Daggubati : చంద్ర‌బాబు చాణక్యంతో `ద‌గ్గుబాటి` డైల‌మా

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబునాయుడు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబాలు ఒక‌ట‌వుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 05:34 PM IST

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబునాయుడు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబాలు ఒక‌ట‌వుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు ద‌గ్గుబాటి హితేష్ చెంచురామ్ కు ప‌ర్చూరు టీడీపీ టిక్కెట్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అదే జ‌రిగితే, ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబ‌శివ‌రావు ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్ప‌న్నం అయింది. కానీ, తాజాగా సిట్టింగ్ లు అంద‌రికీ చంద్ర‌బాబు టిక్కెట్ల‌ను ఖ‌రారు చేయ‌డంతో పాటు సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇచ్చే ధైర్యం ఉందా? అంటూ జ‌గ‌న్ కు స‌వాల్ విసిరారు.

వాస్త‌వంగా తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ల‌లో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మద్దాల‌గిరి, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ పంచ‌న ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా టీడీపీకి అట్టీముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. ఆ న‌లుగురు కాకుండా ఇంకా 19 మంది మాత్ర‌మే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ల‌కు టిక్కెట్లను ఖ‌రారు చేస్తూ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఆ నలుగురి ప‌రిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా ఉంది.

సిట్టింగ్ ల‌కు 2024 ఎన్నికల్లో టిక్కెట్ల‌ను వెల్ల‌డిస్తూ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం ద‌గ్గుబాటి కుటుంబాన్ని ఆలోచ‌న‌లో ప‌డేసింద‌ట‌. అంతే కాకుండా రెబ‌ల్ ఎమ్మెల్యేల బ‌దులుగా ఎవ‌రి అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేస్తారు? అనే చర్చ మొద‌ల‌యింది. పొత్తులతో సంబంధం లేకుండా సిట్టింగ్ ల‌కు టిక్కెట్ల‌ను ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు ఒంట‌రిగా 2024 ఎన్నిక‌ల‌కు వెళుతున్నారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. మొత్తం మీద చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం సొంత పార్టీ వాళ్ల‌నే కాకుండా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను కూడా ఆలోచింప చేస్తోంది.

ఒక వేళ చంద్ర‌బాబు పొత్తుల‌కు వెళితే ఎవరికి ఏ సీటు అన్నది ఇప్పుడే చెప్ప‌లేం. కానీ దూకుడుగా ముందే అభ్యర్థులను బాబు ప్రకటించేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మరికొందరికి కూడా టికెట్ కన్ఫాం చేశారు. దీంతో ఒంటరి పోరాటం చేయ‌డానికి టీడీపీ సిద్ధం అవుతుంద‌న్న సంకేతం బ‌లంగా వెళుతోంది. దాదాపు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 35కి పైగా అభ్యర్థులను ఖరారు చేసిన‌ట్టు పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సిట్టింగ్ ల‌తో పాటు మరో 15 మంది అభ్యర్థులను చంద్రబాబు ఇప్పటికే ఫైనల్ చేశారు.
ఆ జాబితాలో
1 అవ‌నిగ‌డ్డ: మండలి బుద్ధ‌ప్ర‌సాద్ 2.పెన‌మ‌లూరు: బోడే ప్ర‌సాద్ 3.సంత‌నూత‌ల‌పాడు: విజ‌య్‌కుమార్ 4.మార్కాపురం: కందుల నారాయ‌ణ‌రెడ్డి 5.రాజంపేట: బ‌త్యాల చెంగ‌ల్రాయుడు 6.ఒంగోలు: దామ‌చ‌ర్ల జానార్థ‌న్ 7.మైదుకూరు: పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ 8.ఆళ్ల‌గ‌డ్డ: భూమా అఖిల ప్రియ 9.పుంగ‌నూరు: చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి 10.గుంటూరు తూర్పు: మ‌హ్మ‌ద్ న‌జీర్ 11.పీలేరు: నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి 12.పులివెందుల: బీటెక్ రవి 13.డోన్: ధర్మవరం సుబ్బారెడ్డి 14.ఆముదాలవలస: కూన రవికుమార్ 15. ముమ్ముడివరం: ఎమ్మెల్యే దాట్ల బాపిరాజు ఉన్నారు.
టీడీపీ చీఫ్ తాజా ప్ర‌క‌ట‌న త‌రువాత ఒంట‌రిపోరాటంతో పాటు గెలిచేవాళ్ల‌కు ముందుగా స్ప‌ష్ట‌త ఇచ్చేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తం మీద ద‌గ్గుబాటి టీడీపీ వైపు చూస్తున్నార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారానికి చంద్ర‌బాబు చెక్ పెట్టినట్టు క‌నిపిస్తోంది.