AP TDP Leaders Arrest : ఏపీలో టీడీపీ నేత‌ల‌ అరెస్ట్‌ల ప‌ర్వం

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్మేల అరెస్ట్ ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇటీవ‌ల కొంత నెమ్మ‌దించిన జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ళ్లీ అరెస్ట్ ల‌ను కొన‌సాగిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 02:57 PM IST

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్మేల అరెస్ట్ ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇటీవ‌ల కొంత నెమ్మ‌దించిన జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ళ్లీ అరెస్ట్ ల‌ను కొన‌సాగిస్తోంది. తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల న‌రేంద్ర‌ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని అనుమర్లపూడి గ్రామం చెరువులో మట్టి దోపిడీ జరుగుతోంది. ఆ గ్రామంలోని మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ ‘చలో అనుమర్లపూడి’కి న‌రేంద్ర పిలుపునిచ్చారు. అయితే, `చలో అనుమర్లపూడి`కి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తూ ముంద‌స్తుగా న‌రేంద్ర‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కానీ, పోలీసుల కళ్లుగప్పిన ధూళిపాళ్ల నరేంద్ర అనుమర్లపూడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. పొన్నూరులో అక్రమ మైనింగ్ చేస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చేస్తున్న నరేంద్రను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయ‌డాన్ని ఖండించారు. సంగం డైయిరీ ఇష్యూలో ఒక‌సారి ధూళ్లిపాళ్ల‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. డైయిరీని కాపాడుకోవ‌డానికి న్యాయ పోరాటం ఇప్ప‌టికీ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో నియోజ‌కవ‌ర్గంలోని మైనింగ్ మాఫియా మీద చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. మాఫియాను నిల‌దీస్తున్న న‌రేంద్ర‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డం టీడీపీ శ్రేణుల్లో ఆగ్ర‌హం క‌లిగిస్తోంది.

మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడ్ని అరెస్ట్ చేయ‌డానికి ఏపీ పోలీసులు ప్ర‌య‌త్నించారు. ఆయ‌న ఇంటి ముందు పోలీసులు భారీగా మోహ‌రించారు. ఇంటి స‌మీపంలోని కొంత స్థ‌లాన్ని ఆక్ర‌మించార‌ని ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది. న‌ర్సీప‌ట్నంలోని ఆయ‌న ఇంటి గోడల‌ను కూల్చేశారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన ఆయ‌న ప్ర‌స్తుతానికి సేఫ్ గా ఏపీ పోలీసుల అరెస్ట్ నుంచి త‌ప్పించుకున్నారు. మంత్రి రోజా మీద మినీమ‌హానాడు సంద‌ర్భంగా చేసిన కామెంట్ల క్ర‌మంలో అయ్య‌న్న మీద క‌క్ష‌సాధింపుకు జ‌గ‌న్ స‌ర్కార్ దిగింద‌ని బీసీ వ‌ర్గాలు ఆగ్ర‌హంగా ఉన్నాయి.

గ‌తంలోనూ మాజీ మంత్రి ఎర్రంనాయుడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈఎస్ఐ స్కామ్ అంటూ ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం క‌లిగించింది. రాయ‌పూడిలోని చంద్ర‌బాబు ఇంటిని కూల్చేందుకు తొలి రోజుల్లో ప్ర‌య‌త్నం చేసిన జ‌గ‌న్ స‌ర్కార్ అదే పంథాను కొన‌సాగిస్తోంది. మాజీ కొల్లు ర‌వీంద్ర మీద హ‌త్యారోప‌ణ‌లు మోపుతూ అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పెట్ట‌డం ద్వారా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని క‌డ‌ప జైల్లో పెట్టారు. ఇలా టీడీపీకి చెందిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ వెంటాడుతోంది. క్షేత్ర‌స్థాయిలో చురుగ్గా ఉండే వాళ్ల‌ను టార్గెట్ చేస్తోందన్న ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు. తాజాగా న‌రేంద్ర‌ను మ‌రోసారి అరెస్ట్ చేయ‌డం టీడీపీ శ్రేణుల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది.