Site icon HashtagU Telugu

Kolikapudi Srinivasrao: టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఏమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు..

Kolikapudi Srinivasrao

Kolikapudi Srinivasrao

క్రమశిక్షణా కమిటీ ముందుకు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. సోమవారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో (TDP Office) క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కొలికపూడి వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. కొలికపూడి వివరణ తరువాత క్రమశిక్షణ కమిటీ ఆ నివేదికను సీఎం చంద్రబాబుకు పంపించింది. కాగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఆ పార్టీ నాయకత్వం తాఖీదు జారీ చేసింది. సోమవారం పార్టీ క్రమ శిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈనెల 11న తన నియోజకవర్గంలోని ఒక ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో ఒక అంతర్గత రహదారి విషయంలో కొన్ని గిరిజన కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఆ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆ వివాదంలో జోక్యం చేసుకొని ఒ వ్యక్తిపై చేయి చేసుకొన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై ఆ రోజే సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసి ఎమ్మెల్యే వివరణను తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఆయన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో క్రమ శిక్షణ సంఘం ముందుకు పిలిపించాలని నిర్ణయించారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ ఈ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వర్ల రామయ్య, ఎం ఏ షరీఫ్‌, పంచుమర్తి అనురాధ, బీదా రవిచంద్ర ఈ సంఘంలో ఇతర సభ్యులుగా ఉన్నారు. కొలికపూడి తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకొంటుండటంతో పార్టీ నాయకత్వం ఆయన పట్ల అసంతృప్తిగా ఉంది. గతంలో కూడా ఆయన వైఖరిని నిరసిస్తూ ఆ నియోజకవర్గ నేతలు కొందరు విజయవాడలో ధర్నాలు చేశారు. అప్పుడు కూడా కొలికపూడిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఈ ఏడు నెలల్లోనే ఇప్పుడు రెండోసారి ఆయన తన వివాదాలపై పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కుతున్నారు. కొందరు కొత్త ఎమ్మెల్యేలు తప్పులు చేసి వివాదాల్లో చిక్కుకొంటున్నారని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఈ వివాదాలు మసకబారుస్తున్నాయని శుక్రవారం ఇక్కడ తన నివాసంలో జరిగిన మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన మర్నాడే కొలికపూడికి తాఖీదు జారీ అయింది. కొలికపూడి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది.