Site icon HashtagU Telugu

Chandrababu : చంద్ర‌బాబు స‌రికొత్త ఫార్ములా

CBN TDP

Chandrababu Tdp

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం చంద్రబాబు సొంతం. ఆయ‌న ఉప‌యోగించ‌ని రాజ‌కీయ ఫార్ములా దాదాపుగా లేదు. ఒక్కో ఎన్నిక‌లో ఒక్కో ఫార్ములాను ప్ర‌యోగిస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో అవి ప‌నిచేయ‌క‌పోవ‌డానికి కార‌ణం సొంత పార్టీలోని వేరు కుంప‌ట్లే. రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న చేసిన ప్ర‌యోగం ఫ‌లించింది. ఆనాడు బీజేపీతో పొత్తు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీని స‌మూలంగా నిర్వీర్యం చేయ‌డం మ‌రో ఎత్తుగ‌డ‌.

రాష్ట్ర విభ‌జ‌న చేసిన కాంగ్రెస్ పార్టీ మీద ఏపీ ఓట‌ర్ల‌కు ఎప్ప‌టికీ తీర‌ని క‌సి ఉంటుంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు ఆ పార్టీలోని సీనియ‌ర్ల‌ను 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా ఆక‌ర్షించారు. త‌ల‌పండిన రాజకీయ నాయ‌కుల‌ను
సైతం వివిధ మార్గాల ద్వారా టీడీపీలోకి తీసుకున్నారు. జేసీ బ్ర‌ద‌ర్స్ , టీజీ వెంక‌టేష్ లాంటి సుమారు 43 మంది కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆక‌ర్షించారు. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ నామ‌రూపాల్లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ అమాంతం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న లీడ‌ర్ల సైతం కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన లీడ‌ర్ల‌కు స‌హ‌కారం అందించేలా స‌యోధ్య కుదిర్చారు చంద్ర‌బాబు. అందుకే, ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ముందుగానే హైప్ క్రియేట్ అయింది. ఫలితాలు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి.

అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా అదే ఫార్ములాను చంద్ర‌బాబు అనుస‌రించారు. ప్ర‌తిప‌క్షంలోని లీడ‌ర్ల‌ను తీసుకుని మంత్రి ప‌ద‌వుల‌ను ఇచ్చారు. స‌రిగ్గా ఇక్క‌డే ఆయ‌న ప‌ప్పులో కాలేశారు. దాని ఫ‌లితం 2019 ఎన్నిక‌ల్లో చూశారు. అందుకే ఈసారి అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా 2014లో కాంగ్రెస్ మీద చేసిన ఆప‌రేష‌న్ ను ఈసారి వైసీపీ మీద చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం వైసీపీలో క‌నీసం 70 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నార‌ని టాక్‌. అంతేకాదు, డీఎల్ , వీర‌శివారెడ్డి లాంటి సీనియ‌ర్లు అనేక మంది ఇటీవ‌ల దాకా మౌనంగా ఉన్నారు. వాళ్ల‌ను టీడీపీలోకి ఆహ్వానించ‌డానికి ద్వారాలు తెరుస్తార‌ని తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ నుంచి తీసుకున్న సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు టిక్కెట్లు ఇచ్చారు. మ‌రికొంద‌రికి నామినేటెడ్ పోస్టుల‌ను క‌ట్ట‌బెట్టారు. ఈసారి టిక్కెట్ల హామీ ఇవ్వ‌కుండా వైసీపీలోని అసంతృప్తి వాదుల‌ను, ఇత‌ర పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ల‌ను తీసుకోబోతున్నారు. ఒంగోలు మ‌హానాడు త‌రువాత టిక్కెట్ హామీ ఇవ్వ‌న‌ప్ప‌టికీ టీడీపీలో చేర‌డానికి చాలా మంది ఇత‌ర పార్టీల లీడ‌ర్లు సిద్ధంగా ఉన్నార‌ట‌. అందుకే, బేష‌ర‌తుగా పార్టీ కండువా క‌ప్పుకునే వాళ్ల‌కు టీడీపీ ఆహ్వానం ప‌లుకుతోంది. ఆ జాబితా కింద‌కు వ‌చ్చే క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్లు ఇటీవ‌ల లోకేష్ ను క‌లిశారు. త్వ‌ర‌లోనే పార్టీలో చేర‌డానికి సిద్ధం అయ్యారు. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీనియ‌ర్ పొలిటిషియ‌న్ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి లాంటి వాళ్లు చాలా మంది జంప్ కావ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, అన‌కాప‌ల్లి మిని మ‌హానాడులు, చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర్ల రోడ్ షోలు సూప‌ర్ హిట్ కావ‌డంతో పొత్తుల్లేకుండా ఒంట‌రిగా వెళ్ల‌డానికి ఫిక్స్ అవుతోన్న చంద్ర‌బాబు ఈసారి స‌రికొత్త ఫార్ములాను అమ‌లు చేయ‌డానికి స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. ఇంచుమించు 2014 ఫార్ములాను అనుస‌రిస్తూ కొన్ని మార్పులు చేయ‌డం ద్వారా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఎన్నిక‌లకు ముందే నిర్వీర్యం చేయ‌డానికి స్కెచ్ వేశార‌ట‌. ఎంత వ‌ర‌కు స‌రికొత్త చంద్ర‌బాబు ఫార్ములా ఫ‌లిస్తుందో చూడాలి.