Chandrababu : రాజంపేటపై చంద్ర‌బాబు ఫోక‌స్, ఎంపీ అభ్య‌ర్థి ఆయ‌నే?

తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిత్వాల కోసం పోటీ పెరుగుతోంది. ఇప్ప‌టికే లోక్ స‌భ అభ్య‌ర్థిత్వాల విష‌యంలో ఒక క్లారిటీకొచ్చిన ఆ పార్టీ చీఫ్ చంద్ర‌బాబు కొన్ని పేర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. కేవ‌లం గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య‌పైనే కాదు, ఎంపీల సంఖ్య‌పై కూడా గురి పెట్టారు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 07:00 AM IST

తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిత్వాల కోసం పోటీ పెరుగుతోంది. ఇప్ప‌టికే లోక్ స‌భ అభ్య‌ర్థిత్వాల విష‌యంలో ఒక క్లారిటీకొచ్చిన ఆ పార్టీ చీఫ్ చంద్ర‌బాబు కొన్ని పేర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. కేవ‌లం గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య‌పైనే కాదు, ఎంపీల సంఖ్య‌పై కూడా గురి పెట్టారు. కేంద్రంలోనూ ఈసారి చక్రం తిప్ప‌డం ద్వారా ఏపీకి రావాల్సిన చ‌ట్ట‌బ‌ద్ధ హామీల‌ను రాబ‌ట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌త్యేక‌హోదా, పోల‌వ‌రం, రాజ‌ధాని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశంలోని పొర‌బాట్లు, ఆర్థిక లోటు, వెనుక‌బ‌డిన జిల్లాలకు ప్యాకేజీ త‌దిత‌ర విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను సాధించుకోవ‌డానికి గెలిచే లోక్ స‌భ అభ్య‌ర్థుల విష‌యంలోనూ ఆయ‌న రాజీప‌డడంలేదు. గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే ఈసారి ప్రాధాన్యం ఇస్తూ అన్నీ కోణాల నుంచి చేసిన స‌ర్వేల ఆధారంగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు వినికిడి.

ఆ క్ర‌మంలో రాజంపేట ఎంపీ అభ్య‌ర్థిగా మ‌ద‌న‌ప‌ల్లి కేంద్రంగా చంద్ర‌బాబు గంటా న‌ర‌హ‌రిని ప్ర‌క‌టించ‌నున్నారు. ఆయ‌న ఇటీవ‌ల టీడీపీలో చేరారు. పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీకి అండ‌గా నిలిచిన మాజీ ఎంపీ ఆదికేశ‌వులునాయుడు కుటుంబానికి చెందిన పారిశ్రామిక‌వేత్త గంటా. రాయలసీమ జిల్లాల యువ‌త‌కు సుప‌రితునిగా ఆయ‌న ఉన్నారు. రాజంపేట లోక్‌సభ స్థానానికి ఆయన టీడీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో డీకే సత్యప్రభ రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనారోగ్య కారణాలతో ఆమె ఇటీవ‌ల కన్నుమూశారు. దీంతో రాజంపేటలో కొత్త అభ్యర్థిగా గంటా నరహరి బావుంటుందని పార్టీ ఒక నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

బెంగళూరు కేంద్రంగా పెద్ద ఎత్తున గంటా వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాదు 2017-2018లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డును పొందారు. వ్యాపార కార్యకలాపాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు ఆయ‌న మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు సమీప బంధువు. డీకే సతీమణి, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సోదరికి నరహరి అల్లుడు అవుతారు. అంటే, ఆదికేశ‌వులునాయుడు కుటుంబం నుంచి వ‌స్తోన్న లీడ‌ర్ గా ఫేమ్ ఉంది. ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని రాజంపేట ఎంపీగా ప్ర‌క‌టించిన త‌రువాత ఆ లోక్ స‌భ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిల ఆధారంగా ఎమ్మెల్యే అభ్య‌ర్థిత్వాలను చంద్ర‌బాబు వెల్ల‌డించనున్నారు. ఏపీలోని 25 లోక్ స‌భ స్థానాల‌కు అభ్యర్థిత్వాల విష‌యంలో ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆ జాబితాలోని పేర్ల‌ను మినీ మ‌హానాడు స‌భ‌ల్లో స‌రైన స‌మ‌యం చూసుకుని ప్ర‌క‌టిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కుగాను 150 చోట్ల అభ్య‌ర్థుల జాబితా సిద్ధమైంద‌ని టాక్‌. అలాగే, 25 లోక్ స‌భ స్థానాల‌కు కూడా అభ్య‌ర్థిత్వాలు సిద్ద‌మైయ్యాయ‌ని తెలుస్తోంది. చివ‌రి నిమిషంలో ఒక‌టి రెండు మిన‌హా ఇప్పుడున్న జాబితా ప్ర‌కార‌మే చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అందుకే రాజంపేట కేంద్రంగా చంద్ర‌బాబు నాంది ప‌లుకుతార‌ని చెబుతున్నారు.