TDP : రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిద‌వ రోజు కొన‌సాగిన టీడీపీ నిర‌స‌న దీక్ష‌లు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో 8వ రోజూ టీడీపీ నేతల

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 10:06 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో 8వ రోజూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు జ‌రిగాయి. తెలుగు రైతు, బీసీ విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. జగన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ప్ర‌భుత్వంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబునాయుడుకి వస్తున్న ప్రజాదారణ చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారని అందుకే కుట్రపూరితంగా ఆయనను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా అక్రమ అరెస్ట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారన్నారు.

TDP

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో దళిత నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. దీక్ష చేస్తున్న టీడీపీ నేత‌ల‌కు ఆయ‌న‌ సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో తెలుగు మహిళల ఆద్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలని నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వేషధారణలో వున్న వ్యక్తికి చీర కట్టి, పూలు పెట్టి, గాజులు తొడిగి మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

TDP

చంద్రబాబు నాయుడుని చూసి భయపడుతున్న జగన్ లేనిపోని ఆరోపణలు చేసి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. నెల్లూరు రూరల్ లో చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఆర్కే బీచ్ లో టీడీపీ నేత గండి బాబ్జి జలదీక్షకు దిగారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఆయ‌న డిమాండ్ చేశారు. సముద్రంలో నిలబడి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు.