TDP : మైల‌వ‌రం టీడీపీకి కొత్త అభ్య‌ర్థి.. మాజీ మంత్రికి సీటు లేన‌ట్లేన‌ని అధిష్టానం సంకేతం..?

కృష్ణాజిల్లా టీడీపీకి అన్న తానే అన్న‌ట్లు ఇన్నాళ్లు వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి దేవినేని ఉమాకి అధిష్టానం గ‌ట్టి షాక్

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 06:15 PM IST

కృష్ణాజిల్లా టీడీపీకి అన్న తానే అన్న‌ట్లు ఇన్నాళ్లు వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి దేవినేని ఉమాకి అధిష్టానం గ‌ట్టి షాక్ ఇవ్వ‌బోతుంది. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నేత‌లు ఇంఛార్జ్ దేవినేని ఉమాని వ్య‌తిరేకిస్తున్నారు. లోక‌ల్ వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌నే వాద‌న‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు. ఇప్ప‌టికే స్థానికుడైన విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ఉపాధ్య‌క్షుడు బొమ్మ‌సాని సుబ్బారావు నియోజ‌క‌వ‌ర్గంలో సుడిగాలి పర్య‌ట‌న చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లో ఆయ‌న స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు క్యాడ‌ర్‌ని ప‌ట్టించుకోలేద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. సొంత‌పార్టీ నేత‌ల బాధ‌ల్ని వినేవాడు కాద‌ని క్యాడ‌ర్ ఆరోపిస్తుంది. ఈ కార‌ణాల చేత‌నే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న్ని పార్టీ క్యాడ‌ర్ ఓడించింది. తాజాగా మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ఉమా సిద్ధ‌ప‌డుతుండ‌టంతో స్థానిక నేత‌లు, క్యాడ‌ర్ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నారు. ఉమామ‌హేశ్వ‌రరావు వ్య‌వ‌హార‌శైలిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు నేత‌లు.. ఎట్టి ప‌రిస్థితుల్లో ఉమాకి టికెట్ ఇవ్వోద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం కూడా దేవినేని ఉమాని వేరే నియోజ‌క‌వ‌ర్గం పంపే యోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి కొత్త అభ్య‌ర్థి రాబోతున్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

జిల్లాలో వ‌ర్గాలు చేయ‌డంలో దేవినేని ఉమా త‌రువాతేన‌ని టీడీపీ నేత‌లు చేవులు కోరుక్కుంటున్నారు. గ‌తంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానితో వైరం పెంచుకున్నారు. చివ‌ర‌కు కొడాలి నాని పార్టీ మారిపోయారు. ఇటు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఉమా మంత్రిగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో వంశీ నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు ఇవ్వ‌కుండా ఇబ్బందులు పెట్టార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఉమా వైఖ‌రిని వంశీ వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు. వీరిద్ద‌రితో వ‌ర్గ‌పోరు ముగిశాక‌.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో మాజీమంత్రి దేవినేని ఉమా వైరం పెంచుకున్నారు. మొద‌ట్లో బాగానే ఉన్న ఈ ఇద్ద‌రు నేత‌లు అంటిముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దేవినేని ఉమా వ్య‌వ‌హార‌శైలితో జిల్లా టీడీపీ అంతా అస్త‌వ్య‌స్తం అవుతంద‌ని క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఉమా వ‌ర్గాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని క్యాడ‌ర్‌లో వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఉమాకి చెక్ పెట్టాల‌ని సొంత నియోజ‌క‌వ‌ర్గం నేత‌లు ప్లాన్ చేయ‌డంతో ఉమాకి త‌ల‌నొప్పిగా మారింది.