రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు చంద్ర‌బాబు డిమాండ్

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై మూకుమ్మ‌డి దాడుల‌కు వైసీపీ దిగ‌డాన్ని నిర‌సిస్తూ ఆయ‌న దీక్ష‌కు దిగారు.

  • Written By:
  • Updated On - October 21, 2021 / 04:16 PM IST

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై మూకుమ్మ‌డి దాడుల‌కు వైసీపీ దిగ‌డాన్ని నిర‌సిస్తూ ఆయ‌న దీక్ష‌కు దిగారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో 36 గంట‌ల దీక్ష చేస్తున్న ఆయ‌న రాష్ట్రంలోని ప‌రిస్థితులు ఆర్డిక‌ల్ 356కు అనుగుణంగా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని బాబు కోరుతున్నాడు.

డ్ర‌గ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయి. ఆ విష‌యాన్ని టీడీపీ కొన్ని రోజులుగా ఆధారాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి ముఠాలు త‌యారు అయ్యాయ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. క‌నీసం 8వేల నుంచి 25వేల కోట్ల వ‌ర‌కు వివిధ ర‌కాల మ‌త్తు ప‌దార్థాలు ఏపీలో స‌ర‌ఫ‌రా అవుతున్నాయ‌ని ఆరోపించారు. కొన్ని చోట్ల గంజాయిని పెంచుతున్నార‌ని అన్నారు. యువ‌త‌ను నిర్వీర్యంచేసేలా డ్ర‌గ్స్, గంజాయి పంపిణీ ఏపీ కేంద్రంగా జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. హ‌త్య‌లు, అత్యాచారాలు, ప్ర‌త్య‌ర్థి పార్టీల మీద దాడులు చేసుకుంటున్నందున రాష్ట్ర‌ప‌తి పాల‌న అవ‌స‌ర‌మ‌ని బాబు భావిస్తున్నారు.

తెలంగాణ డీజీపీ ఏపీలోని గంజాయి స్మ‌గ్లింగ్ మీద దాడులు చేయించార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, త‌మిళనాడు, తెలంగాణ రాష్ట్రాల‌కు ఏపీ నుంచే గంజాయి స‌ర‌ఫ‌రా అవుతోంద‌ని ఆరోపించారు. అందుకే, ఇటీవ‌ల ముంబాయ్, తెలంగాణ పోలీసులు ఏపీలోని ప‌లు ప్రాంతాల్ల‌లో దాడులు నిర్వ‌హించారు. ఏపీ కేంద్రంగా పెద్ద ఎత్తున స్మ‌గ్లింగ్ జ‌రుగుతుంద‌ని నిర్థారించారు. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. రాజ‌కీయంగా డ్ర‌గ్స్, గంజాయి స‌ర‌ఫ‌రాల మీద టీడీపీ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న వైసీపీ మీద దాడి చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోలు త‌ప్పింద‌ని ఆయ‌న భావిస్తున్నారు. అన్ని కోణాల నుంచి రాజ్యాంగంలోని 356 ఆర్టిక‌ల్ అమ‌లుకు ఏపీలో ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయ‌ని బాబు వాదిస్తున్నారు. కేంద్రం అందుకు అంగీక‌రిస్తుందా..అనేది చూడాలి.