Solar Power issue: అదానీ సంస్థకు మేలు చేయడానికే సోలార్ విద్యుత్ కొనుగోలు – పయ్యావుల

అదానీ సంస్థకు మేలు చేయడానికే ఏపీ ప్రభుత్వం 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైందని పీఏసీ ఛైర్మన్,టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - November 5, 2021 / 10:35 PM IST

అమరావతి : అదానీ సంస్థకు మేలు చేయడానికే ఏపీ ప్రభుత్వం 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైందని పీఏసీ ఛైర్మన్,టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రంలో వదిలేసి రాజస్థాన్ నుంచి సోలార్ విద్యుత్ కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కొనుగోలు ధర రూ.2.49 పైసలంటున్న ప్రభుత్వం డిస్కంలకు చేరేసరికి ఎంతవుతోందో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎందుకు రద్దుచేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అదానీసంస్థకు మేలు చేయడం కోసం రూ.లక్షా 20 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేయడానికి సిద్ధమైందని పయ్యావుల కేశవ్ అన్నారు

అదానీ సంస్థ చెప్పిన రూ.2.90పైసలు ఎక్కువ ధరని 22 నెలల నుంచీ దేశంలో ఏరాష్ట్రము సదరు సంస్థతో ఒప్పందం చేసుకోవడం, విద్యుత్ కొనడానికి ముందుకురావడం జరగలేదన్నారు. దేశంలో ఏరాష్ట్రమూ అదానీ సంస్థతో ఒప్పందానికి ఇష్టపడకపోతే, ఏపీ ప్రభుత్వం మాత్రమే ఎందుకు ఒప్పందం చేసుకుంది? అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 15 న సెకీ తమకు టెండర్ వేసిన అదానీసంస్థ రూ.2.49పైసలకే ఇవ్వాలనుకుంటోందని లేఖరాస్తే, 16నే ఏపీప్రభుత్వం ఆమోదించింది. సాయంత్రం లేఖవస్తే మరుసటి రోజు ఉదయానికే కేబినెట్ అప్రూవల్ పూర్తై, ఆమోదం తెలపడం జరిగిందన్నారు. రూ.30 వేల కోట్ల పెట్టుబడికి సంబంధించిన విషయంలో ఏమీ ఆలోచించకుండా, లోతుపాతులు పరిశీలించకుండా, ప్రభుత్వం ఎలా నిర్ణయంతీసుకుంటుందని ప్రశ్నించారు.

రాష్ట్రానికి రూపాయి ఆదాయంలేకుండా, ఒక్కఉద్యోగం రాకుండా, సదరుసంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రూ.2.49 పైసలు చాలా తక్కువని ప్రభుత్వం చెబుతోందని…. ప్రభుత్వం అదానీసంస్థతో ఒప్పందం చేసుకున్నదానికంటే తక్కువగా అదే సమయంలో యూనిట్ సోలార్ విద్యుత్ రూ.1.99 పైసలకు, రూ.2కే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. సోలార్ విద్యుత్ ధరలు పతనమైన 22నెలల తర్వాత ఈ ప్రభుత్వానికి రూ.2.49 పైసలు తక్కువగా అనిపించిందా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదానీసంస్థ అంతచౌకగా విద్యుత్ ఇస్తే, ఇతరరాష్ట్రాలు ఎందుకు కొనలేదో ప్రభుత్వ పెద్దలు చెప్పాలన్నారు.

చంద్రబాబునాయుడు రాష్ట్ర అవసరాలకు మించి విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం వల్ల రాష్ట్ర గ్రిడ్ వ్యవస్థ తట్టుకోలేకపోతుందని… గతంలో టీడీపీహాయాంలో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలను జగన్ ప్రభుత్వం రద్దుచేసిందని గుర్తు చేశారు. మరి ఈ రోజు 10వేల మెగావాట్లను ఈ ప్ర్రభుత్వం బయటి రాష్ట్రాలనుంచి కొంటే, గ్రిడ్ వ్యవస్థ తట్టుకుంటుందా? అని పయ్యావుల ప్రశ్నించారు.

యూనిట్ రూ.2.49పైసలకే వస్తోందని, సోలార్ విద్యుత్ కొంటున్నామని కేబినెట్లో చెప్పారని…. ఏపీ డిస్కమ్ లకు చేరేసరికి అదే రూ.2.49పైసలే పడుతుందా..లేక పెరుగుతుందో ప్రభుత్వం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. తమ దగ్గరున్న లెక్కలప్రకారం డిస్కం లకు చేరేసరికి యూనిట్ విద్యుత్ ధర రూ.3.50పైసలు నుంచి రూ.4.50పైసలు పడుతుందని…
ఫ్రిజ్ లు, టీవీలు కొనండి అని ప్రకటనలు ఇచ్చి, కిందమాత్రం ధరలు అధికం, పన్నులు అధికమని వేస్తారని..అలానే ప్రభుత్వం చెబుతున్న రూ.2.49పైసల వెనక, ఎన్నిఅదనపు భారాలున్నాయో చెప్పాల్సిన పనిలేదన్నారు. రూ.2.49పైసలకి సోలార్ విద్యుత్ కొంటున్నామని చెబుతూ, ప్రభుత్వం నేరుగా ప్రజలను మోసగిస్తోందన్నారు. విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ప్రజలకు తీసుకొచ్చిన స్కీమ్ కాదని.. అదానీలకోసం తయారుచేసిన స్కామ్ అని ఆరోపించారు.