Kodali vs TDP : గుడివాడలో కొడాలి నానిపై టీడీపీ దాడి, పరిస్థితి ఉద్రిక్తం..!!

మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 01:18 AM IST

మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. నాని దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. నానిపై గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన నేతలు దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారికి చెప్పారు. పామూరులో కొందరు నేతలను పోలీసులు ఆపివేశారు. టీడీపీ కార్యకర్తలు పలువురు గుడివాడలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గుడివాడలో రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పోలీస్ అధికారుల పర్యవేక్షణలో గుడివాడలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పామూరులో, గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇతర ప్రాంతాల నుంచి గుడివాడ బయలుదేరిన నేతలను,కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుని ఆపివేశారు. కంకిపాడు టోల్‍గేట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను అరెస్టు చేసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను అరెస్టు చేసి పమిడిముక్కల పోలీస్ స్టేషన్‍కు తరలించారు.

టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడులను పామర్రు ప్రధాన రహదారిపై పోలీసులు నిలిపివేశారు. వారు కార్ డోర్ లాక్ చేసుకుని లోపలే కూర్చొన్నారు. కారు లోపలున్న టీడీపీ నేతలను ఎలా బయటకు తేవాలో తెలియక పోలీసులు సతమతమయ్యారు. కారు చుట్టూ పోలీసులు వలయంగా ఏర్పడ్డారు. కారు డోరును బ్రేక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. స్క్రూ డైవర్ల ద్వారా లాక్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. దాదాపు మూడు గంటలపాటు కారు డోర్ లాక్ చేసుకుని టీడీపీ నేతలు లోపలే కూర్చున్నారు. చివరకు పోలీసులు కారు ఫ్రంట్ డోర్ అద్దాన్ని రాయితో పగలగొట్టి కారు తాళం తీశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులోని లాడ్జి సెంటర్‍లో టీడీపీ ఇన్‍ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కొడాలి నాని దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. నాని ఫొటోలను చెప్పులతో కొట్టి నాని, సీఎం జగన్ మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.