Chandrababu Naidu : ఢిల్లీ వేదిక‌పై `చంద్ర‌బాబు` టాపిక్

బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ, మాజీ ఆర్థిక మంత్రి య‌శ్వంత్ సిన్హా, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య సాన్నిహిత్యం ఉంది.

  • Written By:
  • Updated On - July 15, 2022 / 11:13 AM IST

బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ, మాజీ ఆర్థిక మంత్రి య‌శ్వంత్ సిన్హా, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య సాన్నిహిత్యం ఉంది. మాజీ ప్రధాని వాజ్ పేయ్ హ‌యాం నుంచి సిన్హాతో బ‌ల‌మైన త‌త్సంబంధాలు ఉన్నాయి. కానీ, జాతీయ స్థాయిలో విప‌క్షాలు చేసిన పొర‌బాటు కార‌ణంగా చంద్ర‌బాబు విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న సిన్హాకు దూరం అయ్యార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని ప‌రోక్షంగా య‌శ్వంత్ సిన్హా తాజాగా చెబుతూ విప‌క్షాలు ఏర్పాటు చేసుకున్న ఢిల్లీ స‌మావేశం గురించి ప్ర‌స్తావించారు.

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించడానికి ముందుగా రెండుసార్లు ఢిల్లీ వేదిక‌గా 22 పార్టీల‌తో కూడిన విప‌క్షాల ప్ర‌తినిధులు హాజర‌య్యారు. కాంగ్రెస్, బీజేపీకి దూరంగా ఉన్న పార్టీల‌కు కూడా ఆహ్వానాల‌ను ఆ రోజున బెంగాల్ సీఎం ఆధ్వ‌ర్యంలో పంపారు. కానీ, చంద్ర‌బాబుకు మాత్రం విప‌క్షాల స‌మావేశం ఆహ్వానం అంద‌లేదు. ఆ విష‌యాన్ని తాజాగా సిన్హా ప్ర‌స్తావించారు. ఎందుకు విప‌క్ష పార్టీల స‌మావేశానికి బాబును ఆహ్వానించ‌లేదో, తెలియ‌దంటూ ముక్తాయించారు. ఒక‌వేళ విప‌క్షాల నుంచి ఆహ్వానం లేక‌పోయిన‌ప్ప‌టికీ ముర్ముకు మ‌ద్ధ‌తు ఇస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం క‌రెక్ట్ కాదంటూ లాజిక్ తీశారు. ఆత్మ‌సాక్షాత్క‌రం ప్ర‌కారం ఓటేయాల‌ని పిలుపునిచ్చారు.

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ధ‌తు ప‌ల‌కాల‌ని ఎన్డీయే, యూపీఏ రెండూ డైరెక్ట్ గా చంద్ర‌బాబును కోర‌లేదు. విప‌క్షాల కూట‌మి కూడా ఆయన్ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని కూడా బ‌హిరంగంగా ఎవ‌రూ మ‌ద్ధ‌తు అడ‌గ‌లేదు. కానీ, బీజేపీ పెద్ద‌లు మ‌ద్థ‌తు అడిగార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. అదే త‌ర‌హాలో బీజేపీలోని కొంద‌రు లీడ‌ర్లు మ‌ద్ధ‌తు అడిగార‌ని టీడీపీ నుంచి వినిపిస్తోంది. వాస్త‌వంగా ఆ రెండు పార్టీల మ‌ద్ధ‌తును అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ లేదా విప‌క్షాల కూట‌మి బ‌హిరంగంగా కోర‌లేదు. అయితే, రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఆదివాసీ మ‌హిళ ముర్మును బీజేపీ ప్ర‌క‌టించింది. సామాజిక ఈక్వేష‌న్ గురించి ఆలోచించిన బాబు ఆమెకు మ‌ద్ధ‌తు ప‌లికారు.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారం క్ర‌మంలో ఏపీకి వ‌చ్చిన ముర్ముకు సీఎం జ‌గ‌న్ ఆహ్వానం ప‌లికారు. ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి ముర్ముకు ఓటేయాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చాడు. ఆ త‌రువాత వైసీపీ శిబిరం నుంచి నేరుగా టీడీపీ ఒక ప్రైవేటు హోట‌ల్ లో ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఆమె హాజ‌ర‌య్యారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు కూడా ముర్ముకు మ‌ద్ధ‌తు ఇస్తూ ఎమ్మెల్మేలు, ఎంపీల‌కు పిలుపునిచ్చారు. దీంతో ఏపీ రాజ‌కీయ పార్టీలు హోల్‌సేల్ గా బీజేపీ పంచ‌న చేరిన‌ట్టే క‌నిపిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశం మేర‌కు టీడీపీ శిబిరానికి ముర్ము హాజ‌ర‌య్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కార‌ణం ఏదైనప్ప‌ట‌కీ చంద్ర‌బాబు, జ‌గ‌న్ బీజేపీకి దాసోహం అన‌డం సిన్హాకు న‌చ్చ‌లేదు. ఆ విష‌యాన్ని ఢిల్లీ వేదిక‌గా ప్ర‌స్తావిస్తూ బాబు నిర్ణ‌యాన్ని సిన్హా త‌ప్పుబ‌ట్టారు.

సంక్షోభంలోనూ అవ‌కాశాల‌ను వెదుక్కోవాల‌ని క్యాడ‌ర్ కు ప్ర‌తి వేదిక‌పైన చంద్ర‌బాబు చెబుతుంటారు. అదే విధంగా ఎన్డీయే, యూపీఏ దూరంగా పెట్టినప్ప‌టికీ ముర్ముకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం ద్వారా ఢిల్లీ వేదిక‌గా బాబు మ‌రోసారి హాట్ టాపిక్ కావ‌డం విశేషం.