Site icon HashtagU Telugu

Congress -TDP : కాంగ్రెస్, టీడీపీ పొత్తు ప‌దిలం?

Tdp Cong New

Tdp Cong New

తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ క‌లిసి ఉన్న‌ట్టా? విడిపోయిన‌ట్టా? అనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి ఒక స్ప‌ష్టత‌ను ఇచ్చేలా ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా గాంధి ఇచ్చిన విందుకు టీడీపీ ఎంపీలు ముచ్చ‌ట‌గా హాజ‌ర‌య్యారు. ఆమె ఇచ్చిన విందులో గ‌ల్లా జ‌య‌దేవ్‌, రామ్మోహ‌న్‌, కేశినేని, క‌న‌క మేడ‌ల త‌దిత‌రులు ఉన్నారు. ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అంతేకాదు, ఆ ఫోటోను చూసిన త‌రువాత ఢిల్లీ నుంచి ఏపీ వ‌ర‌కు కాంగ్రెస్ తో క‌లిసి టీడీపీ ప‌నిచేస్తుంద‌ని అనుకోవ‌డం స‌హ‌జం.కాంగ్రెస్ పార్టీ భావ‌జాలానికి వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. కానీ, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో వెళ్లాయి. అంతేకాదు, 2019 ఎన్నిక‌ల్లో లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీతో క‌లిసి న‌డిచింది. అంతేకాకుండా ఆనాడు రాహుల్ గాంధీతో చేతులు క‌లిపి ఢిల్లీ కేంద్రంగా మోడీకి వ్యతిరేకంగా కూట‌మి క‌ట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఆ క్ర‌మంలో మ‌మత‌, లాలూ, మూలాయంసింగ్ , దేవెగౌడ త‌దిత‌రుల‌ను ఏకం చేయ‌డానికి బాబు ప్ర‌య‌త్నించాడు. కర్ణాట‌క రాష్ట్రంలో 2017లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డానికి బాబు స‌హ‌కారం అందించాడు. ఆ త‌రువాత కుమార‌స్వామి అధికారంలోకి రావ‌డానికి ఢిల్లీ నుంచి బెంగుళూరు వ‌ర‌కు చ‌క్రం తిప్పాడు. సీన్ కట్ చేస్తే..అనూహ్యంగా 2019లో మోడీ రెండోసారి ప్ర‌ధాని కావ‌డంతో సైలెంట్ అయ్యాడు.

2019 సాధార‌ణ ఎన్నిక‌ల త‌రువాత కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ఎక్క‌డా చంద్ర‌బాబు క‌నిపించ‌లేదు. ఆ పార్టీకి వ్య‌తిరేకంగానూ, అనుకూలంగానూ ఎక్క‌డా మాట్లాడ‌లేదు. ఆ పార్టీ ప‌ట్ల మ‌ధ్యేమార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కానీ, టీడీపీ సోష‌ల్ మీడియా మాత్రం మోడీని టార్గెట్ చేసుకుని పనిచేస్తోంది. అంటే, ప‌రోక్షంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ముందుకు క‌దులుతుంద‌ని తెలుస్తోంది. దానికి అనుగుణంగా తాజాగా సోనియా విందుకు టీడీపీ ఎంపీలు హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం.ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీని టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుగా వెళుతున్నాడు. ఢిల్లీలో చ‌క్రం తిప్పాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అంతే దూకుడుగా బెంగాల్ సీఎం మ‌మ‌త కూడా ముందుకు క‌దులుతోంది. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ముందుకు వ‌స్తున్నాయి. కానీ, బీజేపీ, కాంగ్రెసేత‌ర కూట‌మికి మాత్రం పెద్ద‌గా ఎవ‌రూ ఇంట్ర‌స్ట్ చూప‌డంలేదు. దేశ వ్యాప్తంగా రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మౌనంగా ఉన్నాడు. ఒక‌ప్పుడు ఢిల్లీ రాజ‌కీయాల‌ను ఒంటిచేత్తో న‌డిపిన చంద్ర‌బాబు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడ‌ని ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉన్న వాళ్లు న‌మ్మ‌లేక‌పోతున్నారు. తెర వెనుక మంత్రాంగం న‌డుపుతున్నాడ‌ని బాబు స‌న్నిహితుల వినికిడి.

కాంగ్రెస్ పార్టీతో పొత్తును కాద‌నుకున్నాం అనే విష‌యాన్ని 2019 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు చెప్ప‌లేదు. అలాగ‌ని, క‌లిసి వెళుతున్నాం అని కూడా ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో క‌లిసి వెళుతున్న‌ట్టు ఏపీ రాజ‌కీయాల‌ను, సోనియాతో ఎంపీల భేటీని చూస్తే అర్థం అవుతోంది. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోవాల‌నుకుంటున్న జ‌న‌సేన వైఖ‌రి స్ప‌ష్టం అయితే, ఏపీలోని కూట‌మికి ఒక రూపం వ‌స్తుంది. అప్పుడు టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ లు ఒక‌ట‌య్యే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా మ‌రోసారి కాంగ్రెస్ ప‌క్షాన చంద్ర‌బాబు నిల‌వ‌డ‌మే కాదు, మోడీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్ప‌డానికి ఛాన్స్ ఉంది. ఆ దిశ‌గా ఎంపీల రూపంలో ఢిల్లీ కేంద్రంగా తొలి అడుగు ప‌డింద‌ని చెప్ప‌డానికి సోనియాతో ఎంపీల విందు ఫోటో నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది.