Andhra Pradesh: ఏపీ బడ్జెట్ స‌మావేశాలు.. టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుందా..?

  • Written By:
  • Publish Date - February 26, 2022 / 12:37 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మార్చి 7 నుంచి రాష్ట్ర‌ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు అంటే దాదాపు 15 నుంచి 20 ప‌నిదినాలు ఉండేలా బడ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. అయితే ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశంపార్టీ ఈ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక‌మందు తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని గ‌తంలోనే చంద్ర‌బాబు తేల్చిచెప్పారు.

గత శీతాకాల సమావేశాల్లో భాగంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్ళీ ముఖ్య‌మంత్రిగా గెలిచి, తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని నాడు చంద్ర‌బాబు శపథం చేశారు. అయితే ఇటీవ‌ల టీడీపీ సినియ‌ర్ నేత‌ల‌తో భేటీ అయిన చంద్ర‌బాబు బ‌డ్జెట్ స‌మావేశాల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో అధికార వైసీపీ అహంకార వైఖరికి నిరసనగా, మార్చిలో జ‌రిగే బడ్జెట్​ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం.

అయితే వ‌చ్చే నెలలో జ‌రుగ‌నున్న‌ ఏపీ బడ్జెట్ స‌మావేశాలకు వెళ్ళాలా లేకుంటే బ‌హిష్క‌రించాలా అనేదానిపై ఇంకా టీడీపీ అధిష్టానం తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు అంటున్నారు. చంద్ర‌బాబు ఎలాగూ తేల్చి చెప్పారు… యితే ఈ క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఈ స‌మావేశాల‌కు హాజ‌రవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మావేశంలో భాగాంగా కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు బ‌డ్జెట్ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించ‌ల‌ని చంద్ర‌బాబుకు చెప్ప‌గా, కొంద‌రు టీడీపీ నేత‌లు మాత్రం వారి నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించార‌ని టీడీపీ వ‌ర్గీయులు చెబుతున్నారు.

వైసీపీ అరాచ‌క పాల‌న‌, అవినీతి, అక్ర‌మాలు, త‌ప్పుడు నిర్ణ‌యాలను బ‌య‌ట‌పెట్టేందుకు, ఈ బ‌డ్జెట్ స‌మావేశాలు ఓ మంచి వేదిక‌గా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. అలాగే ఈ స‌మావేశాల్లో మూడు రాజ‌ధానుల బిల్లును వైసీపీ స‌ర్కార్ తిరిగి ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో బ‌డ్జెట్ స‌మావేల‌ను బ‌హిష్క‌రిస్తే, త‌మ వాద‌ల‌ను వినిపించ‌లేమ‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వెళ్ళినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, టీడీపీ నేత‌లకు స‌భ‌లో మాట్లాడే అవకాశం, వైసీపీ ఇవ్వ‌ద‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డాని తెలుస్తోంది. అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ వైసీపీకి మెజారిటీ ఉండ‌డంతో వీరి వాద‌న‌కు బ‌లం చేకూరుతున్న క్ర‌మంలో అసెంబ్లీ బ‌డ్జెట్ సెష‌న్స్‌ను టీడీపీ బ‌హిష్కారిస్తుందో లేదో చూడాలి.