Nandamuri Family : ‘నంద‌మూరి’పై ‘మ‌హా’ఎత్తుగ‌డ‌

నంద‌మూరి ఫ్యామిలీని ఒక వేదిక‌పైకి తీసుకురావ‌డానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు మాస్ట‌ర్ స్కెచ్ వేస్తున్నాడు.

  • Written By:
  • Updated On - March 3, 2022 / 01:08 PM IST

నంద‌మూరి ఫ్యామిలీని ఒక వేదిక‌పైకి తీసుకురావ‌డానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు మాస్ట‌ర్ స్కెచ్ వేస్తున్నాడు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా ఆ దృశ్యాన్ని ప్ర‌జ‌ల‌కు చూపించ‌డానికి వ్యూహాన్ని ర‌చించాడు. ప్ర‌త్యేకించి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం వేదిక‌పైన ఫోక‌స్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. నారా, నంద‌మూరి ఫ్యామిలీల మ‌ధ్య గ్యాప్ లేద‌నే సంకేతాన్ని క్యాడ‌ర్ మ‌ధ్య‌కు తీసుకెళ్లాల‌ని భావిస్తున్నాడు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చ‌రిష్మాను పూర్తి స్థాయిలో 2024 ఎన్నిక‌ల్లో వాడుకోవ‌డానికి బాబు ఎత్తుగ‌డ వేస్తున్నాడు. అంత‌ర్గ‌తంగా పార్టీలో జ‌రుగుతోన్న న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డానికి మ‌హానాడు వేదిక‌ను ఉప‌యోగించుకోవాల‌ని స్కెచ్ వేస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌మావేశం గురువారం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ లో జరుగుతోంది. ఆ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకోనున్నారు. ప్ర‌త్యేకించి జ‌గ‌న్ స‌ర్కార్ వేస్తోన్న ఎత్తుగ‌డ‌ల‌ను తిప్పికొట్టే అంశాల‌పై సీరియ‌స్ ఎజెండాను ఉంచారు. ఎందుకంటే, మంత్రి కొడాలి రూపంలో తెలుగుదేశం పార్టీ రెండుగా ఉంద‌నే సంకేతం బ‌లంగా వెళుతోంది. ఇప్పుడున్నది చంద్ర‌బాబు తెలుగుదేశం అంటూ వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. ఎన్టీఆర్ టీడీపీ ఎప్పుడో పోయింద‌ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా ప్ర‌త్య‌ర్థులు తీసుకెళుతున్నారు. దానికి తోడుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను దూరంగా పెట్టార‌న్న ప్ర‌చారం ఆయ‌న అభిమానుల్లో బ‌లంగా వెళ్లింది.

జన‌సేనాని న‌టించిన బీమ్లా నాయ‌క్ సినిమాకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డంతో జూనియ‌ర్ ను టార్గెట్ చేయ‌డానికి చంద్ర‌బాబు అండ్ కో ప్లాన్ చేశార‌ని ఆయ‌న అభిమానులు విశ్వ‌సిస్తున్నారు. పైగా బాల‌క్రిష్ణ న‌టించిన అఖండ సినిమాకు మ‌ద్ధ‌తు పార్టీ నుంచి ల‌భించ‌లేదు. వీట‌న్నింటిపై ఫోక‌స్ పెట్టిన వైసీపీ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చ‌రిష్మాను ఓన్ చేసుకునే విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామ‌క‌ర‌ణం చేయ‌డం ద్వారా నంద‌మూరి ఫ్యామిలీ జ‌గ‌న్ కు జై కొడుతోంది. గుడివాడ‌లోని నంద‌మూరి ఫ్యామిలీ ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ తో భేటీ అయింది. అంతేకాదు, కృష్ణా , గుంటూరు జిల్లాల్లోని క‌మ్మ సంఘాలు జ‌గ‌న్ కు స‌న్మాన స‌భ పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ ను ఎంతో కొంత వైసీపీకి వెళ్లే ఛాన్స్ ఉంది.స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చరిష్మా కోసం వైసీపీ వేస్తోన్న ఎత్తుగ‌డ‌కు చెక్ పెట్టేలా నంద‌మూరి ఫ్యామిలీని మ‌హానాడు వేదిక‌పైకి తీసుకొచ్చే అంశంపై పొలిట్ బ్యూరో చ‌ర్చించింది. ఆ వేదిక పై నుంచి చంద్ర‌బాబు, లోకేష్ నాయ‌క‌త్వాన్ని నంద‌మూరి ఫ్యామిలీ ముక్త‌కంఠంతో మ‌ద్ధ‌తు ప‌లికేలా భారీ స్కెచ్ సిద్ధం అయింది. దీనితో పాటు మూడు రోజుల పాటు ఈసారి మ‌హానాడును హైద‌రాబాద్ లోని గండిపేట‌లో నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ ఉంద‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు హైద‌రాబాద్ కేంద్రంగా మ‌హానాడు నిర్వ‌హించ‌బోతున్నాడు. గ‌త రెండేళ్లుగా మ‌హానాడు కేవ‌లం జూమ్ ద్వారా మాత్ర‌మే జ‌రిగింది. దీంతో ఈసారి ఘ‌నంగా చేయాల‌ని పొలిట్ బ్యూరో భావిస్తోంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను ఏడాది పాటు నిర్వ‌హించాల‌ని బ్యూరో నిర్ణ‌యించింది. జ‌గ‌న్ స‌ర్కార్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంద‌ని బాబు విశ్వ‌సిస్తున్నాడు. అందుకే, శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను వ‌చ్చే ఏడాది వ‌ర‌కు జ‌ర‌ప‌డం ద్వారా ఎన్టీఆర్ చ‌రిష్మా పూర్తిగా టీడీపీకి మాత్ర‌మే ఉండేలా స్కెచ్ వేశాడు. మొత్తం మీద గురువారం జ‌రుగుతోన్న పొలిట్ బ్యూరో స‌మావేశంలో కీల‌క‌మైన భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను చంద్ర‌బాబు రచించ‌బోతున్నాడు. అమరావ‌తి, ప్ర‌త్యేక హోదా , పోల‌వ‌రం త‌దిత‌ర విభ‌జ‌న అంశాల‌తో పాటు జ‌గ‌న్ నేర ప్ర‌వృత్తిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని టీడీపీ ప్లాన్ చేస్తోంది. అందుకోసం స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను వాడుకోవాల‌ని భారీ స్కెచ్ వేసింది. సో…జూనియ‌ర్ తో స‌హా నంద‌మూరి ఫ్యామిలీ మ‌హానాడు వేదిక‌పై క‌నిపించేలా బాబు వేస్తోన్న ఎత్తుగ‌డ ఎంత వ‌ర‌కు ఫలిస్తుందో..చూద్దాం.!