Site icon HashtagU Telugu

Chandrababu Naidu : హ‌ర్యానా ర్యాలీకి చంద్ర‌బాబు దూరం?

Chandrababu Nitish Kumar

Chandrababu Nitish Kumar

బీహార్ సీఎం నితీష్‌, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుకు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజ‌కీయంగా మంచి మిత్రులు. ఎన్డీయేలో క‌లిసి ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. జాతీయ రాజ‌కీయాల‌ను ఒక‌ప్పుడు కీల‌క ద‌శ‌కు తీసుకెళ్లిన లీడ‌ర్లు వాళ్లిద్ద‌రు. ఇప్పుడు మ‌ళ్లీ వాళ్లిద్ద‌రూ క‌లిసే ఛాన్స్ ఉందా? బీజేపీ వ్య‌తిరేక కూట‌మికి చంద్ర‌బాబు జై కొడ‌తారా? కేసీఆర్ వేదిక‌ను బాబు పంచుకుంటారా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. వీటికి స‌మాధానం చెప్ప‌డానికి ఇప్ప‌టికిప్పుడు టీడీపీ ఏ మాత్రం స‌న్న‌ద్ధంగా లేదు.

ఢిల్లీ రాజ‌కీయాల కంటే ఏపీ ప్ర‌యోజ‌నాల‌పై చంద్ర‌బాబు ఇట్ర‌స్ట్ ఎక్కువ‌గా ఉంది. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో విప‌క్షాల‌తో క‌లిసి న‌డిస్తే ఏపీకి వ‌చ్చే బెనిఫిట్ ఏమిటి? అనే ప్ర‌శ్న చంద్ర‌బాబు వేసుకుంటారు. ఆ కోణం నుంచి ఆలోచిస్తే, ఈనెల 25న హ‌ర్యానాలో జ‌రిగే విప‌క్షాల ర్యాలీకి ఆయ‌న హాజ‌ర‌య్యే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. ఆ ర్యాలీకి హాజ‌రు కావాల‌ని ఇండియ‌న నేష‌న‌ల్ లోక్ ద‌ళ్‌( ఐఎన్ ఏ ల్ డీ) చీఫ్ ఓపీ చౌతాలా ఆయ‌న‌కు ఆహ్వానం పంపించారు. దీంతో కేసీఆర్‌, చంద్ర‌బాబు ఒకే వేదిక‌పైకి రానున్నార‌ని అప్పుడే ప‌లు ర‌కాల క‌థ‌నాల హోరు సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లైయింది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ తో క‌లిసి చంద్ర‌బాబు వేదిక‌ను పంచుకోవ‌డానికి సిద్ధంగా లేడ‌ని టీడీపీ వ‌ర్గాల్లోని వినికిడి.

ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని నితీష్‌, కేసీఆర్‌, మ‌మ‌త‌, కేజ్రీవాల్ , శ‌ర‌ద్ ప‌వార్ ఆశిస్తున్నారు. అందుకే వాళ్లు విప‌క్షాల కూట‌మి కోసం ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ కూట‌మి వెనుక‌ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఉన్నారు. ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు. అలాగే, తెలంగాణ సీఎం కేసీఆర్, జ‌గ‌న్ ఇద్ద‌రూ సహ‌జ మిత్రులుగా ఉన్నారు. ఇలాంటి ఈక్వేష‌న్ న‌డుమ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విపై ఏ మాత్రం ఆశ‌లేని చంద్ర‌బాబు హ‌ర్యానా ర్యాలీకి హాజ‌రు అయ్యే అవ‌కాశం చాలా స్వ‌ల్పం.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా కేంద్రంలోని ఎన్డీయేకు ద‌గ్గ‌ర కావాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నార‌ని పార్టీలో జ‌రుగుతోన్న బ‌ల‌మైన చ‌ర్చ‌. అందుకోసం ఇద్ద‌రు మాజీ ఎంపీలు తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ నేప‌థ్యంలో జాతీయ‌, ప్రాంతీయ మీడియాలోనూ `ఎన్డీయేలోకి టీడీపీ` అనే న్యూస్ ఇటీవ‌ల‌ హైలెట్ అయింది. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వుల కోసం ఎన్డీయే నిలిపిన అభ్య‌ర్థుల‌కు టీడీపీ ఓటు వేసింది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఆజాదీకా అమృత మ‌హోత్స‌వ్ వేడుకల్లో చంద్ర‌బాబు, మోడీ ఆరేళ్ల త‌రువాత మాట‌లు క‌లిపారు. చంద్ర‌బాబు విజ‌న్ ను ఏపీ బీజేపీ చీఫ్ వీర్రాజు ఇటీవ‌ల ప్ర‌శంసించారు. చంద్ర‌బాబు భ‌ద్ర‌త కోసం క‌మాండోల సంఖ్య‌ను పెంచుతూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఇవ‌న్నీ బీజేపీ, టీడీపీ ద‌గ్గ‌ర‌వుతున్నాయ‌ని గ్ర‌హించ‌డానికి అనుకూల అంశాలు.

ఏపీ, తెలంగాణాల్లో జ‌గ‌న్, కేసీఆర్ ను రాజ‌కీయంగా ఎదుర్కోవ‌డానికి బీజేపీ మ‌ద్ధ‌తు కావాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని ఆయ‌న కోట‌రీలోని కొంద‌రు చెప్పుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో జ‌తక‌ట్టి బాగా న‌ష్ట‌పోయిన చంద్ర‌బాబు ఈసారి బీజేపీ ద్వారా లాభ‌ప‌డాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో మోడీని బాహాటంగా వ్య‌తిరేకిస్తోన్న కేసీఆర్‌, నితీష్ , మ‌మ‌త‌, కేజ్రీవాల్ త‌దితరులు క‌లిసిన వేదిక‌ను చంద్ర‌బాబు పంచుకోవ‌డం అంటూ జ‌రిగితే అనూహ్య ప‌రిణామం కింద చూడాల్సిందే.

మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి రావాలంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్ర‌బాబు ల‌కు ఆహ్వానాలు అందాయి. వీళ్లంద‌రూ క‌లిసి బీజేపీ వ్య‌తిరేక కూట‌మిగా ఏర్పడాల‌ని చూస్తున్నారు. మిగిలిన వాళ్ల సంగ‌తేమోగానీ చంద్ర‌బాబు మాత్రం హ‌ర్యానా ర్యాలీకి వెళ్ల‌ర‌ని తెలుస్తోంది.