Site icon HashtagU Telugu

Unstoppable : పొలిటిక‌ల్ `అన్ స్టాప‌బుల్` సీజ‌న్-2

Babu Balayya

Babu Balayya

అన్ స్టాప‌బుల్ సీజ‌న్ -2 ప్రోమో నెట్టింట్లో హ‌ల్ చల్ చేస్తోంది. సీజ‌న్ -2 మొద‌టి షో చంద్ర‌బాబుతో ప్రారంభం కానుందని ప్రోమో ద్వారా స్ప‌ష్టం అవుతోంది. అంతేకాదు, బాల‌య్య పెద్ద‌ల్లుడు లోకేష్ కూడా ఆ ప్రోమో ఎండింగ్ లో క‌నిపించ‌డం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నటరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా చేస్తున్న అన్​స్టాపబుల్ టాక్​ షో సీజన్​-2 కు భారీ స్థాయిలో ప్రోమో షూట్ జ‌రిగింది. అందుకు తగిన రేంజ్​లోనే విజయవాడలో రిలీజ్​ ఫిక్స్ కావ‌డంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సీజ‌న్ -2లో గెస్ట్​లుగా ఎవరు వస్తారు? తొలి ఎపిసోడ్​ అతిథి ఎవరు? అనే విషయాలపై సీజన్​-1 ముగిసినప్పటి నుంచి చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఓ ఫొటో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే `అన్​స్టాపబుల్​ సెట్`​ దగ్గర ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షుడు చంద్రబాబుతో బాలయ్య ఉన్న ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో సీజ‌న్ -2 చంద్రబాబు ఎపిసోడ్​తోనే ప్రారంభం కావచ్చని ఓటీటీ వ‌ర్గాల్లోని టాక్‌. అంతేకాదు, ఎపిసోడ్​ చివర్లో బాలకృష్ణ పెద్ద అల్లుడు, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్​ కూడా జాయిన్ అవుతార‌ని తెలుస్తోంది.

సీజన్​-1కు తొలి గెస్ట్​గా దిగ్గజ నటుడు మోహన్ బాబు క‌నిపించారు. ఆ ఎపిసోడ్​లో మోహన్​ బాబుతో కలిసి బాలయ్య చేసిన హంగామా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఆ తర్వాత యువ‌ నటులతో కలిసి చేసిన ఎపిసోడ్ల‌లో హడావుడి చేశారు. పెళ్లి విషయంలో రానాను టీజ్ చేయ‌డం, నానితో క్రికెట్ ఆడ‌టం, అల్లు అర్జున్​తో కలిసి పుష్ప స్టెప్పులేయ‌డం సీజ‌న్-1 ఎపిసోడ్ల‌లోని హైలెట్. సూపర్​స్టార్ మహేశ్​ బాబుతో సీజన్​-1కు గ్రాండ్​ ఫినిషింగ్ ఇవ్వ‌డం ద్వారా బాల‌య్య ఈజ్ అన‌స్టాబుల్ , అన్ స్టాప‌బుల్ ఈజ్ బాల‌య్య అనే రేంజిలోకి తీసుకెళ్లారు.

ఇక సీజన్​-2లో చంద్రబాబు, లోకేశ్​ను బాలయ్య హోస్ట్​ చేస్తే అన్​స్టాపబుల్ షో మ‌రో రేంజ్​ కి చేర‌నుంది. సీజ‌న్ -1 గెస్ట్​లతో పోల్చితే చంద్రబాబు, లోకేశ్​ పూర్తిగా భిన్నం. సినీ పరిశ్రమతో పెద్దగా సంబంధం లేని రాజకీయ నేతలు. బాలయ్యకు చంద్రబాబు సొంత‌ బావ. అంతేకాదు లోకేశ్​ ఇంటి పెద్ద అల్లుడు. వాళ్లిద్ద‌రితో బాలయ్య ఎలాంటి టాస్క్​లు చేయిస్తారు అనేది ఆసక్తికరం. సీజ‌న్-2 ఎంట్రీని చూస్తుంటే రాబోవు రోజుల్లో సినీ, రాజ‌కీయ మేళ‌వింపుతో గెస్ట్ లు ఉంటార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.