Nara Lokesh : హే కృష్ణా..హే చంద్రా..హే లోకేష్

ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హ‌వా ఉంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. కానీ, గుడివాడ‌, గ‌న్న‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం కుదుట‌ప‌డ‌లేదు.

  • Written By:
  • Updated On - July 16, 2022 / 11:12 AM IST

ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హ‌వా ఉంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. కానీ, గుడివాడ‌, గ‌న్న‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం కుదుట‌ప‌డ‌లేదు. కొర‌క‌రాని కొయ్య‌గా మారిన మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ల‌ను ఢీ కొట్టే లీడ‌ర్ల కోసం టీడీపీ అన్వేషిస్తోంది. గ్రూపుల బెడ‌ద కొడాలికి క‌లిసొస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు అక్క‌డ నుంచి వ‌రుస‌గా ఆయ‌న గెలిచారు. ఈసారి ఎలాగైనా ఓడించాల‌ని టీడీపీ వ్యూహాల‌ను ర‌చిస్తోంది.

కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరావు పిన్నమనేని బాబ్జి శిష్ట్లా లోహిత్లు ఎవరికివారే అన్నట్టుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఐక్యంగా ఉంటే తప్ప ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీకొనే పరిస్థితి లేదు. ఆ విషయం తెలిసి ముగ్గురు నాయకులు ఏకతాటిపైకి రాలేక పోతున్నారు. పైగా టికెట్ కోసం ఇటీవ‌ల మ‌రింత పోటీ పెర‌గ‌డం గ‌మ‌నార్హం. నాలుగు సార్లు గెలిచిన కొడాలి నానికి పోటీ ఇచ్చే లీడ‌ర్ కోసం చంద్రబాబు జల్లెడపడుతున్నారు. ఇటీవ‌ల వంగ‌వీటి రాధా ఆ నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న ఈసారి పోటీ చేయ‌బోతున్నార‌ని టాక్ వ‌చ్చింది. కానీ, ప్ర‌స్తుతం ఆ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిత్వంపై స్త‌బ్ద‌త నెల‌కొంది. ఒకానొక సంద‌ర్భంలో నంద‌మూరి బాల‌క్రిష్ణను గుడివాడ‌కు తీసుకురావాల‌ని బాబు భావించార‌ట‌. హిందూపురంకు లోకేష్ ను పంపించాల‌ని అనుకున్నార‌ని చ‌ర్చ జ‌రిగింది. కానీ, ప్ర‌స్తుతం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేని ప‌రిస్థితిలో బాబు ఉన్నారు. ఆ విష‌యం తెలుసుకున్న‌ కొడాలి రెచ్చిపోతున్నారు.

ఇక గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ప‌రిస్థితి వేరుగా ఉంది. గన్నవరం వెళ్లాల్సిందిగా బయటి నియోజకవర్గాల నేతలను చంద్రబాబు కోరుతున్నార‌ని తెలుస్తోంది. అయితే అక్క‌డ‌ వల్లభనేనివంశీ దూకుడు ఎక్కువగా ఉండడంతో ఇత‌ర ప్రాంతాల లీడ‌ర్లు ముందుకు రావ‌డంలేదు. ప్ర‌స్తుతం వైసీపీతో అంట‌కాగుతోన్న వంశీ ఆ పార్టీలో అధికారికంగా చేరే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి బ‌రిలోకి దిగ‌డానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొత్త లీడ‌ర్ల కోసం చంద్ర‌బాబు అన్వేషిస్తున్నారని తెలుస్తోంది.

పెనమలూరు నియోజకవర్గంలో బోడె ప్రసాద్, యలమంచిలి బాబురాజేంద్ర ప్రసాద్, దేవినేని గౌతం (పండు) వర్గాల ఆధిపత్య పోరు పెరిగిపోయింది. లోకేష్ ఆశీస్సులతో పండు వర్గం పెత్తనం చేస్తోంది. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొంటూ పార్టీ క్యాడర్ని అయోమ‌యానికి గురిచేస్తోంది. నాయకత్వంపై క్యాడర్ విశ్వాసం కోల్పోయింద‌ని టాక్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ రాజ‌కీయాన్ని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేయ‌లేదు.

అత్యవసర చికిత్స చేయాలన్న చంద్రబాబు ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీ పరిస్థితి దిగజారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన మునిసిపల్ పరిషత్ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన వరుస పరాజయాల తో టీడీపీలో కృష్ణా జిల్లాలో నిస్తేజంగా ఉంది. ఇటీవల మహానాడు నిర్వహించి పార్టీలో ఉత్తేజం నింపాలన్న చంద్రబాబు యోచించారు. కానీ, వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో మినీ మ‌హానాడును వాయిదా వేసుకున్నారు. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డంతో మినీ మ‌హానాడును ర‌ద్దు చేసుకున్నార‌ని టీడీపీపైన మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేస్తున్నారు.

మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా దూకుడుగా ఉన్న టీడీపీ కృష్ణా జిల్లాలో మాత్రం గంద‌ర‌గోళంలో ఉంది. అక్క‌డ చంద్ర‌బాబు, లోకేష్ అనుచ‌రులుగా గ్రూపులు నిర్వ‌హిస్తోన్న లీడ‌ర్ల సంఖ్య పెరుగుతోంది. త‌క్ష‌ణం ప‌రిష్కారం చేయ‌క‌పోతే, వ‌చ్చే ఎన్నికల్లో అక్క‌డ ప‌రిస్థితి దారుణంగా ఉండే ప్ర‌మాదం లేక‌పోలేదు.