Chandrababu : చంద్ర‌బాబుతో జ‌న గోదావ‌రి! 3 డేస్ `ఇదేం ఖ‌ర్మ‌..` హిట్‌!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు పాల్గొన్న‌ మూడు రోజుల `ఇదేం ఖ‌ర్మ‌..మ‌న రాష్ట్రానికి` కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయింది.

  • Written By:
  • Publish Date - December 2, 2022 / 03:51 PM IST

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు పాల్గొన్న‌ మూడు రోజుల `ఇదేం ఖ‌ర్మ‌..మ‌న రాష్ట్రానికి` కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయింది. ఆయ‌న రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు జ‌నం భారీగా త‌ర‌లిరావ‌డం టీడీపీకి ఎన‌లేని బ‌లాన్ని ఇచ్చింది. తొలి రోజు ఏలూరు రోడ్ షో క‌ర్నూలును మించిన విధంగా జ‌నం హాజ‌రుకావ‌డం క‌నిపించింది. రెండో రోజు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ జ‌నంతో కిక్కిరిసి పోయింది. ఆ స‌భ‌లో చంద్ర‌బాబు చేసిన ప్ర‌సంగం ప్ర‌జ‌ల్ని ఆలోచింప చేసింది. మూడో రోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో వివిధ వర్గాల మహిళలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వ‌హించారు. పథకాల తొలగింపు, టిడ్కో ఇళ్లు కేటాయించకపోవడం, పిల్లలు డ్రగ్స్ కు, గంజాయికి అలవాటు పడుతున్న అంశాల‌ను ఆ మ‌హిళ‌లు ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.

డ్వాక్రా సంఘాల‌కు చంద్ర‌బాబు 20ఏళ్ల క్రితం బీజం వేశారు. ఆనాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అండ్ కో ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. మ‌హిళ‌ల్ని బ‌య‌ట‌కు తీసుకురావ‌డం ఏమిటి? అంటూ ప్ర‌శ్నించారు. తొలి రోజుల్లో డ్వాక్రా సంఘాల్లో చేర‌డానికి వెనుకాడిన మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించారు చంద్ర‌బాబు. ఇప్పుడు అవే సంఘాలు రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించేవిగా మార‌డం విశేషం. ఇదే విష‌యాన్ని ముఖాముఖి సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు చంద్ర‌బాబు గుర్తు చేశారు. కుటుంబ ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని, ఆడబిడ్డలకు రాజకీయంగా 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ అంటూ ఆయ‌న గుర్తు చేశారు.

`మహిళలకు విద్యలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాను. ఐటీలో భర్తల కంటే భార్యలే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తుండడంతో వరకట్నం పోయింది. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. డ్వాక్రా బజార్లు పెట్టి ప్రమోట్ చేశాం. కానీ జగన్ డ్వాక్రా వాళ్లకు పథకాలు నిలిపివేశాడు` అంటూ జ‌గ‌న్ మీద విరుచుకుప‌డ్డారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కంటే మన ఇంటిని నడిపే మహిళా హోం మినిస్టర్ సమర్థులని కొనియాడారు. `లేని దిశ చట్టం పేరు చెప్పి జగన్ మోసం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో డ్వాక్రా సంఘాలు ముందు ఉండాలని నేను కోరుకున్నా” అని చంద్ర‌బాబు చెప్పారు.

రెండో రోజు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు సిద్దమవ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం సాయంత్రం పొద్దుపోయాక చంద్రబాబు పోలవరం వెళ్లేందుకు బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. దాదాపు అరగంట పాటు రోడ్డుపైనే కూర్చున్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో చంద్రబాబు ఆ మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. చివరకు పోలీసుల విజ్ఞప్తితో చంద్రబాబు ఆందోళన విరమించారు.

మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌జ‌ల‌కు గుర్తు చేశారు. 2019 ఎన్నిక‌ల్లో గెలిపించే ఉంటే అమరావతి పూర్తి చేసి ఉంటే 3 లక్షల కోట్ల ఆస్తులు రాష్ట్రానికి వచ్చేలా పాల‌న ఉండేద‌ని చంద్రబాబు నాయుడు వివ‌రించారు. అమరావతికి కులం పేరు పెట్టి దాన్ని చంపేశారని, తాను ఎప్పుడైనా ఒక్క కులానికి మద్దతు ఇచ్చిన సందర్భం ఉందా? అని చంద్రబాబు ప‌జ‌ల్ని అడిగారు. తన పక్కన నలుగురు ఉంటే వాళ్లు ఎవరు అనేది కూడా చూసుకుంటా అని, అన్ని వర్గాలకు అంత ప్రాధాన్యం ఇస్తానన్నారు. సిఎం, డిజిపి, సిఎస్, సలహాదారు సజ్జల అంతా కడప జిల్లా వారినే జ‌గ‌న్ పక్కన పెట్టుకున్నాడని ఆయ‌న మండిపడ్డారు.

రాష్ట్రాన్ని సాయిరెడ్డి, సజ్జల, పెద్ది రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారని మీ పార్టీలో ఇక వేరే మగాళ్లు లేరా? అంతా ఒక వర్గం వాళ్లే ఉండాలా అని నిలదీశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాలకు ఏం పదవులు ఇచ్చారో సిఎం చెప్పాలన్నారు. బిసిలకు ఏం చేశామో చెబుతామని, ఆ విషయంలో జగన్మోహన్‌ రెడ్డి చర్చకు సిద్దమా? అని స‌వాల్ విసిరారు. తన జీవితం తెరచిన పుస్తకమని, తాను ఎప్పుడూ తప్పు చేయనన్నారు. అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ఉతికి ఆరేస్తానని హెచ్చరించారు. మొత్తం మీద మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంతో పాటు టీడీపీ చేసిన మేలును గుర్తు చేస్తూ ప్ర‌జ‌ల్ని చంద్ర‌బాబు ఆక‌ట్టుకున్నారు.