కృష్ణాజిల్లా రాజకీయాల్లో ఆయన వెలుపెట్టని నియోజకవర్గం లేదు. జిల్లాకి తానే సీఎం అయినట్లు వ్యవహరిస్తూ తన పెత్తనం అంతా నాయకులపై చేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ కార్యకర్తల్ని పట్టించుకోని ఆయన.. అధికారం పోయిన తరువాత వర్గాలను ప్రోత్సహిస్తూ రాజకీయం చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి కృష్ణాజిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఒట్టెద్దు పోకడలతో క్యాడర్ విసిగిపోయింది. ప్రస్తుతం మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్.. టీడీపీలో ఉన్నావారే..అయితే ఈ మాజీమంత్రి గారి వ్యవహారశైలితో విసిగిపోయి వైసీపీలోకి వెళ్లి ఆయనమీదే పోటీ చేసి గెలిచారు. గతంలో టీడీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ సైతం దేవినేని ఉమా వ్యవహారశైలి వల్లే పార్టీని వీడామని బహిరంగంగా చెప్పారు. అయినప్పటికీ ఈ మాజీ మంత్రిగారి తీరు మార్చుకోలేదు. అప్పుడు వాళ్లని ఇబ్బంది పెట్టిన ఈయన.. ఇప్పుడు కొత్తనాయకులను తీసుకువచ్చి అన్ని నియోకవర్గాల్లో వర్గపోరుకు తెరలేపారు. విజయవాడ పార్లమెంట్‌తో పాటు, పక్కనే ఉన్న గుడివాడ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి తలదూరుస్తున్నారని క్యాడర్ ఆగ్రహంతో ఉంది. అక్కడ ఇంఛార్జ్‌గా రావి వెంకటేశ్వరరావు ఉన్నప్పటికీ ఎన్నారై వెనిగండ్ల రాముని తీసుకువచ్చి కార్యక్రమాలను చేపిస్తున్నారని క్యాడర్ ఆరోపిస్తుంది.
TDP
ఇటు మైలవరం నియోజకవర్గంలో కూడా ఆయనకు వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. స్థానికులకే టికెట్ ఇవ్వాలని నినాదం బలంగా సాగుతుంది. ఇప్పటికే దీనిపై అధిష్టానం దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కార్యక్రమాలు చేస్తున్నారు. బొమ్మసానికి స్థానిక నేతలంతా మద్దతు ఇస్తున్నారు. గతంలో ఉమా ఇక్కడ గెలవడానికి బొమ్మసాని లాంటి కీలక నేతల కృషి ఉంది. అయితే ఉమా ఇప్పుడు వారందరిని లెక్కచేయకపోవడం వారిని అవమానించేలా కార్యక్రమాలు చేస్తుండటంతో వారికి మింగుడు పడటం లేదు. నందిగామ నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకటరమణకు కుడి, ఎడమ భుజంగా ఉండే నాయకులు ఆయన మరణం తరువాత ఆయన సోదరుడు ఉమా వెంట నడిచారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఉమాకు అన్ని వాళ్లే చూసుకుని ఆయన గెలుపులో కీలకపాత్ర పోషించారు. రమణ ముఖ్య అనుచరుడిగా ఉన్న గన్నే ప్రసాద్(అన్నా)ను సైతం ఉమా ఇబ్బందులకు గురి చేస్తున్నారని క్యాడర్‌లో చర్చ నడుస్తుంది. దీంతో గన్నే ప్రసాద్ మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమైయ్యారు. మాజీమంత్రి దేవినేని ఉమా అహంకారం, ఒంటెద్దు పోకడలు వల్ల క్యాడర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు చర్చించుకుంటున్నారు.
TDP
ఇటు కొండపల్లికి చెందిన సీనియర్ నేత కరిమికొండ బాలాజీరావు పేరుతో కరపత్రాలు ప్రత్యక్ష మైయ్యాయి. మైలవరంలో టీడీపీకి పూర్వవైభవం రావాలంటే మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని ఇంఛార్జ్‌గా తప్పించాలని ఆయన అధినేత చంద్రబాబుకు లేఖలు రాస్తూ వాటిని కరపత్రాలు ముద్రించారు. కార్యకర్తల్ని ఎలా కాపాడుకోవాలో గద్దె రామ్మెహన్ లాంటి వాళ్లని చూసి నేర్చుకోవాలని కరపత్రాల్లో ముద్రించారు. ఉమా మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని తెలిపారు. ఆయన వ్యవహారశైలితో చాలా మంది పార్టీని వీడిపోతున్నారని తక్షణం చర్యలు తీసుకుని మైలవరం నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ని నియమించాలని కరిమికొండ బాలాజీరావు కోరుతున్నారు. మరి మైలవరం మళ్లీ ఉమాకే దక్కుతుందా లేదా కొత్తవారికి అవకాశమిస్తారా వేచి చూడాలి