Chandrababu Naidu: ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తారా? జగన్ పై బాబు ఫైర్

ఏపీలో అరాచకపాలన సాగుతోందని, దీనికి పరాకాష్ట మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్ట్ అని... టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి

  • Written By:
  • Updated On - November 3, 2022 / 05:43 PM IST

ఏపీలో అరాచకపాలన సాగుతోందని, దీనికి పరాకాష్ట మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్ట్ అని… టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అరెస్ట్‌లు పరాకాష్టకు చేరుకున్నాయంటూ అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అక్రమమన్నారు. అర్ధరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేశారని, మద్యం మత్తులో వచ్చి దుర్మార్గంగా వ్యవహరించారని… అయ్యన్న కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను చంద్రబాబు గుర్తు చేశారు.

వైసీపీ నేతల్లా అయ్యన్నపాత్రుడు అవినీతికి పాల్పడలేదని, భూకబ్జాలు చేయలేదని, బాబాయిని చంపించలేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు విశాఖలో వేలాది ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. విశాఖలో భూకబ్జాలపై పోరాడితే అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. వివేకా కేసులో పోలీసులను ప్రభావితం చేశారన్నారు. దొంగల్లా అర్ధరాత్రి ఇళ్లపైకి వెళ్లే అధికారం సీఐడీకి ఎవరిచ్చారని నిలదీశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని.. ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నేతల అక్రమాలపై పోలీసుల చర్యలేవి అని నిలదీశారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న.. పోలీసులపై చట్టపరంగా చర్యలకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

“పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటే… ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట! ఎవరిని బెదిరిస్తారు మీరు? రాష్ట్రంలో అందరినీ చంపేస్తారా? అందరినీ జైల్లో పెట్టి కొడతారా? టార్చర్ చేస్తారా మీరు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా రాజేష్ ను కొట్టారు… దీనిపై మాకు సమాచారం అందింది అని మండిపడ్డారు. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటివి చూస్తే కంపరం కలుగుతుంది, బాధ, ఆవేశం కలుగుతున్నాయి. కానీ సభ్యత అడ్డం వస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న అధికారులకు చెబుతున్నా… మీరనుకున్నది జరగదు, జరగనివ్వం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.