TDP : తిరుప‌తిలో టీడీపీ బంద్‌ని అడ్డుకున్న పోలీసులు.. ప‌లువురు నాయ‌కులు అరెస్ట్‌

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు బంద్‌ నిర్వహించేందుకు ప్రయత్నించగా

Published By: HashtagU Telugu Desk
TDP calls for State bandh on Monday

TDP calls for State bandh on Monday

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు బంద్‌ నిర్వహించేందుకు ప్రయత్నించగా జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు భగ్నం చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, నాయకులు రమణ, జనసేన నగర అధ్యక్షుడు జె రాజా రెడ్డి తదితరులు ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు యత్నించారు. పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కిరణ్ రాయల్‌ను ఆదివారం అర్ధరాత్రి ఆయన ఇంటి వద్ద నిర్బంధించారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. తమిళనాడుకు చెందిన బ‌స్సు సర్వీసులు కూడా యథావిధిగా నడుస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ఈ రోజు సెలవు ప్రకటించాయి. ఈరోజు జరగాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎస్వీ యూనివర్సిటీ ప్రకటించింది. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామ‌ని యూనివ‌ర్సిటీ అధికారులు తెలిపారు. టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (TNSF) విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీకి జనసేన, ఎమ్మార్పీఎస్ సంఘీభావం తెలిపి బంద్‌లో పాల్గొంటున్నాయి. సీపీఐ కూడా టీడీపీకి మద్దతు తెలిపింది.

  Last Updated: 11 Sep 2023, 11:53 AM IST