Chandrababu Naidu : కుప్పంపై చంద్ర‌బాబు స్వారీ

ప్ర‌త్య‌ర్థులకు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా చాణ‌క్యం న‌డిపేందుకు టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు కుప్పంకు మ‌కాం మార్చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - August 24, 2022 / 01:00 PM IST

ప్ర‌త్య‌ర్థులకు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా చాణ‌క్యం న‌డిపేందుకు టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు కుప్పంకు మ‌కాం మార్చేస్తున్నారు. అక్క‌డే కొత్త ఇళ్లు నిర్మాణం కూడా జ‌రుగుతోంది. చంద్ర‌బాబు కంచుకోట‌గా ఉన్న కుప్పంపై వైసీపీ సీరియ‌స్ గా ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను ఓడిస్తామంటూ మైండ్ గేమ్ మొద‌లు పెట్టింది. తొలి రోజుల్లో ఆ మైండ్ గేమ్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోని చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తూ కుప్పంకు త‌ర‌చూ వెళుతున్నారు. ఈసారి మూడు రోజుల పాటు అక్క‌డ ఉండేదుకు షెడ్యూల్ ఖ‌రారు చేయ‌డం గ‌మ‌నార్హం.

మూడు రోజుల పర్యటనలో ఆయన క్లస్టర్, యూనిట్ క్లస్టర్, బూత్ ఇన్ఛార్జీలతో ముఖాముఖి నిర్వ‌హిస్తారు. క్షేత్ర‌స్థాయిలోని లీడ‌ర్ల‌ పని తీరుపై సమీక్షిస్తారు. అంతేకాదు పార్టీ సభ్యత్వ నమోదును పెంచే ప్ర‌య‌త్నం చేస్తారు. సభ్యత్వ నమోదులో కుప్పం రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న విష‌యం విదిత‌మే. ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయబోతున్నారు. ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓటు నమోదు చేయిస్తోన్న వైసీపీ కుట్ర‌ల‌కు ఇప్ప‌టి నుంచే చెక్ పెడుతున్నారు. కుప్పం పరిధిలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా, ప్రతి క్లస్టర్ కు 45 నిమిషాల సమయాన్ని చంద్రబాబు కేటాయించార‌ని తెలుస్తోంది.

క్లస్టర్లలోని సుమారు 50 మంది ప్రధాన నేతలతో భేటీ కానున్నారు. ఇదే టూర్లో కుప్పం – పలమనేరు హైవే పక్కన నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. వీరిపై పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. అందుకే, పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. ఆ విధంగానే గత 8 నెలల్లో చంద్ర‌బాబు కుప్పంకు వెళ్తుండటం ఇది మూడో సారి కావడం గమనార్హం. మొత్తం మీద చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకుంద‌ని వైసీపీ సంబ‌ర‌పడుతోంది. ఆ సంబ‌రాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు నీరుగార్చ‌డానికి చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌లు వేస్తూ స‌ఫ‌లం అవుతున్నారు.