TDP : వైసీపీ పాల‌నలో కుంభ‌కోణాల మ‌యంగా టీటీడీ మారింది – పంచుమ‌ర్తి అనురాధ‌

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్ధానం వైసీపీ పాలనలో కుంభకోణాల మయంగా మారిందని టీడీపీ రాష్ట్ర

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 04:21 PM IST

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్ధానం వైసీపీ పాలనలో కుంభకోణాల మయంగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారని… బంగారు డాలర్స్ కుంభకోణం, టికెట్ల కుంభకోణం, అన్యమత ప్రచారాలు, డిక్లరేషన్ ఇవ్వకపోవటం, దేవుని గుడిలో జై జగన్ నినాదాలు, కాళ్లకు చెప్పులతో గుడిలోకి వెళ్లటం వంటివన్నీ వైసీపీ హయాంలోనే చూస్తున్నామ‌న్నారు. శ్రీవాణి ట్రస్టుపై వైసీపీ నేతలు గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారని.. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన రూ. 650 కోట్లు నిధులేమయ్యాయని ఆమె ప్ర‌శ్నించారు. ఎక్కడెక్కడ ఆలయాలు కట్టారో శ్వేత పత్రం విడుదల చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. రూ.3096 కోట్ల బడ్జెట్ లో దేనికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో స్పష్టత లేదని.. భక్తులు ఇచ్చే విరాళాల లెక్కలు ఇంతవరకు ఎందుకు చెప్పలేదని ఆమె ప్ర‌శ్నించారు. రూ. 150 ఉన్న గది అద్దె రూ. 1700.. రూ. 25 ఉన్న లడ్డు ..రూ. 100 కి పెంచారని.. ఈ డబ్బులన్నీ ఎవరు స్వాహా చేస్తున్నారో తెలియాల‌న్నారు.

శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంటే…భక్తుల్ని ఇబ్బంది పెట్టేలా రేట్లు పెంచటం ఏంటని ఆమె మండిప‌డ్డారు. దేవుని దర్శనానికి వెళ్లాలంటే టీడీపీ హయాంలో రూ. 300 కూడా ఖర్చయ్యేది కాదని.. కానీ నేడు రూ. 17 వేలు అవుతోందన్నారు. తిరుపతిలో పర్యవేక్షణ అంతా జగన్ రెడ్డి సామాజికవర్గం వారిదేన‌ని.. టీటీడీ బోర్డు సభ్యుల్లో సగం మంది క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నవారేన్నారు. టీడీపీ హయాంలో బీసీ సామాజికవర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్, కళా వెంకట్రావుకి టీటీడీ చైర్మన్ ఇస్తే జగన్ రెడ్డి మాత్రం తన సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారన్నారు.