Divyavani Resigns : దివ్య‌వాణి చెబుతోన్న దుష్ట‌శ‌క్తి?

అధికారంలో ఉన్న‌ప్పుడు కొత్త ఫేస్ లు అనూహ్యంగా రావ‌డం ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లిన త‌రువాత ఆ మొఖాలు క‌నుమ‌రుగు కావ‌డం స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీల్లో క‌నిపిస్తుంది.

  • Written By:
  • Updated On - May 31, 2022 / 03:12 PM IST

అధికారంలో ఉన్న‌ప్పుడు కొత్త ఫేస్ లు అనూహ్యంగా రావ‌డం ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లిన త‌రువాత ఆ మొఖాలు క‌నుమ‌రుగు కావ‌డం స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీల్లో క‌నిపిస్తుంది. అలాంటి ప‌రిస్థితి మిగిలిన పార్టీల కంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కువ‌గా తార‌స‌ప‌డుతుంటుంది. ప్ర‌ధానంగా సినీ, పారిశ్రామిక వేత్త‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌నిపించ‌డం ఆ త‌రువాత అధికారం వ‌స్తే స‌రేస‌రి లేదంటే మొఖం చాటేస్తుంటారు. అలాంటి వాళ్ల‌కు కొన్ని పార్టీలు నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తూ ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంచుతారు. కానీ, తెలుగుదేశం పార్టీలో సినీ, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు పెద్ద‌పీఠ వేసిన సంద‌ర్భాలు అనేకం. ఆ జాబితాలోకి ఇప్పుడు దివ్య‌వాణిని తీసుకోవ‌చ్చు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ‌కీయ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో పెద్ద‌గా ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో ఆనాడు రోజాలేని లోటు తీర్చ‌డానికంటూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రోజు నుంచి ఆమెకు పార్టీ పెద్ద‌పీఠ వేసింది. రాజ‌కీయంగా ఎద‌గ‌డానికి అవ‌కాశం ఇచ్చింది. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల్ని నిల‌దీయ‌డానికి అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడిన‌ప్ప‌టికీ పార్టీ క్ష‌మించింది.

మ‌హానాడు హిట్ అయింద‌ని తెలుగుదేశం సంబ‌రాలు జ‌రుపుకుంటున్న వేళ దివ్య‌వాణి టీడీపీకి రాజీనామా చేశారు. ఎవ‌రో అదృశ్య శ‌క్తి కార‌ణంగా రాజీనామా చేస్తున్నానంటూ ఒక ఆరోప‌ణ ప‌డేశారు. ఆ అదృశ్య శ‌క్తి ఎవ‌రో చెప్ప‌డానికి ఆమె ధైర్యం చేయ‌లేక‌పోయారు. మ‌హానాడు వేదిక‌పై ఆమెకు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని రాజీనామాకు పాల్ప‌డి ఉంటార‌ని కొంద‌రు అనుకుంటున్నారు. అందుకు కార‌ణం ప్ర‌స్తుత తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలుగా ఉన్న అనిత అంటూ దివ్వ‌వాణి అభిమానుల్లోని టాక్‌. ఆ విష‌యాన్ని అధిష్టానం వ‌ద్ద చెప్పిన‌ప్ప‌టికీ వినిపించుకునే ప‌రిస్థితి లేదు. అందుకే, ఆమె రాజీనామా చేసి ఉంటార‌ని తెలుగు మ‌హిళల్లోకి చ‌ర్చ‌. దివ్య‌వాణి చెప్పిన అదృశ్య శ‌క్తి బ‌హుశా అనిత అంటూ పార్టీలోని కొంద‌రు గుస‌గుస లాడుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా చేరిన పారిశ్రామిక‌వేత్త యామిని ద‌శాబ్ద కాలంగా ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు ఆమె బాగా ప‌నిచేశారు .ఆ త‌రువాత పార్టీలో ఏమైందో ఏమోగానీ హ‌ఠాత్తుగా రాజీనామ చేశారు. ఆమె రాజీనామాకు పార్టీలోని ప‌వ‌ర్ పాయింట్స్ కార‌ణ‌మ‌ని ఆమె బీజేపీలో చేరిన త‌రువాత లీకులు ఇచ్చారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు ర‌కాల పుకార్ల‌ను చిమ్మారు. చాలా ఏళ్ల పాటు ఆమె తెలుగుదేశం పార్టీకి సేవ చేసి బ‌య‌ట‌కు వెళుతూ ఆ పార్టీ బాగుప‌డ‌ద‌ని తేల్చేశారు. ప్ర‌స్తుతం బీజేపీ పార్టీలో కొన‌సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సినీ రంగం నుంచి 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ళుక్కున మెరిసిన మ‌రో తార వాణీ విశ్వ‌నాథ్‌. ఆమెకు పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. కాబోయే తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలంటూ ఫోక‌స్ అయ్యారు. తెలుగు మహిళా అధ్య‌క్షురాలుగా రోజా 2009లో రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లిన త‌రువాత సినీ హీరోయిన్లు చాలా మంది ఆ పోస్ట్ ను ఆశించారు.

తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘంగా ప‌నిచేసిన శోభాహైమావ‌తిని మ‌హిళా అధ్య‌క్షురాలిగా ఆనాడు చేశారు. ఆమె కూడా రోజా ప‌నితీరుతో పోల్చుకున్నారు. కానీ, ఆ స్థాయిలో ప‌నిచేయ‌లేక ప‌లు ర‌కాల విమ‌ర్శ‌లను ఎదుర్కొన్నారు. ఒకానొక స‌మ‌యంలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు కూడా లోన‌య్యారు. 2014 ఎన్నిక‌ల్లో టిక్కెట్ ను ఆశించి ఆమె భంగ‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ పార్టీలోనే కొనసాగుతూ 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా ఆమె పార్టీకి రాజీనామా చేశారు. ఆ సంద‌ర్భంగా ఆమె కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని విమ‌ర్శిస్తూ ప్ర‌త్య‌ర్థుల స్క్రిప్ట్ ను వినిపించారు. ప్ర‌స్తుతం ఆమె రాజ‌కీయంగా ఎక్క‌డ ఉన్నారో పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఆ త‌రువాత చాలా కాలం తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలి ప‌ద‌విని ఖాళీగా ఉంచారు. ఏడాది క్రితం ఆ ప‌ద‌విని ఎస్సీ వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిత‌క‌కు క‌ట్ట‌బెట్టారు. ఆ స‌మ‌యంలో వాణి విశ్వ‌నాథ్‌, దివ్వ‌వాణితో పాటు ప‌లువురు సినీ, పారిశ్రామిక‌, రాజ‌కీయ వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు తెలుగు మ‌హిళా అధ్య‌క్ష ప‌ద‌విని ఆశించారు.

తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలిగా అనిత బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కొంద‌రు వ్య‌తిరేకంగా ఉన్నారు. ఆ జాబితాలో దివ్య‌వాణి కూడా ఒక‌ర‌ని పార్టీలోని చ‌ర్చ‌. పైగా ప్రాధాన్యం ఇవ్వ‌డంలేదనే అసంతృప్తి కూడా ఉంద‌ని తెలుస్తోంది. మ‌హానాడు కేంద్రంగా ఆ అసంతృప్తి బ‌య‌ట‌ప‌డింద‌ని స‌మాచారం. అందుకే, ఆమె రాజీనామా చేశార‌ని పార్టీలోని టాక్. ఇటీవ‌ల ఆమె వైసీపీతో ట‌చ్ ఉన్నార‌ని కూడా పార్టీలోని అంత‌ర్గ‌త వినికిడి. హీరోయిన్ వాణివిశ్వ‌నాథ్ తిరిగి పార్టీలో కీల‌క రోల్ పోషించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆమెకు ప్రాధాన్యం ఇచ్చే ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ముందుగా గ‌మ‌నించిన దివ్య‌వాణి రాజీనామా చేసి ఉంటార‌ని కొంద‌రి అనుమానం. కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ ఆమె రాజీనామా చేయ‌డంతో ట్విట్ట‌ర్లో ట్వీట్ కూడా చేశారు. అధిష్టానం జోక్యంతో వెన‌క్కు త‌గ్గార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు వ‌స్తున్నాయి. కానీ, ఆమె ట్విట్టర్ వేదిక‌గా ఎలాంటి క్లారిటీ రాలేదు. బ‌హుశా ఆమె మ‌రో పార్టీలోకి వెళ్లిన‌ త‌రువాత స్క్రిప్ట్ మ‌రోలా ఉంటుంద‌ని భావిస్తున్నారు. మొత్తం మీద ఆమె చెబుతోన్న దుష్ట‌శ‌క్తి ఎవ‌రో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు.