AP Politics: 2024లో చంద్ర‌బాబు విశ్వ‌రూపం

`పార్టీ కోసం త్యాగాలు చేయాలి. మీ కోసం పార్టీ త్యాగం చేయ‌దు` అంటూ చంద్ర‌బాబు కొత్త ఫార్ములా ను అందుకున్నారు. ఏ మాత్రం ఓడిపోతార‌ని స‌ర్వేలో తేలితే, సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టేయ‌డానికి ఆయన సిద్ధం అయ్యారు.

  • Written By:
  • Updated On - September 8, 2022 / 11:04 AM IST

`పార్టీ కోసం త్యాగాలు చేయాలి. మీ కోసం పార్టీ త్యాగం చేయ‌దు` అంటూ చంద్ర‌బాబు కొత్త ఫార్ములా ను అందుకున్నారు. ఏ మాత్రం ఓడిపోతార‌ని స‌ర్వేలో తేలితే, సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టేయ‌డానికి ఆయన సిద్ధం అయ్యారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్షను కొన‌సాగిస్తోన్న ఆయ‌న కొంద‌రికి ఖ‌రాకండిగా టిక్కెట్ ఇవ్వ‌న‌ని చెప్పేశార‌ట‌. అంతేకాదు, దొంగ‌నాట‌కాలు కుద‌రద‌ని హెచ్చ‌రించార‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీని పెట్టిన ఆరు నెల‌ల్లోనే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఆనాడు (1983లో) ఎవ‌రూ క‌ష్ట‌ప‌డ‌కుండా ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. రాజ‌కీయాల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యంలేని పెద్ద‌ బ్యాచ్ ను ఎన్టీఆర్ ఆనాడు చ‌ట్ట‌స‌భ‌ల‌కు తీసుకొచ్చారు. ఆయ‌న చ‌రిష్మా మీద రాజ‌కీయాల‌ను న‌డిపారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు చేతికి పార్టీ వ‌చ్చింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో 1999లో మాత్ర‌మే ఆయ‌న పార్టీని అధికారంలోకి తీసుకురాగ‌లిగారు. ఆ త‌రువాత జ‌రిగిన 2004 ఎన్నిక‌ల నుంచి వ‌రుస ఓట‌ముల‌తో ఉమ్మ‌డి ఏపీలో టీడీపీ సంక్షోభంలోకి వెళ్లింది.

Also Read:    NEET 2022 Results : నీట్ 2022 ఫలితాలు విడుదల‌.. స‌త్తా చాటిన తెలుగు విద్యార్థులు

ప్ర‌తిప‌క్షనేత‌గా 2004 నుంచి 2014 వ‌ర‌కు ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు ఎదురీదారు. ఆ స‌మ‌యంలో దేవెంద‌ర్ గౌడ్‌, య‌న‌మ‌ల‌, క‌డియం, మందాజ‌గ‌న్నాథం, నాగం జ‌నార్థ‌న్ రెడ్డి, పెద్దిరెడ్డి, తుమ్మ‌ల‌, క‌ర‌ణం బ‌ల‌రాం, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, ప్ర‌త్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస‌రావు త‌దిత‌ర సీనియ‌ర్లు పెద్ద‌గా ఆయ‌న‌తో క‌లిసి న‌డ‌వ‌లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రులుగా వెల‌గ‌బెట్టిన లీడ‌ర్లు ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత పోరాడేత‌త్త్వాన్ని మ‌రిచిపోయారు. ఎవ‌రికి వారే త‌ప్పించుకునేలా వ్య‌వ‌హరించే వాళ్లు. ఎప్పుడూ చంద్ర‌బాబు ఒంటరి పోరాటం చేయాల్సి వ‌చ్చేది. పైగా ప్ర‌త్యేక రాష్ట్రం గురించి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి లేఖ ఇచ్చే విష‌యంలోనూ ఇరు రాష్ట్రాల సీనియ‌ర్లు కొంద‌రు ఆయ‌న్ను త‌ప్పుదోవ ప‌ట్టించారు.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత చంద్ర‌బాబు అనుభ‌వానికి ఏపీ ప్ర‌జ‌లు 2014లో ప‌ట్టం క‌ట్టారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మ‌ళ్లీ కొత్త బ్యాచ్ (వ్యాపార‌వ‌ర్గం) ఆయ‌న్ను చుట్టేసింది. ఐదేళ్ల పాటు విలాసంగా అధికారాన్ని అనుభవించిన కొంద‌రు లీడ‌ర్లు ఇప్పుడు బ‌య‌ట‌కు రావడానికి ఇష్ట‌ప‌డ‌డంలేదు. మ‌రికొంద‌రు మీడియాకు ప‌రిమితం అవుతున్నారు. ఇంకొందరు పార్టీ ఇచ్చే పిలుపును కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు. దీంతో ఇటీవ‌ల చంద్ర‌బాబు వాళ్ల మీద ఆగ్ర‌హించారు. నాట‌కాలు ఆడితే కుద‌ర‌ద‌ని ముఖంపైనే చెప్పేశార‌ట‌. ప‌నిచేయ‌కుండా ఉండే వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌లేన‌ని తేల్చేశార‌ట‌. అయిన‌ప్ప‌టికీ పోరాడేందుకు సిద్ధంగాలేని నాయ‌కులు ఇప్ప‌టికీ ఇళ్ల‌లోనే త‌ల‌దాచుకుంటున్నారు.

Also Read:   Jagananna Sports Club APP : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తాజా స‌ర్వేల క్ర‌మంలో కొంద‌రు ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. చైత‌న్యంగా ఉండే గుంటూరు జిల్లా లాంటి చోట కొంద‌రు లీడ‌ర్లు ఇప్ప‌టికీ ధైర్యంగా ముందుకు రావ‌డానికి ద‌డుస్తున్నారు. మంత్రులుగా చెలామ‌ణి అయిన వాళ్లు మొఖం చాటేస్తూ రాజ‌కీయాన్ని నైస్ గా న‌డుపుతున్నారు. అలాంటి వాళ్ల‌ను గుర్తించిన టీడీపీ అధిష్టానం మాజీ మంత్రుల‌కు సైతం టిక్కెట్లను తిర‌స్క‌రించ‌డానికి సిద్ధం అయింద‌ని తెలుస్తోంది. నిజంగా చంద్ర‌బాబు అలాంటి ధైర్యం చేస్తారా? అనేది చూడాలి.