Lokesh Padayatra: వస్తున్నా మీకోసం!

తెలుగుదేశం పార్టీలో మహానాడు జోష్ కనిపిస్తోంది. అదే ఊపుల జనాల నుంచి మరింత మద్దతు సంపాదించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.

  • Written By:
  • Updated On - May 30, 2022 / 01:35 PM IST

తెలుగుదేశం పార్టీలో మహానాడు జోష్ కనిపిస్తోంది. అదే ఊపుల జనాల నుంచి మరింత మద్దతు సంపాదించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అందుకే లోకేష్ పాదయాత్ర విషయం బయటకు వచ్చింది. మహానాడులోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావించారు. కానీ అప్పుడు దీనిపై చంద్రబాబు కానీ, పార్టీ కాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ లోకేష్ మాత్రం.. పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాదయాత్ర చేయడానికి సిద్ధమని తన మనసులో మాట చెప్పేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. అప్పుడు మండుటెండలో వేల కిలోమీటర్ల పాదయాత్ర వల్ల ఆయన ఇమేజ్ పెరగడంతోపాటు పార్టీ ఇమేజ్ కూడా పెరిగింది. దీనివల్ల ఆ ఎన్నికల్లో టీడీపీకి మంచి మెజార్టీ వచ్చి అధికారంలోకి రావడానికి దోహదపడింది. ఆ తరువాత 2019లో ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జగన్ పాదయాత్ర చేశారు. దీంతో ఆయన మైలేజ్ పెరిగింది. అది పార్టీ విజయానికి దోహదపడింది. దీనివల్ల భారీ మెజార్టీ కూడా సాధ్యమైంది.

చంద్రబాబు, జగన్ లకు పాదయత్రతోనే అధికారం సాధ్యమైంది అన్న నమ్మకం రెండు పార్టీల్లోనూ కనిపించింది. అందుకే ఈసారి లోకేష్ పాదయాత్రకు సిద్ధణవుతున్నట్టు సమాచారం. ఆయన పాదయాత్ర చేయడం వల్ల క్షేత్రస్థాయి సమస్యలను మరింతగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊరూవాడా లోకేష్ కు మంచి ఇమేజ్ వస్తుంది. గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుస్తుంది. పైగా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారడానికి అవకాశాన్ని ఇస్తుంది. కరోనా సమయంలో లోకేష్ లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఫిట్ గా తయారుకావడంతోపాటు ప్రజా సమస్యల విషయంలో దూకుడు మీదుంటున్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వెంటనే అక్కడికి వెళ్లి ఆ సమస్యను రాష్ట్రమంతా తెలిసేలా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పాదయాత్ర చేయడంవల్ల ఆ ఇమేజ్ మరింతగా బలపడే ఛాన్సుంది. పైగా నియోజకవర్గాల స్థాయిలో టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయమున్నా.. జగన్ సర్కారు ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే లోకేష్ పాదయాత్రను వీలైనంత తొందరగా ప్రారంభించేలా టీడీపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.