Site icon HashtagU Telugu

Chandrababu Case : చంద్ర‌బాబు అరెస్ట్ కు సీఐడీ సిద్ధం?

Chandrababu Cid

Chandrababu Cid

అమ‌రావ‌తి ల్యాండ్ పూలింగ్ మాజీ సీఎం చంద్ర‌బాబును వెంటాడుతోంది. మ‌రోసారి ఏపీ సీఐడీ పోలీసులు ఆయ‌న‌పై ఏ1 గా కేసు న‌మోదు చేశారు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌క్రిష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు మొత్తం 14 మంది పేర్ల‌ను పొందుప‌రుస్తూ ఎఫ్ ఐఆర్ న‌మోదు అయింది. మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై మరో కేసు నమోదయింది.ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ ను పేర్కొన్నారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

అమ‌రావ‌తి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లో అక్రమాలు జ‌రిగాయ‌ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌క్రిష్ణారెడ్డి ఏప్పిల్‌ 4 వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు మాజీ సీఎం చంద్ర‌బాబు, మాజీ మంత్రి నారాయ‌ణ‌తో స‌హా 14 మందిపై ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తు చేసిన త‌రువాత వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు సీఐడీ చెబుతోంది. మే 6వ తేదీ ప్రాథమిక నివేదిక సిద్దం చేసిన సీఐడీ మే 9 వ తేదీన ఎఫ్ఐఆర్ త‌యారు చేశారు. మొత్తం 14 మందిని నిందితులుగా ఎఫ్ ఐఆర్ లో చేర్చారు.

రాజధాని ల్యాండ్ పూలింగ్‌పై నమోదు చేసిన కేసుల్లో చంద్రబాబు, నారాయణతో పాటు మొత్తం పధ్నాలుగు పేర్లు ఉన్నాయి. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు, అధికారులు అనే పేరుతో పధ్నాలుగో కాలమ్ ఉంచారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన దాని ప్రకారం రాజధానికి భూములిచ్చిన రైతులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే ఫిర్యాదు చేశారు. ల్యాండ్ పూలింగ్ కేసులు గతంలోనే తేలిపోయాయి కాబట్టి ఈ సారి కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో మార్పుచేర్పులు చేశారని ఆళ్ల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మార్పుల కార‌ణంగా సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని, ఇతరులు లబ్ది పొందారని పొందుపరిచారు. గతంలో ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరుడు జూపూడి జాన్సన్ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసిన విష‌యం విదిత‌మే. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది లేదని సుప్రీంకోర్టు తేల్చింది. రాజధాని భూముల్లో భారీ అక్రమాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్లయినా ఎలాంటి అవినీతి నిరూపించలేకపోయారు. పైగా అమరావతికి భూముల్చిచన ముఫ్పై వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా అక్రమాలు జరిగాయని పిర్యాదు చేయలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుడు జూపూడి జాన్సన్ పేరుతో గతంలో ఫిర్యాదులు చేయడంతో అమరావతి ప్రాంతంలో భూములు ఉన్న అనేక మందిపై కేసులు నమోదు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది లేదని తేల్చి చెప్పింది. ఈ సారి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లో అక్రమాల పేరుతో కేసులు పెట్టి అరెస్టుల‌ను ప్రారంభించారు.