ఏపీ బంద్‌…క‌థాక‌మామీషు

  • Written By:
  • Publish Date - October 20, 2021 / 11:58 AM IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు ధ్వ‌సం చేసినందుకు నిర‌స‌న‌గా ఏపీ వ్యాప్తంగా బంద్ కొన‌సాగుతోంది. స్వ‌చ్చంధంగా కొన్ని చోట్ల బంద్ లో సాధార‌ణ ప్ర‌జ‌లు పాల్గొన్నారు. షాపుల‌ను మూసివేసి వ్యాపారులు న‌గ‌ర, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిర‌స‌న తెలిపారు. టీడీపీ నేత‌ల‌ను ముంద‌స్తుగా ఎక్క‌డిక‌క్క‌డే పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో కొంద‌ర్ని ఉంచారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్ల‌ను అరెస్ట్ చేసి పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. అన‌కాప‌ల్లి ప‌ర్య‌ట‌న‌ను ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ ర‌ద్దు చేసుకున్నారు. ఇంకో వైపు చంద్ర‌బాబు నాయుడు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. నోరు అదుపులేకుండా టీడీపీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని, వాళ్ల‌కు. చంద్ర‌బాబునాయుడు డైరెక్ష‌న్ ఇస్తున్నాడ‌ని మంత్రి బొత్సా ఫైర్ అయ్యారు. అందుకే చంద్ర‌బాబు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని రాజ‌కీయ‌దాడి చేస్తున్నాడు.

ఈ రాద్ధాంతం అంతా గంజాయి, డ్ర‌గ్స్ నేప‌థ్యంలో నెల‌కొంది. తాడేప‌ల్లి పాలెస్ నుంచి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని టీడీపీ నేతలు ఇటీవ‌ల ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆప్ఘ‌నిస్తాన్‌లోని తాలిబ‌న్ల‌కు, వైసీపీ నేత‌లకు సంబంధాలు ఉన్నాయ‌ని విరుచుకుప‌డ్డారు. మీడియా ముందు ప్ర‌తిరోజూ క‌నిపించే ప‌ట్టాభిరామ్ వైసీపీ నేత‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డమే కాకుండా అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడాడు. రాజ‌కీయంగా ఎదురుదాడికి వైసీపీ నేత‌లు ప‌ట్టాభిరామ్ మీద చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న తీరులో మార్పురాలేదు. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు మూకుమ్మ‌డిగా ఒకేసారి ఏపీలోని ఆరు చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల ఆస్తులు, భౌతిక దాడులు చేయ‌డం శోచ‌నీయం.

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత రాజ‌కీయ ప‌ర‌మైన దాడుల‌ను ప్ర‌తిప‌క్ష టీడీపీ చేస్తోంది. మ‌ద్యం, ఇసుక‌, సిమెంట్‌, న‌వ‌ర‌త్నాలు, గుళ్లు, గోపురాలు త‌దిత‌ర అంశాల‌పై జ‌గ‌న్ ను ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం స‌హ‌జంగా జ‌రిగింది. కానీ, గుజ‌రాత్ ముద్ర ఓడ‌రేవులో డ్ర‌గ్స్ పెద్ద ఎత్తున సీజ్ చేసిన ద‌గ్గ‌ర నుంచి ఏపీ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రం అయింది. విజ‌య‌వాడ మూలాల‌ను ఎన్ఐఏ అనుమానించింది. అషి ట్రేడ‌ర్స్ చిరునామాతో డ్ర‌గ్స్ దిగుమ‌తి అవుతుంద‌ని గ్ర‌హించి విచార‌ణ చేప‌ట్టింది. కాకినాడ ఓడ‌రేవు కేంద్రంగా డ‌గ్స్ వ్యాపారం జ‌రుగుతోంద‌ని
టీడీపీ ఆరోప‌ణ‌ల‌కు దిగింది. దీని వెనుక ఎమ్మెల్యే. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఉన్నార‌ని డైరెక్ట్ అటాక్ చేసింది. అంతేకాదు, చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చేత నేరుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ వ్య‌వ‌హారాన్ని న‌డిపిస్తున్నాడ‌ని దుమ్మెత్తి పోసింది.

డ్ర గ్స్ వ్య‌వ‌హారం న‌డుస్తుండగా, గంజాయి స్మగ్లింగ్ వ్య‌వ‌హారం తెర మీద‌ర‌కు వ‌చ్చింది. తెలంగాణ‌, క‌ర్నాట‌క‌, ముంబాయ్ పోలీసులు ఏపీలోని గంజాయి స‌ర‌ఫ‌రా కేంద్రాల‌పై ద‌ర్యాప్తు చేశారు. కొంద‌ర‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒడిస్సా, మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఏపీ నుంచి గంజాయి వెళుతోంద‌ని ఇత‌ర రాష్ట్రాల పోలీసులు నిర్థారించారు. ఆ విష‌యాన్ని తెలుగుదేశం పార్టీ రాజ‌కీయ కోణంలో నుంచి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. గంజాయి స్మ‌గ్లింగ్ అంతా వైసీపీ నేత‌ల ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతోంద‌ని విస్తృతంగా ప్ర‌చారం చేసింది. అంతేకాదు, దీని వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నార‌ని ఆరోపించింది. జ‌గ‌న్ ముఠా గంజాయి స్మ‌గ్లింగ్ తో వేల కోట్ల‌ను విదేశాల‌కు త‌ర‌లిస్తోంద‌ని ప‌ట్టాభిరామ్ ప‌లుమార్లు ఆరోపించారు. ఆ క్ర‌మంలో జ‌గ‌న్ మీద బూతు ప‌దాలు ఉప‌యోగించారు. దీంతో వైసీపీ నేత‌లు భౌతికి దాడుల‌కు దిగారు. టీడీపీ ఆఫీస్ ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని విధ్వంస ర‌చ‌న చేశారు. లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోలో త‌ప్పింద‌ని చంద్ర‌బాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గ‌వ‌ర్న‌ర్ కు ఫోన్ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ రాజ‌కీయంగా చంద్ర‌బాబుపై ఎదురుదాడి చేస్తోంది. ఫ‌లితంగా ఏపీలో రాజుకున్న రాజకీయ మంట బంద్ కు దారితీసింది.