Naidu Action Plan:మహానాడు నుంచి కళకళలాడనున్న పసుపు జెండా… మరి సైకిల్ బెల్ మోగుతుందా?

ఏపీలో ఎన్నికలకు ఇంకా టైముంది. అయినా సరే.. జనంలోకి వెళ్లడానికి టీడీపీ ఇప్పటి నుంచే సిద్ధమైంది. మహానాడు తరువాత నెలకు రెండు జిల్లాల్లో పర్యటిస్తానని ముందే ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - April 24, 2022 / 11:45 AM IST

ఏపీలో ఎన్నికలకు ఇంకా టైముంది. అయినా సరే.. జనంలోకి వెళ్లడానికి టీడీపీ ఇప్పటి నుంచే సిద్ధమైంది. మహానాడు తరువాత నెలకు రెండు జిల్లాల్లో పర్యటిస్తానని ముందే ప్రకటించారు. అయినా ఎన్నికలకు టైమున్నా టీడీపీ జనంలోకి వెళ్లాలని ఎందుకు ఇంత సడన్ గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నది పెద్ద ప్రశ్న. పైగా ఏడాదికన్నా ఎక్కువకాలం ఈ పర్యటనలు కొనసాగుతాయని బాబు చెప్పడాన్ని బట్టి చూస్తుంటే.. భారీ కార్యాచరణతోనే టీడీపీ సిద్ధమైనట్టు కనిపిస్తోంది. నెలకు రెండు జిల్లాల్లో పర్యటిస్తానని బాబు చెప్పినదానిని బట్టి చూస్తే.. ఏపీలో ఉన్న మొత్తం 26 జిల్లాలను నెలకు రెండు చొప్పున చుట్టేయడానికి 13 నెలలు పడుతుంది. అందుకే ఏడాదికిపైగా జిల్లాల యాత్ర ఉంటుందని చెప్పారు.

రాజకీయాల్లో తొలి రెండున్నరేళ్లు ఎలా గడిచినా.. తరువాతి రెండున్నరేళ్లు మాత్రం ఎలక్షన్ మూడ్ కనిపిస్తుంది. నిజానికి ఏపీలో తొలి రెండున్నరేళ్లు కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద పోరాటమే నడిచింది. ఇక టీడీపీ గత ఎన్నికల్లో ఓడిపోయినా.. దానికి స్థిరమైన ఓటుబ్యాంకు ఉంది. అయినా సరే ఎన్నికల్లో గెలవాలంటే.. ఏపీలో పోలరైజేషన్ వల్ల ఎక్కువశాతం ఓటింగ్ రావాల్సి ఉంటుంది. లేకపోతే ఓటమి తప్పదు. అందుకే ఉన్న ఓటు బ్యాంకుని పటిష్టం చేసుకోవడంతోపాటు స్వింగ్ ఓటింగ్ ను కూడా తమవైపు తిప్పుకునేలా టీడీపీ స్కెచ్ వేసింది.

క్షేత్రస్థాయిలో బలమైన, భారీ రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మాత్రమే స్వింగ్ ఓటు యాక్టివ్ గా ఉంటుంది. అటువైపు మొగ్గు చూపుతుంది. అందుకే ఈ రెండున్నరేళ్లలో ఆ స్వింగ్ ఓటును తమవైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కేవలం టీడీపీ మాత్రమే ఉంది. మరే రాజకీయపార్టీకి ఆ అవకాశం లేదు. ఒకవేళ బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా వారిద్దరి ఉమ్మడి ఓటింగ్ 10 శాతానికి మించదు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. దీనికోసమే బాబు ఇప్పటి నుంచే జిల్లాల యాత్రలు చేపట్టడానికి సిద్ధమయ్యారు.

టీడీపీ ప్రధానకార్యదర్శి.. చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ కూడా పాదయాత్రకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలతోపాటు పార్టీ స్థితిగతులను కూడా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. పైగా లోకేశ్ ఇమేజ్ ను పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గతంలో చంద్రబాబు ఇలాగే పాదయాత్ర చేసిన తరువాత అధికారంలోకి వచ్చారు. జగన్ కు కూడా పవర్ లోకి రావడానికి పాదయాత్ర ఉపయోపడింది. అదే కోవలో లోకేశ్ గ్రాఫ్ ను ఈ పాదయాత్ర పెంచుతుందని చంద్రబాబు భావిస్తున్నారని అందుకే దీనికి ప్లాన్ చేశారని అంటున్నారు.

ఇక వైసీపీ పవర్ నెమ్మదిగా తగ్గుతోందని.. ఎన్నికల్లో కచ్చితంగా దాని ఓటుబ్యాంకుకు చిల్లు పడుతుందని టీడీపీ భావిస్తోంది. ఇప్పుడున్నట్టుగా మరో ఏడాది తరువాత పరిస్థితి ఉండదని చెబుతోంది. చాలామంది ఓటర్లు కూడా ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే ఎన్నికల్లోనే దానిని చూపిస్తుంటారు. ఎందుకంటే గతంలో టీడీపీ నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అక్కడ దాదాపు 20 వేల మెజార్టీతో గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు వైసీపీకీ కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందని అంచనా వేస్తోంది.

ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఉద్యోగస్తుల్లో అసంతృప్తి ఉంది. ఇక ధరల పెరుగుదల, వివిధ ఛార్జీలు, మద్యం ధరలపై అసంతృప్తి పెరుగుతోంది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటున్నారు అనే ఫీలింగ్ ఎక్కువవుతోంది. పైగా సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు పెరిగేసరికీ అభివృద్ధి కార్యక్రమాలపై అది ప్రభావం చూపిస్తోంది. పైగా స్థానిక నాయకత్వం తమకేమీ పనిలేదనే భావనలో ఉంది. అంటే… పనులు జరుగుతుంటే.. వాళ్లకు చేతినిండా పని ఉంటుంది. దాంతోపాటూ డబ్బులూ వస్తాయి. అసలు పనులే జరగకపోయేసరికీ వాళ్లకు చెయ్యాడడం లేదు. దీనివల్ల వారిలో కూడా అసంతృప్తి పెరుగుతోందనే వాదనుంది. అంటే జగన్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉన్నా సరే.. లోకల్ లీడర్ షిప్ కాని సంతృప్తిగా లేకపోతే.. అది ఓటింగ్ పై భారీగా ప్రభావాన్ని చూపించే ఛాన్సుంది.

ఇలాంటి పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇక పార్టీ పరంగా చూస్తే.. పార్టీలో చంద్రబాబునాయుడే ఏకఛత్రాధిపత్యంతో కనిపిస్తున్నారు. లోకేశ్ కు ఇంకా నెంబర్ టూ పొజిషన్ పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. గతంలో మంత్రిగా చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో కాని, పార్టీలో కాని నెంబర్-2 పొజిషన్ సంపాదించలేకపోయారు. అందుకే ఇప్పుడు మరోసారి భారమంతా బాబుపైనే ఉంది. కాకపోతే.. ఈ వయసులోనూ ఉత్సాహంగా జనంలో తిరుగుతూ విస్తృత స్థాయిలో పర్యటనలు చేసే శక్తియుక్తులు చంద్రబాబుకు ఉన్నాయని గత చరిత్ర చెబుతోంది. గతంలో 2004 నుంచి 2014వరకు అంటే పదేళ్లపాటు ప్రతిపక్షంగా ఉన్నా సరే.. పార్టీని కాపాడుకుంటూ.. మళ్లీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడూ అలాగే చేస్తారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరి టీడీపీ కల నెరవేరుతుందో లేదో చూడాలి.