YS Jagan : టీడీపీ కోణంలో ‘ఆయ‌నో’ నేర‌సామ్రాట్!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజుకో మ‌లుపు తిరుగుతోన్న ఈ కేసు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని నిద్ర‌లేకుండా చేస్తోంది.

  • Written By:
  • Publish Date - March 2, 2022 / 04:06 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజుకో మ‌లుపు తిరుగుతోన్న ఈ కేసు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని నిద్ర‌లేకుండా చేస్తోంది. సీబీఐ విచార‌ణ ఎలా ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ హ‌త్య చేయించాడ‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ తేల్చేశాడు. కుట్ర అంతా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేశాడ‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ బ‌ల్ల‌గుద్ది చెబుతున్నాడు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీబీఐ విచార‌ణ చేయాల‌నే డిమాండ్ పెరుగుతోంది. తాజాగా టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ ఈ కేసును తప్పుదోవ పట్టిస్తోంది సీఎం జగనే అని ఆరోపించాడు. వివేకా కేసులో సాక్షులను బెదిరించే యత్నాలు జరుగుతున్నాయని తెలిపాడు. సీఎంను అరెస్టు చేసి ఈ వ్యవహారంలో రహస్యాలను బయటికి లాగాలని సీబీఐని కోరాడు. వివేకా హత్య వెనుక జగన్ సకుటుంబ సపరివార సమేత కుట్ర ఉందని ఆరోపించాడు.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా గోరంట్ల విమర్శలు గుప్పించాడు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత టీడీపీ తరఫున పోటీ చేస్తుందని సజ్జల అనడం హేయమైన విషయంగా అభివ‌ర్ణించాడు. అడ్డగోలుగా మాట్లాడడం సజ్జలకు తగదని హితవు పలికారు. వివేక హ‌త్య కేసుకుని వీలున్నంత రాజ‌కీయ రంగును ఏపీ రాజ‌కీయ పార్టీలు. పులుమేస్తున్నాయి. సీబీఐ విచార‌ణ వేగ‌వంతం అయ్యే కొద్దీ వివేక హ‌త్య వెనుక టీడీపీ ఉంద‌ని వైసీపీ ఆరోప‌ణ చేయ‌డం గ‌మనార్హం.

ఒక వేళ టీడీపీ ప్ర‌మేయం ఉంటే, విచార‌ణ వేగంగా చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ స‌హ‌కారం అందించాలి. సీబీఐ విచార‌ణ‌కు అవ‌స‌ర‌మైన `క్లూ`ల‌ను అందించాలి. వివేక కుమార్తె డాక్ట‌ర్ సునీత అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇచ్చిన వాగ్మూలం ప్ర‌కారం పూర్తిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మేయం వివేక హ‌త్య వెనుక ఉంద‌ని అర్థం అవుతుంది. ఇక వివేక భార్య సౌభాగ్య‌మ్మ వాగ్మూలం డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి ప్ర‌మేయంపై అనుమానాల‌ను క‌లిగిస్తోంది. కారు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి త‌ర‌చూ అప్పులు తీసుకున్న విష‌యాన్ని ఆమె చెబుతున్నారు. అంటే, ఆ అప్పులు క‌ట్ట‌లేక ద‌స్త‌గిరి హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటాడేమో అనే అనుమానం క‌లిగేలా సౌభాగ్య‌మ్మ వాగ్మూలం ఉంది.డాక్ట‌ర్ సునీత ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాత్రం పూర్తిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మేయంపై అనుమానం వ్య‌క్త‌ప‌రుస్తూ వాగ్మూలం ఇవ్వ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఆ వాగ్మూలాన్ని బేస్ చేసుకుని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద టీడీపీ విరుచుకుప‌డుతోంది. వివేక హంత‌కునిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతోంది. సునీత విచ్చిన వాగ్మూలం ప్ర‌కారం వివేక కుటుంబానికి స‌న్నిహితుడు ఎంపీ అవినాష్ ప్ర‌ధాన‌ నిదితుడు. మ‌రో నిందితుడు శివశంకర్ రెడ్డి కి మాజీ మంత్రి వివేక‌నంద రెడ్డికి ఎదుట ప‌డాలంటే భయం. అలాంటి శివ శంకర్ రెడ్డి హ‌త్య జ‌రిగిన రోజు వివేకా మృత‌దేహం ఉన్న‌ ప్రదేశం నుంచి అవినాష్‌రెడ్డి వెళ్లిపోయాక కూడా అక్కడే ఉన్నాడు. అత‌నిపై గతంలో చాలా నేరారోపణలు ఉన్నాయి. 2017లో వివేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆయన కారణం. సంఘటన జరగడానికి ముందు రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఎర్ర గంగిరెడ్డి ఆయనకు ఫోన్ చేశాడు. వివేక మృతదేహాన్ని చూడడానికి ముందు ఒకసారి, చూసిన తర్వాత ఒకసారి సాక్షి విలేకరికి శివశంకర్రెడ్డి ఫోన్ చేశాడు. ఉదయం 6.24కి 141 సెకన్లు, ఉదయం 6.46కి 17 సెకన్లు ఆయనతో మాట్లాడారు. ఈ విష‌యాన్ని సీబీఐ నిర్థారించుకుంది.

ఆర్థిక నేర‌స్తుడుగా జ‌గన్మోహ‌న్ రెడ్డి మీద గ‌త ప‌దేళ్లుగా టీడీపీ ఆరోప‌ణ‌లు చేసింది. అందుకు సంబంధించిన ఆధారాల‌ను అవినీతి చ‌క్ర‌వ‌ర్తి పేరుతో ఢిల్లీ స్థాయిలో పంచిపెట్టింది. ల‌క్ష కోట్లను క్విడ్ ప్రో కో కింద దోచేశాడ‌ని ఆరోపించింది. ఆ ఆరోప‌ణ‌లను పుస్త‌కం రూపంలో తీసుకొచ్చిన మాజీ ఎంపీ మైసూరారెడ్డి ఆనాడు టీడీపీలో ఉన్నాడు. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ చురుగ్గా రాజ‌కీయాల్లోకి రావ‌డంలేదు. ఏదో అంకెలు బాగున్నాయ‌ని వేసి ల‌క్ష కోట్ల ఆరోపణ‌ను జ‌గ‌న్ మీద మోపాన‌ని ఒక. ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చెప్పాడు. కానీ, టీడీపీ మాత్రం ఇప్ప‌టికీ ఆయ‌న మీద ల‌క్ష కోట్ల క్విడ్ ప్రో కో ఆరోప‌ణ‌లు చేస్తోంది. వాటిలో ఏ ఒక్క ఆరోప‌ణ‌ను కూడా అధికారంలో ఉన్న‌ప్పుడు టీడీపీ నిరూపించ‌లేక లేక‌పోయింది.మాజీ మంత్రి వివేక హ‌త్య 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగింది. ఆ హ‌త్య జ‌రిగిన టైంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్నాడు. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు. అయిన్ప‌టికీ వివేక హ‌త్య‌కు సంబంధించిన ఆధారాల‌ను అప్ప‌ట్లో రాబ‌ట్ట‌లేక‌పోయారు. ఆనాడు సీబీఐకి కేసును అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకోలేదు. ప్ర‌తిప‌క్ష నేత‌గా అప్ప‌ట్లో ఉన్న జ‌గ‌న్ మాత్రం సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేశాడు. విచిత్రంగా సీఎం అయిన త‌రువాత జ‌గ‌న్ సీబీఐ విచార‌ణకు వ్య‌తిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు సీబీఐ విచార‌ణ‌కు టీడీపీ మ‌ద్ధ‌తు ప‌లుకుతోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు మాత్రం సీబీఐని రాష్ట్రంలోకి ఎంట్రీ కాకుండా చంద్ర‌బాబు తీర్మానం చేశాడు. త‌ద్విరుద్ధంగా ఇప్పుడు వివేక హత్య కేసును విచారిస్తోన్న సీబీఐకి మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నాడు. బాబాయ్ హ‌త్య కేసులో జగ‌న్మోహ‌న్ రెడ్డిని హంతకుడిగా టీడీపీ నిర్థారిస్తోంది. సీబీఐ ఏమి చెప్పిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ హంత‌కుడని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నార‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ప్ర‌చారం చేస్తున్నాడు. మొత్తం మీద రోజుకో ర‌కంగా వాగ్మూలాలు బ‌య‌ట‌కు వ‌స్తుంటే, ఏపీలోని విప‌క్ష పార్టీలు మాత్రం ఆనాడు ఆర్థిక నేర‌గాడిగా జ‌గ‌న్ ను ప్ర‌జాక్షేత్రంలో నిల‌బెట్ట‌గా, ఇప్పుడు హంత‌కునిగా ప్ర‌జాపీఠంపై నిరంత‌రం నిలుపుతున్నాయి. అంతిమంగా ప్ర‌జా తీర్పు ఎటు వైపు అనేది చూడాలి.