Nara Lokesh : శ‌భాష్ లోకేష్‌! టీడీపీలో మార్పు!!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ తీసుకుంటోన్న క‌ఠిన నిర్ణ‌యాలు క్యాడ‌ర్ కు కొత్త ఆశలను క‌లిగిస్తున్నాయ‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

  • Written By:
  • Updated On - June 13, 2022 / 03:17 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ తీసుకుంటోన్న క‌ఠిన నిర్ణ‌యాలు క్యాడ‌ర్ కు కొత్త ఆశలను క‌లిగిస్తున్నాయ‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకు ఇటీవ‌ల మ‌హిళా నేత దివ్య‌వాణి ఎపిసోడ్ వెనుక జ‌రిగిన త‌తంగాన్ని చెప్పుకుంటున్నారు. మ‌హానాడు వేదిక‌గా అవ‌మానం జ‌రిగింద‌ని లోకేష్ వ‌ద్ద ఆమె పంచాయ‌తీ పెట్టార‌ట‌. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన అవ‌మానం గురించి అడిగార‌ట‌. `మీకు కుర్చీ లేకుండా చేశారా? మీరు కూర్చున్న కుర్చీని ఎవ‌రైనా తీసేశారా? ` అని లోకేష్ అడిగార‌ట‌. మ‌హానాడు వేదిక‌పైన ప్ర‌సంగించే అవ‌కాశం లేకుండా చేశార‌ని దివ్య‌వాణి చెప్పార‌ట‌. ప్రాధాన్యం ఎక్కువ‌గా లోక‌ల్ గా ఉండే సీనియ‌ర్ల‌కు అవ‌కాశం ఇచ్చామ‌ని లోకేష్ వివ‌ర‌ణ ఇచ్చే లోపే.. ఆమె క‌న్నీళ్లు పెట్టుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఇలా అయితే, పార్టీలో ఉండ‌లేమ‌న్న‌ట్టు సంకేతం ఇచ్చింద‌ట‌. దీంతో లోకేష్ చాలా సున్నితంగా `మీరు వెళ్లాల‌నుకుంటే వెళ్లండి, ఇష్టంలేకుండా ప‌నిచేయ‌లేరు. మీ ఇష్టం.` అన్నార‌ట‌. ఆ మాట దివ్య‌వాణికి ఒక్క‌సారిగా షాక్ అనిపించి ఉండొచ్చు. అందుకే, ఆ ఫ్ర‌స్ట్రేష‌న్ తో పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ త‌రువాత కొంద‌రు ఆమెను బుజ్జ‌గించడంతో వెంట‌నే డిలీట్ చేశారు.

ఆ త‌రువాత ఆమె గురించి కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్ట‌డం, వాటిపైన దివ్య‌వాణి మీడియా ముందు మండిప‌డ‌డం చూశాం. అంతిమంగా ఆమె రాజీనామా చేసి వెళ్లిపోతూ పార్టీ కార్యాల‌యంలోని కొంద‌రిపైన ఉమ్మెత్తిపోశారు. స‌రిగ్గా ఈ ఎపిసోడ్‌ను గుర్తు చేసుకుంటోన్న తెలుగు యువ‌త మాత్రం లోకేష్ క‌రెక్ట్ గా రియాక్ట్ అయ్యారంటూ సంతోష ప‌డుతున్నారు. ఎందుకంటే, గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు చంద్ర‌బాబు మెత‌క వైఖ‌రితో వ్య‌వ‌హరించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. పైగా కొన్ని సందర్బాల్లో త్యాగం చేస్తూ పార్టీ టిక్కెట్ల‌ను కూడా ఇచ్చారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌స్తుత పొలిట్ బ్యూరో మెంబ‌ర్ వ‌ర్ల రామ‌య్య 2009 ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌లేద‌ని బాబు ఇంటి ముందే ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు. అంతేకాదు, చంద్ర‌బాబు మీద దుమ్మెత్తి పోశారు. దీంతో వ‌ర్ల‌ను తిరిగి పిలిపించి తిరుప‌తి టిక్కెట్ ఇవ్వ‌డం టీడీపీలో ఉన్న వాళ్ల‌కు గుర్తుండే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. అవ‌న్నీ చంద్ర‌బాబు మెత‌క వైఖ‌రిని గుర్తు చేస్తుంటాయి. కానీ, లోకేష్ మాత్రం అందుకు భిన్న‌మ‌నే సంకేతాలు దివ్య‌వాణి ఎపిసోడ్ లో ఇచ్చారు.

సాధార‌ణంగా చంద్ర‌బాబు ఎవ‌రినీ నొప్పించ‌కుండా రాజ‌కీయం చేయాల‌ని చూస్తారు. ఆ క్ర‌మంలో ఎవ‌రికీ ప‌ద‌వులు ఇవ్వ‌కుండా నాన్చుడి ధోర‌ణి ఉండేది. ఒక‌రికి ఇస్తే మ‌రొక‌రు రివ‌ర్స్ అవుతార‌ని 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వ‌డానికి వెనుకాడారు. ప్ర‌భుత్వం గ‌డువు ముగిసే వ‌ర‌కు చాలా పోస్ట్‌ల‌ను భ‌ర్తీ చేయ‌లేక‌పోయారు. సంస్థాగత నియామ‌కాల విష‌యంలోనూ నాన్చుడి ధోర‌ణి చంద్ర‌బాబులో క‌నిపిస్తుంది. `చూద్దాం..చేద్దాం` అంటూ సంవ‌త్స‌రాలు గ‌డిపిన సంద‌ర్భాలు అనేకం. అందుకే, చంద్ర‌బాబు చెప్పినా చేయ‌రు అనే నానుడి పార్టీలో అంత‌ర్గ‌తంగా త‌ర‌చూ వినిపిస్తుంటుంది. కానీ, లోకేష్ మాత్రం అందుకు భిన్న‌మంటూ క్యాడ‌ర్ చ‌ర్చించుకుంటుంది. చెప్పిన మాట‌పై నిల‌బ‌డ‌డ‌మే కాకుండా నాన్చుడి ధోర‌ణి అనేది ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఖ‌రాఖండిగా ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటార‌ని త‌మ్ముళ్లు సంబ‌ర‌పడుతున్నారు. అందుకు దివ్య‌వాణి ఎపిసోడ్ ను ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. ఇక ఇటీవ‌ల క‌డ‌ప, క‌ర్నూలు జిల్లా నుంచి వచ్చిన సీనియ‌ర్ల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తూనే టిక్కెట్ హామీని లోకేష్ ఇవ్వ‌లేద‌ట‌. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో మార్పు క్లియ‌ర్ గా లోకేష్ రూపంలో క‌నిపిస్తుంద‌ని క్యాడ‌ర్ విశ్వ‌సిస్తోంది.