Chandrababu : ఏపీ వ‌ల్ల‌కాడు..చంపేస్తున్నారు: చంద్ర‌బాబు

సీఎం జ‌గ‌న్ ఏపీని వ‌ల్లకాడుగా మార్చార‌ని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబు ఆవేద‌న చెందారు. వైఎస్. వివేకా హ‌త్య కేసులోని నిందితుల్ని చంపేస్తార‌ని ఎప్పుడో చెప్పామ‌ని గుర్తు చేశారు

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 04:22 PM IST

సీఎం జ‌గ‌న్ ఏపీని వ‌ల్లకాడుగా మార్చార‌ని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబు ఆవేద‌న చెందారు. వైఎస్. వివేకా హ‌త్య కేసులోని నిందితుల్ని చంపేస్తార‌ని ఎప్పుడో చెప్పామ‌ని గుర్తు చేశారు. మూడేళ్ల లో జ‌రిగిన హ‌త్య‌లు, అరెస్ట్ లు, అత్యాచారాలు ఇత‌ర రాజ‌కీయ నేరాల‌తో కూడిన పుస్త‌కాన్ని `వైసీపీ దమనకాండ` పేరుతో ఆయ‌న విడుద‌ల చేశారు. సంచ‌ల‌నం క‌లిగించిన మొత్తం 17 అంశాలపై టీడీపీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది.

ఏపీలో శాంతి భద్రతలు లేవన్నారు. కొత్త డీజీపీ వచ్చినప్ప‌టికీ మార్పు లేదని విమ‌ర్శించారు. నేరస్తులకు వంతపాడే స్థితిలో డీజీపీ ఉన్నారంటూ ఆరోపించారు. పోలీసులు ఖాకీ బట్టలకు న్యాయం చేయాలన్నారు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని అయోమ‌యంలో ప్రజలు ఉన్నారన్నారు. గత మూడేళ్లలో 32 మంది టీడీపీ నేతలను హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. 4వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దాడుల భయంతో ఆత్మకూరు, మాచర్లను వదిలి కొన్ని కుటుంబాలు వెళ్లాయని తెలిపారు. దళిత, గిరిజన, బీసీ నేతలపై దమనకాండ చేస్తున్నారని ఆరోపించారు. వేధింపులు తట్టుకోలేక మైనార్టీలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జరిగాయన్నారు. గత మూడేళ్లలో 2552 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 422 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్ల‌డించారు. నాటు సారా వల్ల 232 మంది చనిపోయారని చంద్రబాబు చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 62 మంది చనిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి దుర్మార్గానికి విద్యార్థులు బలయ్యారని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు.

60 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని, నలుగురు మాజీ మంత్రులను జైలుకు పంపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మీడియాను కూడా వదల్లేదన్నారు. ఇంత జరుగుతున్నా సీబీఐ పట్టించుకోదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సానుభూతి పొందాలని చూశారన్నారు. ఇప్పుడు వివేకా కేసులో సాక్షులను చంపేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలకు దిగారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్ ను వైసీపీ ఎమ్మెల్సీనే కొట్టి చంపడం దారుణమన్నారు. హంతకుడుగా మారిన‌ ఎమ్మెల్సీ కేసును పక్కదారి పట్టించేందుకు కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో సామాజిక న్యాయం కాదు సామాజిక హత్యలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ రెడ్డి ఐరెన్ లెగ్ ముఖ్యమంత్రి అన్న టీడీపీ అధినేత ఆయన పాలన మొదలైనప్పటి నుంచి అంతా వినాశనమే జరుగుతుందని గుర్తు చేశారు.