ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి సీఎం జగన్ ఎలక్షన్లకు వెళ్తారా? సీఎం మనసులో ఏముందో ఎవరికీ తెలియకపోయినా, దీనిపై రాష్ట్రంలో ప్రచారం మాత్రం జరుగుతోంది. మిడ్‌టర్మ్ ఎన్నికలు జరుగుతాయని తెలుగుదేశం బలంగా నమ్ముతోంది. వివిధ వర్గాలు కూడా ఇదే భావనతో తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.త్వరలోనే ఎన్నికలు వస్తాయంటూ tdp తన కేడర్ ను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా ప్రజలకు వివరించాలంటూ సూచనలు ఇస్తోంది. వివిధ వర్గాలకు జగన్ ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిని ఎంతవరకు అమలు చేశారు? ఎంతవరకు పెండింగ్‌లో ఉన్నాయి? అన్న వివరాలను చెబుతోంది.
చంద్రబాబు ఎన్ని పథకాలను తెచ్చారు? ఎన్ని నిధులు ఇచ్చారు? ఏ విధంగా అమలు చేశారో పోల్చి చెప్పాలని సూచనలు ఇస్తోంది. ఉదాహరణకు వ్యవసాయాన్నే తీసుకుంటే జగన్ కన్నా, చంద్రబాబే అధికంగా నిధులు ఇచ్చారంటూ లెక్కలు వివరిస్తోంది. ప్రతి పథకానికీ ఇలాంటి వివరాలు అందజేస్తోంది. మరో వైపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకులతో భేటీ అవుతూ క్యాండిడేట్స్ ఎంపికపై ఒక అవగాహనకు వస్తున్నారు. ఉద్యోగుల విషయానికి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్‌ను తిరిగి తీసుకురావడం పెద్ద డిమాండుగా ఉంది. దీనిపై పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చినందున, దాన్ని అమలు చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోని అంశమని, దాన్ని చేసి తీరాలని పట్టుబడుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి లేఖలు రాయనున్నారు. లక్షలాది మంది ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై ఉద్యమాలు మొదలయ్యాయి. ఎన్నికల మాట ఎలా ఉన్నా రాజకీయ వేడి మాత్రం పెరగనుంది.
