Site icon HashtagU Telugu

Mekapati Goutham Reddy : ‘హ‌ఠాన్మ‌ర‌ణం’పై రాజుకున్న రాజ‌కీయం

Jagan Kolikapudi Bandaru

Jagan Kolikapudi Bandaru

మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంపై టీడీపీ ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించాడా? లేక జ‌గ‌న్ ఒత్తిడి ఉందా? ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకొచ్చే క్ర‌మంలో జ‌గ‌న్‌, గౌత‌మ్ రెడ్డి మ‌ధ్య ఏం జ‌రిగింది? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌ను టీడీపీ లేవ‌నెత్తుతోంది. తొలుత అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షుడు లీడ‌ర్ కొలిక‌పూడి శ్రీనివాస్ రావు అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై నెటిజ‌న్లు భారీగా రివ‌ర్స్ అయ్యారు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా ఆయ‌న ప‌లు అనుమానాల‌ను లేవ‌నెత్తుతున్నాడు.ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీశాఖ మంత్రిగా గౌత‌మ్ రెడ్డి రెండున్న‌రేళ్ల క్రితం బాధ్య‌త‌లు తీసుకున్నాడు. విద్యాధికుడు, ప్ర‌తిభావంతునిగా ఆయ‌న్ను గుర్తించిన జ‌గ‌న్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. కానీ, రెండున్న‌రేళ్ల‌లో ఎలాంటి ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి రాలేదు. పైగా కంపెనీల‌ను తీసుకురావ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు ఏమీలేవ‌ని విప‌క్షాలు త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేసేవి. చేప‌లు, మ‌ట‌న్ దుకాణాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా ఉపాథి అవ‌కాశాలు ఎలా వ‌స్తాయ‌ని టీడీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా యుద్ధం చేసింది. క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ విష‌యంలోనూ ఆల‌స్యం చోటుచేసుకుంది. కంపెనీలు ఏపీకి రావ‌డానికి ఉత్సాహంగా లేవు. ఆ విష‌యాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా టీడీపీ ప్ర‌చారం చేసింది. దాన్ని అధిగ‌మించ‌డానికి ఇటీవ‌ల జ‌గ‌న్ దూకుడు పెంచాడు.

ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన ఒత్తిడి కార‌ణంగా మంత్రి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మ‌రణించాడ‌ని కొలిక‌పూడి చేస్తోన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి రాక‌పోవ‌డానికి కార‌ణం గౌత‌మ్ రెడ్డి చేత‌గానిత‌నంగా జ‌గ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఆ విష‌యాన్ని కొలిక‌పూడి చెబుతున్నాడు. ప‌దేప‌దే కొన్ని ప‌రిశ్ర‌మ‌ల గురించి జ‌గ‌న్ ఒత్తిడి పెట్టాడ‌ని అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాడు. పైగా వాన్‌పిక్ ప్రాజెక్టు విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్యా పొర‌పొచ్చాలు వ‌చ్చాయ‌నే టాక్ న‌డుస్తోంది. వాన్ పిక్ ప్రాజెక్టు స్వ‌ర్గీయ వైఎస్ హ‌యాంలోనే మూల‌న‌ప‌డింది. ఆ రోజున భూముల కుంభ‌కోణం చోటుచేసుకుంద‌ని సీబీఐ విచార‌ణ చేసింది. అంతేకాదు, ఆ భూముల‌ను ప్ర‌భుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వాన్ పిక్ భూముల్లో తిరిగి ఓడ‌రేవుల‌ను నిర్మించ‌డానికి జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చాడ‌ట‌. కానీ, గౌత‌మ్ రెడ్డి మాత్రం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆ భూముల‌ను వినియోగించుకోవ‌డానికి ముందుకు రాలేక‌పోయాడ‌ని ఉన్న‌తాధికారుల ద్వారా తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు ఒత్తిడి గౌత‌మ్ రెడ్డి పై ఉంద‌ని టీడీపీ వ‌ర్గాల అనుమానం.గుండెపోటుకు రెండు రోజుల ముందు మంత్రి గౌత‌మ్ రెడ్డి దుబాయ్ వెళ్లాడు. అక్క‌డి కంపెనీల సీఈవోల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హించాడు. ఇటీవ‌ల ఏపీలోనూ ఉన్న‌తాధికారుల‌తో ప‌లు స‌మీక్షా స‌మావేశాల‌ను పెట్టాడు. ప‌రిశ్ర‌మ‌ల‌ను ఎలాగైనా తీసుకురావాల‌ని ప‌లు ప్ర‌యత్నాలు చేశాడు. దుబాయ్ మీటింగ్ లో ఆశించిన ఫ‌లితాలు రావ‌ని ఆయ‌న‌కు తెలిసిపోయింది. దీంతో ఇండియాకు తిరిగి వ‌చ్చిన గౌత‌మ్ రెడ్డి మీద ఒత్తిడి పెరిగింది. ఆ క్ర‌మంలోనే గుండెపోటు వ‌చ్చింద‌ని కొలిక‌పూడి తో పాటు టీడీపీ వ‌ర్గాల భావ‌న‌.

వాస్త‌వంగా దుబాయ్ నుంచి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే గౌత‌మ్ రెడ్డికి గుండెపోటు వ‌చ్చింది. ఆ రోజు ఉద‌యం 7 గంట‌ల ప్రాంతంలో అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆయ‌న స్పృహ కోల్పోయాడు. ఆఖరి ప్ర‌య‌త్నం వైద్యులు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. అధికారికంగా ఉద‌యం 9 గంట‌ల‌కు ఆయ‌న మృతిని ప్ర‌క‌టించారు.కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుంచి ఇండియాకు చేరుకోవ‌డంతో బుధ‌వారం మంత్రి గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ప్రాంతంలోని మెరిట్స్ ఇంజ‌నీరింగ్ కాలేజి ఆవ‌ర‌ణ‌లో అంత్య‌క్రియ‌లు పూర్తి అయ్యాయి. అదే స‌మ‌యంలో టీడీపీ సీనియ‌ర్ నేత భండారు స‌త్య‌నారాయ‌ణ మాత్రం గౌత‌మ్ రెడ్డి మృతిపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.గౌత‌మ్ రెడ్డి మృతిపై ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని భండారు పేర్కొన్నారు. వాటిని నివృత్తి చేయాలంటే, గౌత‌మ్ రెడ్డి మృతిపై సీబీఐ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ అధ్యక్షుడు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు చేసిన ట్వీట్ కు మ‌ద్ధ‌తుగా టీడీపీ నిలుస్తోంది. మంత్రి గౌత‌మ్ రెడ్డి మృతిపై సీబీఐ విచార‌ణ జ‌రిపిస్తే..జ‌గ‌న్ టార్చ‌ర్ బ‌య‌ట ప‌డుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. మొత్తం మీద గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం రాజ‌కీయాన్ని సంత‌రించుకోవ‌డం ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లోని ప‌రాకాష్ట!