Site icon HashtagU Telugu

TDP vs YSRCP: అసెంబ్లీలో ర‌చ్చ‌.. వైసీపీ నేత‌ల‌పై అచ్చెన్న ఫైర్..!

Atchannaidu Ysrcp

Atchannaidu Ysrcp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో స‌భ‌లో టీడీపీ నేత‌లు ప్ర‌తిరోజు నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేస్తున్నా సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిరోజు కొత్త కొత్త ప‌ద్ద‌తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలుపుతున్నారు. ఈక‌రోజు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి ఈలలు వేస్తున్నారు.. మ‌రోరోజు భ‌జ‌న‌లు చేస్తున్నారు.. ఇంకోరోజు చిడతలు వాయించారు.. ప్ర‌తిరోజు అసెంబ్లీ ప్రారంభ‌మ‌వ‌గానే వినూత్న రీతిలో టీడీపీ స‌భ్యులు నిర‌స‌న‌లు తెల్పుతూ స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారు.

ఈ నేప‌ధ్యంలో తాజాగా ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు చిడ‌తలు వాయించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలిపారు. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన అచ్చెన్నాయుడు.. జ‌గ‌న్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జంగారెడ్డిగూడెంలో జ‌రిగిన మ‌ర‌ణాల పై అసెంబ్లీ సాక్షిగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అస‌త్యాలు చెప్పార‌ని అచ్చెన్న ఆరోపించారు. ఈ క్ర‌మంలో క‌ల్తీ సారా తాగి ప్రాణాలు కోల్పోయిన జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాల‌ను జ‌గ‌న్ కించ‌ప‌ర్చార‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

రాష్ట్రంలో మ‌ద్యం పాలసీని మార్చి మ‌ద్యం దుకాణాలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌ద్య దుకాణాల్లో, ఓ 10 దుకాణాల్లోని మద్యం శాంపిల్స్ తీసి న్యాయ విచారణ జరిపిస్తే అస‌లు నిజాలు బయటకు వస్తాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు, త‌మ‌కు న‌చ్చిన బ్రాండ్ తాగే రోజులు ఎప్పుడో పాయాయ‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు ఆధారంగా మ‌ద్య కొనుగోళ్ళు చేస్తున్నార‌ని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

దేశంలోని ఎక్క‌డా లేని విధంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జే బ్రాండ్ మ‌ధ్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని అచ్చెన్న ఆరోపించారు.ఇక‌ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాట్లాడేందుకు, వైసీపీ స‌భ్యులు భ‌య‌ప‌డుతున్నార‌ని, అందురు ప్ర‌తిరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శాస‌న‌స‌భ‌ను తాము దేవాలయంగా భావిస్తామ‌ని, దేవాల‌యాలు లాంటి శాసనసభను జగన్ అండ్ వైసీపీ గ్యాంగ్.. వైసీపీ కార్యాలయంలా మార్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఇక రాష్ట్ర ప్రజలు మద్యం తాగకుండా తెలుగుదేశంపార్టీ కుట్ర పన్నుతోందని సీఎం జ‌గ‌న్ చెప్పటం దుర్మార్గమని అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. ప్రజలు ఎంత ఎక్కువ‌ మద్యం తాగితే, అంత ఎక్కువ‌గా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనే జ‌గ‌న్ దుర్బుద్ధి మరోసారి బయటపడిందని అచ్చెన్న అన్నారు. మద్యపాన నిషధానికి సంబంధించి హామీ ఇవ్వలేదని జ‌గ‌న్ చెప్తే, తాను రాజకీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. ఇక తాజాగా అసెంబ్లీలో టీడీపీ స‌భ్యులు చిడ‌త‌లు వాయించ‌డం పై స్పందించిన అచ్చెన్నాయుడు.. సభలో సీఎం జ‌గ‌న్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు చేసే భజన చూడలే, టీడీపీ ఎమ్మెల్యేలు చిడతలు వాయించారని అచ్చెన్నాయుడు తెలిపారు.