2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ( YSRCP) సాధించిన 151 సీట్ల విజయం వెనుక రాయలసీమలోని 52 సీట్లున్నాయి. ఇందులో మూడు మినహా అన్ని సీట్లు గెల్చుకున్న వైసీపీకి ప్రస్తుతం ఆ పరిస్ధితి కనిపించడం లేదు. రాష్ట్రంలో ఓవైపు కాపులు, మరోవైపు కమ్మ సామాజిక వర్గం (Kamma caste) నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తోడు రాయలసీమలో మారుతున్న పరిస్ధితులు సీఎం జగన్ ను (YS Jagan ) కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబుకు(Chandrababu Naidu) వరంగా మారుతున్నాయి. నంద్యాల… అనంతపురం,చిత్తూరు,కడప లాంటి ముఖ్యమైన ప్రాంతాల నుండి పారిశ్రామిక వేత్తలు తో పాటు బడా కాంట్రాక్టర్లు వ్యాపార సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కలవాల్సిన పరిస్థితి పై రాయలసీమలో జోరుగా చర్చ జరుగుతుంది.
రాయలసీమలో గత టీడీపీ (Telugu Desam Party) ప్రభుత్వాల హయంలో కియా, శ్రీసిటీ (KIA Motors, SriCity) పరిశ్రమలతో పాటు పలు ప్రాజెక్టులు వచ్చాయి. వీటితో స్ధానికులకు ఉపాధి దొరకడంతో పాటు పారిశ్రామిక వేత్తలకు కూడా ప్రోత్సాహం లభించింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓవైపు మూడు రాజధానుల(3 Capitals Andhra Pradesh) పేరుతో సాగుతున్న జాతరతో పాటు పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కరవవడంతో సీమకు ప్రాజెక్టుల రాక గగనంగా మారిపోయింది. దీంతో ఇక్కడి పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలవైపు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) కుటుంబానికి చెందిన అమరరాజా సంస్ధ వైసీపీ సర్కార్ బెదిరింపులతో తెలంగాణకు మకాం మార్చేసింది. తమ సామాజిక వర్గం ప్రభుత్వం వస్తే బాగుపడొచ్చని భావించిన రెడ్లకు సైతం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వారూ పక్కచూపులు చూస్తున్నారు.
చంద్రబాబుతో రహస్య భేటీలు
రాయలసీమలో మారుతున్న పరిస్దితుల్లో తిరిగి ఇక్కడి పారిశ్రామిక వేత్తలు వైసీపీని కాదని టీడీపీవైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కాస్తయినా పరిస్ధితుల్లో మార్పు వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. దీంతో ఇప్పటి నుంచే లాబీయింగ్ కు తెరలేపుతున్నారు. ఇందులో సీమ రెడ్ల సంఖ్యఎక్కువగానే ఉంటోంది. వీరంతా ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా భేటీలు అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుకు చెప్పుకుని గగ్గోలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బాబుకు మద్దతు ఇవ్వడానికి రెడీ అయ్యారు.
చంద్రబాబు హామీలు ?
రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు టీడీపీవైపు చూస్తున్నారు. దీంతో తనను ఆశ్రయిస్తున్న వీరికి చంద్రబాబు కూడా గట్టి హామీలే ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీరికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు రాజకీయ నాయకులకు సైతం కీలక పదవులు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డి ప్రభుత్వంలో రెడ్లకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు స్పందన చూసి వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో వీరిని చూసి మరింత మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు సైతం టీడీపీవైపు మొగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.