రాష్ట్రపతి పాలన విధించండి.. డీజీపీని రీకాల్‌ చేయండి!

  • Written By:
  • Publish Date - October 25, 2021 / 05:52 PM IST

టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని చంద్రబాబు తెలిపారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని అన్నారు.డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలతో కలిసి దిల్లీలో రాష్ట్రపతితో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని ఆయా రాష్ట్రాల పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. దేశం, అంతర్జాతీయంగా ఎక్కడా లేని లిక్కర్‌ బ్రాండ్లు ఏపీలో ఉంటున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. మద్యపాన నిషేధం పేరుతో భారీగా రేట్లు పెంచారని.. మాఫియాగా ఏర్పడి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారని పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి ఆరోపించారు. ‘డ్రగ్స్‌ ఫ్రీ ఏపీ’ కోసం తెదేపా పోరాడుతోందన్నారు. డ్రగ్స్ తో యువత.. తద్వారా జాతి నిర్వీర్యమవుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నియంత్రించాలని కోరితే ఒకే రోజు తెదేపా కార్యాలయాలపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే మొదటిసారని.. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు.

రెండేళ్లుగా రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మీడియానూ నియంత్రిస్తున్నారు. తెదేపా నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టారు. అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసులు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కస్టడీలో టార్చర్ పెడుతున్నారు. తెదేపా నేతలను ఆర్థికంగా, శారీరకంగా హింసలు పెడుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే మా కార్యాలయంపై దాడి చేశారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.