Site icon HashtagU Telugu

MLC Results: ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీ హవా! MLC ఫలితాలు జగన్ కు రివర్స్

Tdp In Ap, Bjp In Telangana! Mlc Results Reverse To Jagan

Tdp In Ap, Bjp In Telangana! Mlc Results Reverse To Jagan

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు (MLC Results) ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తుంది. స్థానిక, ఎమ్మెల్యే కోటా ఫలితాలు సహజంగా అధికార పార్టీ వైపు ఉంటాయి. కానీ, యువత, ఉద్యోగులు ఓటింగ్లో పాల్గొనే స్థానాల్లో అధికార పార్టీలు ఇరు రాష్ట్రాల్లో వెనుక పడటం ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోంది.

ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ఓటర్లు టీడీపీ వైపు ఉన్నారని తేలింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో మాత్రం కొంత వైసీపీ పోటీ ఇచ్చింది. అక్కడ కూడా టీడీపీ ముందంజలో ఉన్నప్పటికీ నువ్వా? నేనా? అనేలా పోటీ కొనసాగుతుంది. ఈ ఫలితాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని అర్థం అవుతుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Results) కౌంటింగ్‌ కొనసాగుతుంది. ప్రతి రౌండ్లోను టీడీపీ అభ్యర్థులు హవా కొనసాగుతుంది. గురువారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది స్థానాలకు మొత్తం 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్ పేపర్ల పరిశీలన ఉంటుంది. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చేసాయి. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు శుక్రవారం అర్థరాత్రి వరకు, గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. అయితే తొలి రౌండ్లలోనే టీడీపీ హవా కనిపిస్తుంది.

తెలంగాణలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.మహబూబ్‌నగర్‌ – రంగారెడ్డి – హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలిచారు.

ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు. కవురు శ్రీనివాస్ కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాయి. వైకాపా అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం 752 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోగా వైసీపీ అభ్యర్థి రామారావుకు 632 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అనేపు రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లుబాటుకాలేదు.

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. 988 ఓట్లు మెజార్టీతో విజయం సాధించాడు. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 1083 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ పూర్తిస్థాయి మెజార్టీ సాధించడంతో ఎన్నికల అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించారు. పట్టభద్రులు, టీచర్ నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ డుమ్మా కొడుతోంది. ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ దిశగా టీడీపీ దూసుకు వెళ్తుంది. మొత్తం ఫలితాలు ఈ రోజు రాత్రికి వెలువడే అవకాశం ఉన్నప్పటికీ తొలి రౌండ్ నుంచి టీడీపీ ఆధిక్యం భారీగా కనిపిస్తుంది. దీంతో జగన్ చెప్పే వై నాట్ 175 జోక్ గా ఈ ఫలితాలు తేల్చబోతున్నాయి. ప్రజా మూడ్ ఎలా ఉందో తెలిపే ఈ ఫలితాలు చూసిన తరువాత రాజకీయ మార్పులు కూడా అనూహ్యంగా ఉండే ఛాన్స్ ఉంది.

Also Read:  Influenza H3N2: దడ పుట్టిస్తున్న ఇన్ ఫ్లూయెంజా H3N2.. ఇవీ జాగ్రత్తలు..