Site icon HashtagU Telugu

AP TDP : టీడీపీకి నాయ‌కుడు కావ‌లెను.!

Narayana Beeda Ravi

Narayana Beeda Ravi

అధికారం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే క‌నిపించే టీడీపీ పారిశ్రామిక‌వేత్త‌లు ప్ర‌తిప‌క్షంలోకి రాగానే అడ్ర‌స్ లేకుండా పోయారు. నెల్లూరు జిల్లాలో క్యాడ‌ర్ కోసం పోరాడే నాయ‌కులు లేకుండా పోయారు. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఉన్న‌ప్ప‌టికా ఆయ‌న జిల్లా వ్యాప్తంగా ప్ర‌భావం చూప‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. వ‌ల‌స లీడ‌ర్లు, పారిశ్రామిక‌వేత్త‌లు మాత్రమే టీడీపీ నెల్లూరు విభాగానికి ఆశాకిర‌ణాలుగా మారారు. మంత్రిగా ప‌నిచేసిన నారాయ‌ణ టీడీపీలో ఉన్నారా? లేరా? అనే విష‌యం కూడా తెలియ‌కుండా రాజ‌కీయం చేస్తున్నారు. జిల్లా నాయ‌క‌త్వాన్ని న‌డిపే ద‌మ్మున్న నాయ‌కుడు టీడీపీకి లేక‌పోవ‌డం ఆ జిల్లాలో వైసీపీ ఆడింది ఆట పాడింది పాట‌గా మారింది.నెల్లూరు జిల్లా టీడీపీ బ‌లోపేతం కోసం చంద్ర‌బాబు, లోకేష్ సైతం పెద్దగా ఫోకస్ పెట్టిన సందర్భాలు లేవు. పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయి ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకునే స్థాయిలో ఉంది. అయిన‌ప్ప‌టికీ టీడీపీ మాత్రం ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త‌ల‌ను కూడా అనుకూలంగా మార్చుకోలేక‌పోతోంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సయయంలో ఆ జిల్లాలో నేదురుమల్లి – ఆనం – మేకపాటి- పనబాక వర్గాలు ఒకే పార్టీలో ఉంటూ ఎవరికి వారుగా వ్యవహరించేవారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఆనాడు కాంగ్రెస్ నేత‌ల మాదిరిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు సైతం మేకపాటి, సంజీవయ్య, వరప్రసాద్ ఒకటిగా ఉంటున్నారనేది పార్టీ వర్గాల్లో ప్రచారం. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాప కుమార్ రెడ్డి ఒక గ్రూప్ గా రాజ‌కీయాల‌ను న‌డిరోడ్డుకు ఈడ్చారు.

కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి హోదాలో జిల్లాకు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆదాల – ఆనం మద్దతుతోనే ఈ స్థాయికి వ‌చ్చాన‌ని. వాళ్లు మ‌ద్ధ‌తు కూడగ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గం మీదుగా కోవూరు మీదుగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వాగత ర్యాలీ వెళ్తున్నా ఆయన హాజరు కాలేదు. నెల్లూరు అర్బన్ -రూరల్ ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారే కాకానికి దూరంగా ఉన్నారు. సీఎం జగన్ 2024 యాక్షన్ ప్లాన్ సిద్దం చేసే క్ర‌మంలో నెల్లూరు జిల్లా వ్యవహారాలను సెట్ చేసే బాధ్యతలను అసంతృప్తిగా ఉన్న. మాజీ మంత్రి సీనియర్ నేత బాలినేనికి అప్పగించ‌డం గ‌మ‌నార్హం.ఇతర జిల్లాల కంటే పార్టీ బలంగా ఉన్న ఈ జిల్లాలో వెంటనే పరిస్థితులను చక్కదిద్దకుంటే, ప్రస్తుతం కొనసాగుతున్న కోల్డ్ వార్ రానున్న రోజుల్లో పార్టీకి నష్టం చేస్తుందనే అభిప్రాయం కేడర్ లో కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాల్లో ఏం జరగనుంది అధినాయకత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఒక రకంగా ఆ పార్టీ లీడ‌ర్లు ప‌ర‌స్ప‌రం క‌త్తులు దూసుకుంటున్నారు. కానీ, టీడీపీ లీడ‌ర్లు మాత్రం సినిమా చూసిన‌ట్టు చూస్తూ ఎవ‌రికి వారే నైరాశ్యంగా ఉన్నారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా కంచుకోటగా నిలిచింది. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైసీపీకి అడ్డాగా నిలిచింది. పార్టీ ఏర్పాటు సమయంలో కడపతో పాటుగా వైసీపీకి మరో ఎంపీ నెల్లూరు నుంచే ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఏడు స్థానాలు వైసీపీ దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో మొత్తం పది స్థానాలు వైసీపీకి జిల్లా ప్రజలు కట్టబెట్టారు. ఎంపీ స్థానం వైసీపీకే దక్కింది. నెల్లూరు కార్పోరేషన్ లోనూ వైసీపీ జెండానే ఎగిరింది. టీడీపీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లోనూ వైసీపీ సునాయాసంగా గెలుపొందింది. ఇంత పట్టు ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ అంతర్గత పోరు న‌డుస్తోంది. నాయ‌క‌త్వంలోపం కార‌ణంగా టీడీపీ అక్క‌డ పాగా వేయ‌లేక‌పోతోంది.మాజీ మంత్రి అనిల్ – తాజా మంత్రి కాకాని మధ్య ఏర్పాటు చేసిన సభల పెట్టారు. ఒక ర‌కంగా బ‌ల‌నిరూప‌ణ కేంద్రాలుగా ఆ స‌భ‌లు క‌నిపించాయి. అధిష్టానం జోక్యంతో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. తనకు ఎవరూ పోటీ కాదని చెప్పిన అనిల్ ప‌రోక్షంగా కాకానికి స‌వాల్ విసిరారు. పైకి మాత్రం ఆయనతో తనకు ఎటువంటి విభేదాలు లేవని మాత్రం చెప్పలేకపోయారు.ఇంత జ‌రుగుతున్న‌ప్ప‌టికీ జిల్లా టీడీపీ లీడ‌ర్లు సోమిరెడ్డి, నారాయణ, బీదా రవిచంద్ర త‌దిత‌ర నేత‌లు పార్టీని బ‌లోపేతం చేయ‌లేక‌పోతున్నారు. సీనియ‌ర్ గా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అంటే చాలా మందికి గిట్ట‌దు. మాజీ మంత్రి నారాయ‌ణ అడ్ర‌స్ లేరు. ఆయ‌న కార‌ణంగా పార్టీకి రాజ‌కీయంగా జ‌రిగిన న‌ష్టం పూడ్చ‌లేనిది. ఇక బీద ర‌విచంద్ర కేవ‌లం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి మిన‌హా జిల్లా రాజ‌కీయానికి స‌రిపోడనే టాక్ ఉంది.

ఆనం, ఆదాల‌, మేక‌పాటి, న‌ల్ల‌పురెడ్డి కుటుంబీకులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌నిచేసిన పారిశ్రామిక వేత్త‌లు. అధికారం పోగానే ప్ర‌త్య‌ర్థి పార్టీల వైపు ఈజీగా మారిన సంద‌ర్బాలు అనేకం. మ‌ళ్లీ వాళ్ల రాక కోసం చంద్ర‌బాబునాయుడు వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఉద‌య‌గిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఒక పారిశ్రామిక వేత్త‌. ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో మిన‌హా నియోజ‌వ‌ర్గంలో ఎక్క‌డా క‌నిపించ‌డు. సోమిరెడ్డి సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న అనుభ‌వం నెల్లూరు జిల్లా టీడీపీని గాడిలో పెట్ట‌లేక‌పోయింది. ఫ‌లితంగా వ‌ల‌స‌, పారిశ్రామిక‌వేత్త‌ల‌పై చంద్ర‌బాబు ఆధార‌ప‌డ‌డం కార‌ణంగా అంత‌ర్గ‌త పోరు ఉన్న‌ప్ప‌టికీ వైసీపీకి అడ్డ‌గా నెల్లూరు జిల్లా మారింది. ఇప్ప‌టికైనా టీడీపీ ఆ జిల్లాను న‌డిపే నాయ‌కుడ్ని ఎంచుకోవాల‌ని ప‌లువురు ఆ పార్టీ క్యాడ‌ర్ భావించ‌డంలో త‌ప్పులేదు.