Chandrababu : కృష్ణా జిల్లాపై చంద్ర‌బాబు ఆప‌రేష‌న్‌, అభ్య‌ర్థులు వీళ్లే!

ఏపీలోని మిగిలిన జిల్లాల‌కు భిన్నంగా కృష్ణా జిల్లా రాజ‌కీయం ఉంటుంది. అక్క‌డి నేత‌లు ఎవ‌రికివారే రారాజులుగా భావిస్తుంటారు

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 11:56 AM IST

ఏపీలోని మిగిలిన జిల్లాల‌కు భిన్నంగా కృష్ణా జిల్లా రాజ‌కీయం ఉంటుంది. అక్క‌డి నేత‌లు ఎవ‌రికివారే రారాజులుగా భావిస్తుంటారు. అధిష్టానం మాట ఒక మాత్ర‌న వాళ్ల‌కు చెవికెక్క‌దు. ఆ జిల్లా నేత‌ల్ని సెట్ చేయ‌డానికి టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. 40ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వాన్ని రంగ‌రించి కృష్ణా జిల్లా టీడీపీని సెట్ చేస్తూ కీల‌క నిర్ణ‌యాల‌ను ఆయ‌న తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

కృష్ణా జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌ర్వే చేయించిన చంద్ర‌బాబు బెజవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ ఎంపీగా ఉన్న కేశినేని నాని విజ‌య‌వాడ ప‌శ్చిమ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని సమాచారం. ఆ మేర‌కు సోదరుల‌కు పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చిన‌ట్టు పార్టీలోని వినికిడి.

అంతర్గత సర్వేల్లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా అర్హులకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అగ్ర‌నేత‌లు నిర్ణ‌యించారు. మరో రెండు దశాబ్దాలకు సరిపడా లోకేష్ కు సొంత టీమ్ ను ఇచ్చేలా ప్లాన్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. జనసేన పొత్తులో భాగంగా 25 నుంచి 30స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. వాటిని ప‌క్క‌న పెడితే మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను టీడీపీ ముందస్తుగా ఖ‌రారు చేస్తోంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు చేస్తోన్న చంద్ర‌బాబు ప‌నిచేసే వాళ్ల‌కు టిక్కెట్లు అనే సంకేతం ఇస్తున్నారు.

కృష్ణా జిల్లా నందిగామ నియోజక వర్గం నుంచి సౌమ్య పేరు వినిపిస్తోంది. జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య మైలవరం నుంచి దేవినేని ఉమ, తిరువూరు నుంచి వాసం మునియ్య లేదా ఉప్పులేటి కల్పన ,డివై దాస్ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. విజయవాడ పశ్చిమం నుంచి తాజా ఎంపీ కేశినేని నాని పేరును ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌వాడ సెంట్రల్ నుంచి బోండా ఉమ, తూర్పు నుంచి జనసేన‌కు పొత్తులలో భాగంగా నాదెండ్ల మనోహర్ పోటీ చేసే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) పేరు దాదాపుగా ఖ‌రారు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. లోకేష్ టీమ్ లోని మెంబ‌ర్ గా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. బందర్ అసెంబ్లీ కి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. గన్నవరం నుంచి గద్దె అనురాధ, పెడనకు కొనకళ్ళ నారాయణ, పెనమలూరు కు బొడే ప్రసాద్, పామర్రుకు వర్ల కుమార్ రాజా పేరు వినిపిస్తోంది. అయితే, ఆయ‌న మీద వ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వేల్లో తేలుతోంది. చివ‌రి నిమిషంలో అత‌న్ని మార్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. గుడివాడ అసెంబ్లీకి కొత్త యువకుని ఎంపిక చేయాల‌ని అన్వేష‌ణ‌లో పార్టీ ఉంది. పొత్తులలో భాగంగా జనసేనకు అవనిగడ్డ కేటాయించాల‌ని భావిస్తోంది. బందర్ పార్లమెంట్ కు బాడిగ రామకృష్ణ లేదా ఆయన కుమార్తెను ఫైన‌ల్ చేయ‌డానికి టీడీపీ సిద్ధం అయింది.

ప్ర‌స్తుతానికి టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు త‌యారు చేసిన ప్రాథ‌మిక జాబితా చివ‌రి నిమిషంలో మారే అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే, జాతీయ పార్టీ పెడుతోన్న కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయ‌నతో జ‌న‌సేన పొత్తు అనే అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. అదే జ‌రిగితే, ఏపీ రాజ‌కీయ ఈక్వేష‌న్లు పూర్తిగా తారుమారు అవుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికైతే, కృష్ణా జిల్లాను సెట్ చేయ‌డానికి చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాల్లో భాగంగా అభ్య‌ర్థుల జాబితా త‌యార‌యిన‌ట్టు తెలుస్తోంది.