Site icon HashtagU Telugu

CBN:బాబు ‘ముందస్తు’ మాట

ఏపీలో అప్పుడే ఎల‌క్ష‌న్స్ హీట్ మొద‌లైంది. మ‌రో రెండెళ్ల‌లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన ఉన్నా ముంద‌స్తుగా జ‌రుగుతాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.అయితే దీనిపై టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు స్ప‌దించారు. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ప్ర‌చారం జ‌రుగుతోందని…ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే సిద్దంగా ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై అనేక ఊహాగానాలు వ‌స్తుండ‌టంతో దానిపై కూడా ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. పొత్తుల‌పై ప్ర‌శ్న‌లు ఊహాజ‌నితమ‌ని.. దానిపై స్పందించ‌నని చంద్ర‌బాబు తెలిపారు. మ‌రోవైపు పార్టీలో ప‌ని చేయ‌ని నేత‌లు, ఇంఛార్జ్ ల‌ను ప‌క్క‌న పెడ‌తామ‌ని.. పార్టీ ఎవరి కోసం త్యాగాలు చెయ్య‌ద‌ని తెలిపారు.

ఇప్ప‌టికే 175 నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు అభ్య‌ర్థుల ఎంపిక‌ను పూర్తి చేశారు. దాదాపుగా వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త అభ్య‌ర్థుల‌ను పెట్టేందుకు సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం. సంక్రాంతి త‌రువాత అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి చంద్ర‌బాబు,లోకేష్ జ‌నం లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు ఉండ‌ద‌ని టీడీపీ నేత‌లు అంటున్న‌ప్ప‌టికి చివరిలో ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని చ‌ర్చ న‌డుస్తుంది. జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తు ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని కొంత‌మంది టీడీపీ నేతలు అంటున్నారు. జ‌న‌సేన‌కి ఏయే నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయించాలనే దానిపై కూడా క‌స‌ర‌త్తు జ‌ర‌గుతున్న‌ట్లు స‌మాచారం. టీడీపీ జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వ‌స్తామ‌ని చాలా మంది నేత‌లు భావిస్తున్నారు.

అయితే ప్ర‌స్తుతం జ‌న‌సేన బీజేపీతో క‌లిసి ఉంది కానీ ఎక్క‌డా కూడా ఇరు పార్టీలు క‌లిసి కార్య‌క్ర‌మాలు చేయ‌డంలేదు. ఇటీవ‌ల బీజేపీ ఏర్పాటు చేసిన ప్ర‌జాగ్ర‌హా స‌భ‌కు జ‌న‌సేన దూరంగా ఉంది. జ‌న‌సేన త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాల‌కు బీజేపీ దూరంగా ఉంటుంది. అంటే దాదాపుగా ఈ రెండు పార్టీలు విడిపోయిన‌ట్లేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ జ‌న‌సేన క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయో లేదో వేచి చూడాలి.