Site icon HashtagU Telugu

TDP on AP Fiscal: ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యర్థ ప్రసంగం… ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

PAC Facts Meetings

Payyavula Keshav

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో చేసిన సుదీర్ఘ ప్రసంగం వ్యర్థ ప్రసంగమే అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను బలవంతంగా గెంటేసి ప్రసంగించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. అన్ని వేదికలను ఉపయోగించుకొని ఆ అసత్య ప్రచారాలనే మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా తన ప్రభుత్వంపై తానే తప్పుడు లెక్కలు చెప్పిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. ఏ ప్రభుత్వ వెబ్ సైట్ లో కూడా ప్రభుత్వ ఆర్థిక అంశాలు దొరకవన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమాచారం దొరకదని, జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఎంత వస్తోందో తెలియదని చెప్పారు. జీవోలను వెబ్ సైట్ లో ఎందుకు పెట్టడంలేదని అడిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడిగారు.

ఏది అబద్దం? ఏది నిజం?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉద్యోగులకు సీపీఎస్ ఇవ్వలేకపోతున్నామని సీఎంఓలు, సలహాదారులు, మంత్రులు ప్రకటించారని, ముఖ్యమంత్రేమో ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని అసెంబ్లీలో చెప్పారని, ఏది అబద్దం, ఏది నిజం? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని, అంగన్ వాడీలకు చిక్కీలు సరఫరా చేసినవారికి రూ.10 కోట్లు బకాయిలు పెట్టారని, కర్నాటక డెయిరీ డెవలప్ మెంట్ బిల్లు వంద కోట్లు చెల్లించకపోవడంతో చిన్నపిల్లలకు సరఫరా చేసే పాలు ఆపేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి టిడ్కో ఇళ్లకై తీసుకున్న రూ.7,300 కోట్లు ఎక్కడికి మళ్లించారో తెలియదన్నారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలను పాలకుల్లాగా, టీడీపీ ఎమ్మెల్యేలను సేవకుల్లాగా చూస్తున్నారని, రేపు అసెంబ్లీ చర్చలో సరైన సమయాన్ని ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రజలపై భారాలెందుకు మోపారని, అధిక వడ్దీకి అప్పులు ఎందుకు తెస్తున్నారని, 11 కేంద్ర పథకాలను ఎందుకు ఉపయోగించుకోలేక పోయారని ప్రశ్నించారు. డబ్బులు లేవని హైకోర్టులోనే అఫిడవిట్ వేశారని గుర్తు చేశారు.

అమరావతి బిల్లు పెట్టకపోవచ్చు!

సుప్రీం కోర్టు సమయం కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు తీసుకుని ఎన్నికలలోపల అమరావతిపై తీర్పు రాకుండా ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు. రాజధాని విషయంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రలో రాజకీయ లబ్ది పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. మళ్లీ శాసనసభలో అమరావతి రాజధాని బిల్లు పెట్టకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ అసత్యాల పునాదులను బద్దలుకొట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.

Exit mobile version