ర్ రాజ‌కీయ మైలేజిని ఇస్తోంది. భ‌విష్య‌త్ రాజ‌కీయ అడుగుల‌కు ఊతం ఇస్తోంది. ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌న‌ప్ప‌టికీ రాబోయే రోజుల్లో షా మ‌ద్ధ‌తు జూనియ‌ర్ కు ఉంటుంద‌ని ఎస్టాబ్లిష్ అయింది. జూనియ‌ర్ రాజ‌కీయ గ్రాఫ్ అమాంతం పెరిగిన‌ట్టు అయింది. 2009 ఎన్నిక‌ల్లో తొలిసారి రాజ‌కీయ వేదిక‌పై క‌నిపించిన జూనియ‌ర్ వాయిస్ ఇప్ప‌టికే టీడీపీ శ్రేణుల‌కు గుర్తుంది. ఆ రోజు నుంచే కాబోయే టీడీపీ రాజ‌కీయ వారసుడు అనే ముద్ర ఆయ‌న మీద ప‌డింది. అందుకే, వ్యూహాత్మ‌కంగా జూనియ‌ర్ ను చంద్ర‌బాబు దూరంగా పెడుతూ వ‌చ్చారు. కానీ, అమిత్ షా తో భేటీ జూనియ‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి కీల‌క మ‌లుపుగా ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో జూనియ‌ర్, అమిత్ షా భేటీ గురించి మాట్లాడ‌కుండా ఉంటేనే బాగుంటుంద‌ని టీడీపీ అధిష్టానం భావించింద‌ట‌. ఆ మేర‌కు మౌఖిక ఆదేశాలు వ‌చ్చాయ‌ని, అందుకే ఎవ‌రూ ఆ భేటీ గురించి స్పందించ‌డంలేదు. ఆ భేటీ గురించి నెగిటివ్ మాట్లాడినా, పాజిటివ్ మాట్లాడిన‌ప్ప‌టికీ పార్టీ న‌ష్టం వాటిల్లుతుంద‌ని గ్ర‌హించారు. అందుకే, గ‌ప్ చిప్ గా టీడీపీ ఉందని తెలుస్తోంది.