Chandrababu Naidu: చంద్ర‌బాబు ఆగ్ర‌హం వెనుక‌ `మీడియా క‌థ‌`

సాధార‌ణంగా చంద్ర‌బాబు మీడియాను దూరం చేసుకోరు. వీలున్నంత వ‌ర‌కు మీడియా ఫ్రెండ్లీగా ఉండాల‌ని కోరుకుంటారు.

  • Written By:
  • Updated On - September 3, 2022 / 03:43 PM IST

సాధార‌ణంగా చంద్ర‌బాబు మీడియాను దూరం చేసుకోరు. వీలున్నంత వ‌ర‌కు మీడియా ఫ్రెండ్లీగా ఉండాల‌ని కోరుకుంటారు. అదే పంథాను క్యాడ‌ర్ కు, లీడ‌ర్ల‌కు అల‌వాటు చేస్తుంటారు. కానీ, ఆయ‌న‌కు ఒక విభాగం మీడియా మీద ఆగ్ర‌హం క‌లిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖంగా ఉన్న టీవీ9, ఎన్టీవీని బ‌హిష్క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధిని కోరుకునే ప్ర‌జ‌లంద‌రూ ఆ రెండు ఛాన‌ళ్ల‌ను చూడొద్ద‌ని చెప్ప‌డం మీడియా వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అధికారంలో ఉన్న‌ప్పుడు సాక్షి మీడియాను సంపూర్ణంగా టీడీపీ బ‌హిష్క‌రించింది. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు, యాడ్స్ ఇవ్వ‌కుండా దూరంగా పెట్టింది. ఆ ప‌త్రిక‌ను, న్యూస్ ఛాన‌ల్ ను చూడొద్ద‌ని ఆప్ప‌ట్లోనే చంద్ర‌బాబు ఆదేశించారు. కొన్ని చోట్ల మాస్ట‌ర్ కేబుల్ ఆప‌రేట‌ర్లు సాక్షి టీవీని అప్ప‌ట్లో క‌ట్ చేశారు. విష‌పూరిత వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తుంద‌ని కేసులు కూడా వేశారు. సాక్షి ప‌త్రికను త‌గుల‌పెట్టి నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు అనేకం. అంతేకాదు, సాక్షి ప‌త్రిక‌, ఛాన‌ల్ ను న‌డుపుతోన్న జ‌గ‌తిమీడియాను క్లోజ్ చేయాల‌ని కేసులు వేశారు. ఇవ‌న్నీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు స‌ర్కార్ చేసినవి. ఇంకొంచం వెన‌క్కు వెళితే ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉండే వైఎస్ఆర్, హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన‌ప్పుడు ఒక ఛాన‌ల్‌(ప్ర‌స్తుతం టీడీపీ ముద్ర‌) ఆయ‌న మ‌ర‌ణాన్ని మ‌ర్డ‌ర్ గా చిత్రీక‌రిస్తూ ఒక కార్పొరేట్‌ కంపెనీ య‌జ‌మానిపై హంత‌కుని ముద్ర వేసింది. ఆ స‌మ‌యంలో ఆ ఛాన‌ల్ ను మూసివేయాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. అంతేకాదు, లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ కూడా ఇలాంటి ఛాన‌ళ్లు ఉండ‌కూడ‌ద‌ని హిత‌బోధ చేస్తూ మీడియాకు ఎక్కారు.

ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. మీడియా హౌస్ లు కూడా చేతులు మారాయి. యాజ‌మాన్యాల ఆలోచ‌న స‌ర‌ళి మారిపోయింది. అందుకే, టీవీ 9, ఎన్డీవీల‌ను బాయ్ క‌ట్ చేయాల‌ని చంద్ర‌బాబు స్లోగ‌న్ అందుకున్నారు. ప్ర‌స్తుతం ఆ ఛాన‌ళ్లు మేఘా, మై హోం( కేసీఆర్, జ‌గ‌న్ ఫ్రెండ్‌) గ్రూప్ ల ఆధీనంలో ఉన్నాయ‌ని టీడీపీ భావిస్తోంది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా న్యూస్ ఇవ్వ‌డంతో పాటు టీడీపీని బ‌ద్నాం చేస్తున్నాయ‌ని బాబు నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. రాష్ట్రంలో అరాచకం, అప్రజాస్వామికం రాజ్యమేలుతుంటే తిరిగి విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నీలి మీడియా(సాక్షి ప‌త్రిక‌, ఛాన‌ల్‌) తో పాటు టీవీ9, ఎన్టీవీలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ చానళ్లు ఇష్టానుసారంగా తమపై విషప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. `రాష్ట్రం కోసం పోరాడండి ఒప్పుకుంటాం, కానీ ఉన్మాదులకు వత్తాసు పలుకుతున్నారని` ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న ప్రతిపక్షం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించలేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం బాగుకోరే ప్రజలందరూ ఈ చానళ్లను బహిష్కరించాలని అన్నారు.

ప్ర‌స్తుతం టీవీ5, ఏబీఎన్, ఈటీవీ ల‌ను ఎల్లో మీడియాగా వైసీపీ చెబుతోంది. అందుకే, చంద్ర‌బాబుతో క‌లుపుకుని దుష్ట‌చ‌తుష్ట‌యంగా ఆ ఛాన‌ళ్ల యాజ‌మాన్యాల‌పై సాక్షాత్తు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. అధికార‌, అన‌ధికార, రాజ‌కీయ వేదిక‌ల‌పై దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ ప‌దేప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆ ఛాన‌ళ్ల‌ను, ప‌త్రిక‌ల‌ను చూడొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతున్నారు. నీలి మీడియాను చూడొద్ద‌ని చంద్ర‌బాబు, ఎల్లో మీడియాను చూడొద్ద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

ఇక తెలంగాణ‌కు వ‌చ్చేట‌ప్ప‌టికి పింక్ మీడియా(టీన్యూస్, నమ‌స్తే తెలంగాణ‌, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, తెలంగాణ టుడే)ను చూడొద్ద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌లుమార్లు పిలుపునిచ్చారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న టీవీ9పై పురుష‌ప‌ద‌జాలాన్ని కూడా వాడారు. వాస్త‌వంగా తెలుగు మీడియాలోని సింహ‌భాగం (ఒక‌టి రెండు చాన‌ళ్లు మిన‌హా) కేసీఆర్ పాల‌న‌కు జై కొడుతున్నాయి. గ‌త మూడేళ్లుగా ఏపీ రాజ‌కీయాలు, జ‌గ‌న్ పాల‌న‌పై మాత్ర‌మే ఒక‌ భాగం మీడియా న‌డుస్తోంది. తెలంగాణ పాల‌నా వైఫ‌ల్యాల వైపు చూసే ధైర్యంచేయ‌లేని దుస్థితిలో సింహ‌భాగం మీడియా ఉంద‌ని విప‌క్ష లీడ‌ర్లు త‌ర‌చూ చేసే విమ‌ర్శ‌లు.

నాలుగో ర‌కం మీడియా బ్లాక్ అలియాస్ పిచ్చ మీడియా. దాన్ని ఎవ‌రూ పట్టించుకోరు. స‌మాజంలోని రుగ్మ‌త‌ల‌ను డ‌బ్బు చేసుకోవ‌డం ఆ మీడియా యాజ‌మాన్యాల ల‌క్ష్యం. అంతేకాదు, స‌మాజాన్ని పీక్కుతిన‌డానికి మార్గాల‌ను అన్వేషిస్తూ కొంద‌రు విలేక‌రుల‌తో దందాలు చేయిస్తుంటారు. జ‌ర్న‌లిస్టుల‌కు జీతాలు ఇవ్వ‌కుండా ఎర్న‌లిస్టులుగా మార్చే `పిచ్చ మీడియా`కు తెలుగు రాష్ట్రాల్లో కొద‌వేలేదు. ఆ మీడియాను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదు, ప్ర‌జ‌లూ ప‌ట్టించుకోరు. కానీ, చీక‌టి వ్యాపారాలు చేయ‌డానికి `పిచ్చ మీడియా`ను క‌వ‌చంగా పెట్టుకుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్ర‌భుత్వానికి `బాన్చ‌న్ దొర‌` అంటూ బ‌తికేస్తుంటాయి. ఇక ఐదో రకం మీడియా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అయోమయంగా ఉంటుందని చాలామంది అభిప్రాయం. అయిన‌ప్ప‌టికీ ద‌ర్యాప్తు సంస్థ‌లు ఉదాసీనంగా వ‌దిలేస్తున్నాయి. స‌మాజానికి నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియాలోని సింహ‌భాగం శాస‌న వ్య‌వ‌స్థ ముందు ఒరిగిపోయింది. అందుకే మునుపెన్న‌డూ లేనివిధంగా చంద్ర‌బాబు మీడియాపై ఆగ్ర‌హించి ఉండొచ్చు.