Chandrababu Naidu: డ్రామాలాడే లీడర్లకు టీడీపీ చెక్

డ్రామాలు వేసే నాయకులకు చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 12:21 AM IST

డ్రామాలు వేసే నాయకులకు చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. అలాంటి వాళ్లకు ఎన్నికల్లో టిక్కెట్ రాదని తేల్చేశారు. కొందరు పోరాటం చేయకుండా నటిస్తున్నారని , అలాంటి వాళ్ళ జాబితా ఉందని హెచ్చరించారు. పద్దతి మార్చుకుంటే బాగుంటుందని , లేదంటే ఇతరులకు అవకాశం ఇస్తానని కుండబద్దలు కొట్టారు. దీంతో టీడీపీలోని పనిచేయని, క్యాడర్ ను పట్టించుకోని లీడర్లకు ఆందోళన మొదలైంది. కనీసం 50 మంది నియోజకవర్గ ఇంఛార్జీలను మార్చుతారని ఆ పార్టీలోని టాక్.
టీడీపీలో కొంతమంది నేతలు ఒళ్లు వంచడం లేదని చంద్రబాబు మందలించారు. ప్రజా సమస్యలపై పోరు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహంచారు. తమను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని చెబుతూ,కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పడం సరికాదని చురకలేశారు. కొంతమంది నేతలు పోలీసులతో వాదించి, గృహనిర్బంధాలను ఛేదించుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారంటూ డ్రామాలాడే నేతలను చంద్రబాబు నిలదీసినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజా సమస్యలపై నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతారని, అయితే ఏమవుతుందని చంద్రబాబు ఆ లీడర్లను ప్రశ్నించినట్టు సమాచారం. తనతోపాటు తన కుమారుడు నారా లోకేష్, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వంటివారిపైనా కేసులు పెట్టారని చంద్రబాబు గుర్తు చేసినట్టు వినికిడి. ప్రజా సమస్యలపై పోరాడే నేతలపై కొన్ని కేసులు పెడతారని, వాటికి భయపడి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఎలా అని చంద్రబాబు గట్టిగానే కొంతమంది నేతలకు క్లాస్ తీసుకున్నారట.

ఇకపై పార్టీ కార్యక్రమాలు ప్రజా సమస్యలపై నిర్వహించే పోరులో పాల్గొనని వారిని నిశితంగా పరిశీలిస్తామని చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. పోరాడకుండా ఇంట్లోనే కూర్చుని, నటిస్తున్నవారి వివరాలను రికార్డు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో ఉండి కూడా కొంతమంది నేతలు ఆయా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని, కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన అవసరం లేదా అని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరు పనిచేస్తున్నారో? ఎవరు పనిచేయడం లేదో ?పార్టీ కార్యాలయానికి మొత్తం సమాచారం వస్తోందని చంద్రబాబు హెచ్చరించారు.
వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతలుగా ఎదుగుతారని చంద్రబాబు పార్టీ నేతలకు హితభోద చేశారట. పార్టీ కోసం పనిచేయనివారిని మోయాల్సిన అవసరం తనకు లేదని చంద్రబాబు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీకేమీ నాయకుల కొరత లేదని.
ప్రతిచోటా 10 మంది సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికి కూడా మారకపోతే కఠిన చర్యలు తప్పవని డ్రామాలాడే లీడర్లకు ఆఖరి ఛాన్స్ ఇచ్చారట. రాబోవు రోజుల్లో కనీసం 50 మందికి టీడీపీ చెక్ పెట్టనుందని తెలుస్తోంది. ఇదే ఆ పార్టీలోని హాట్ టాపిక్.