TDP Atchannaidu : ప్రాణం ఖ‌రీదు ‘2024

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షునిగా ప్ర‌స్తుతం అచ్చెంనాయుడు కొన‌సాగుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 11, 2022 / 12:43 PM IST

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షునిగా ప్ర‌స్తుతం అచ్చెంనాయుడు కొన‌సాగుతున్నారు. ఆయ‌న కంటే ముందు క‌ళా వెంక‌ట‌రావు ఆ పార్టీ ఏపీ చీఫ్ గా ఉండే వారు. ఆయ‌న స‌మ‌యంలో ఎలాంటి హ‌డావుడి ఉండేది కాదు. పైగా ఆనాడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉండేది. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత మాజీ మంత్రి అచ్చెంనాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేయ‌డంపై బీసీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డిచింది. రూ.233 కోట్లు కోట్ చేసి రూ.650కోట్లు తప్పుడు లెక్కలు చూపించారని ఆయ‌న‌పై ఏసీబీ వేసిన నింద‌. హెల్త్ టెలీ సర్వీసెస్ స్కీమ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఓ కంపెనీకి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చారని ఏసీబీ ఆనాడు నిర్థారించింది. తప్పుడు బిల్లులు పెట్టి క్లెయిమ్ చేయ‌డం ద్వారా 100 కోట్ల కు పైగా స్కామ్ చేశార‌ని ఆయ‌న్ను అరెస్ట్ చేసి, జైలుకు పంపిన విష‌యం విదిత‌మే. ఆనాడు ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా తెలుగుదేశం పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.

బెయిల్ పై జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన త‌రువాత ఏపీ చీఫ్ గా అచ్చెంనాయుడ్ని ఆ పార్టీ అధిష్టానం నియ‌మించింది. ఆ రోజు నుంచి వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను తిరిగి త‌మ గూటికి చేర్చుకునే స్కెచ్ టీడీపీ వేసింది. బీసీ వ‌ర్గానికి చెందిన అచ్చెంనాయుడ్ని అరెస్ట్ చేయ‌డం ఏమిట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం బీసీ నాయ‌కుల‌ను జైలుకు పంపిస్తుంద‌ని ఆరోపించారు. అంతేకాదు, బీసీల‌కు ప్రాధాన్యత ఇస్తున్నామ‌న్న సంకేతం బ‌లంగా పంప‌డానికి అచ్చెంకు టీడీపీ చీఫ్ ప‌ద‌విని అప్ప‌గించారు. ఆనాటి నుంచి అచ్చెం అధ్య‌క్షునిగా తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం ప‌నిచేస్తోంది. అంతేకాదు, అసెంబ్లీ నుంచి చంద్ర‌బాబు శాశ్వ‌తంగా వైదొలిగిన త‌రువాత అచ్చెంనాయుడు యాక్టింగ్ ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదంతా బీసీల‌కు తెలుగుదేశం ఇస్తోన్న ప్రాధాన్యంగా ఫోక‌స్ చేయ‌డానికి ఆ పార్టీ అధిష్టానం ప్ర‌య‌త్నం చేస్తోంది.

మాజీ కేంద్ర మంత్రి స్వ‌ర్గీయ ఎర్రంనాయుడు టీడీపీలో కీల‌క రోల్ పోషించిన‌ప్ప‌టి నుంచి అచ్చెంనాయుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఒక ప్రాధాన్య‌త‌ను క్రియేట్ చేసుకున్నారు. న‌క్స‌ల్స్ మందుపాత‌రకు ఎర్రంనాయుడు బ‌లైన‌ప్ప‌టి నుంచి శ్రీకాకుళం టీడీపీకి అచ్చెంనాయుడు కేంద్ర‌బిందువు అయ్యారు. ఆ త‌రువాత ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున లోక్ స‌భ ఎంపీగా ఎన్నిక‌య్యారు. రెండోసారి కూడా 2019 ఎన్నిక‌ల్లో గెలిచి లోక్ స‌భ‌లో టీడీపీ గ‌ళాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు. దీంతో కింజ‌ర‌పు కుటుంబం మీద తెలుగుదేశం పార్టీ ఆ జిల్లాలో ఆధార‌ప‌డి ఉంది. పైగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్ర‌తినిధులుగా వాళ్లు ఫోకస్ అయ్యేలా పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీ నుంచి ఏపీ వ‌ర‌కు ఆ ఫ్యామిలీ హ‌వా టీడీపీలో కొన‌సాగుతోంది. జ‌గ‌న్ స‌ర్కార్ ను లోక్ స‌భ నుంచి అసెంబ్లీ వ‌ర‌కు ఇరుకునపెడుతోన్న బాబాయ్‌, అబ్బాయిలు ఏపీ ప్ర‌భుత్వానికి స‌వాల్ గా మారారు.

తెలుగుదేశం పార్టీ త‌ర‌పున రాజీలేని పోరాటం చేస్తోన్న అచ్చెంనాయుడు ఆక‌స్మాత్తుగా ప్రాణ‌హాని ఉంద‌ని అనుమానించ‌డం గ‌మనార్హం. ర‌క్ష‌ణ కల్పించాల‌ని కోరుతూ ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఆయ‌న లేఖ రాయ‌డం బీసీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ప్ర‌స్తుతం టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత‌గా ఉన్న అచ్చెంనాయుడికి 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త కొన‌సాగుతోంది. ప్రాణ‌హాని ఉంద‌ని భావిస్తూ 4 ప్ల‌స్ 4 భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని కోర‌డం పలు విధాలుగా చ‌ర్చ‌కు దారితీస్తోంది. డీజీపీకి రాసిన లేఖ‌లో ప‌లు కీల‌క అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. సంఘ విద్రోహ శ‌క్తులు, న‌క్స‌లైట్లు, ఇత‌ర నేర‌స్తుల‌తో ప్రాణ‌హాని ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టే క్ర‌మంలో ప్రాణ‌హాని ఉంద‌ని తెలియ‌చేస్తూ భ‌ద్ర‌తను కోరారు.

ప్ర‌స్తుతం వెనుక‌బ‌డిన వ‌ర్గాల కోసం వైసీపీ, టీడీపీ ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటున్నాయి. తొలి నుంచి టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గూటికి ఎక్కువ‌గా చేరింది. వాళ్లు తిరిగి టీడీపీ వైపు చూడ‌కుండా సుమారు 42 కార్పొరేషన్ల‌ను ఉప కులాల వారీగా జ‌గ‌న్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, క్యాబినెట్, రాజ్య‌స‌భ త‌దిత‌ర నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్నారు. రాబోవు రోజుల్లో ఆర్ క్రిష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ‌ను ఇవ్వ‌డం ద్వారా బీసీల‌ను ప‌దిలం చేసుకోవాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహ‌మ‌ట‌. ఇదే స‌మ‌యంలో బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తూ సంస్థాగ‌త ప‌ద‌వుల‌ను టీడీపీ భారీగా ఇచ్చింది. అంతేకాదు, త్వ‌ర‌లో బీసీ ఉప కులాల వారీగా ఆత్మీయ స‌భ‌ల‌ను కూడా పెట్టాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. అందుకోసం అచ్చెంనాయుడు రూట్ మ్యాప్ ను త‌యారు చేయ‌డానికి సిద్దం అవుతున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రాణ‌హాని ఉంద‌ని అచ్చెంనాయుడు చెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. అంతేకాదు, 2024 ఎన్నిక‌ల దిశ‌గా బీసీ వ‌ర్గాలను క‌ల‌వ‌ర‌పెట్టే అంశంగా ఆయ‌న రాసిన లేఖ మారింది.