Polavaram : పొలిటిక‌ల్ `ఛాలెంజ్` ప్రాజెక్టు.!

కేంద్ర మంత్రి ష‌కావ‌త్ పోలవ‌రంను సంద‌ర్శించి వెళ్లిన త‌రువాత టీడీపీ, వైసీపీ మ‌ధ్య రాజ‌కీయ ర‌గ‌డ ప్రారంభం అయింది.

  • Written By:
  • Updated On - March 5, 2022 / 04:47 PM IST

కేంద్ర మంత్రి ష‌కావ‌త్ పోలవ‌రంను సంద‌ర్శించి వెళ్లిన త‌రువాత టీడీపీ, వైసీపీ మ‌ధ్య రాజ‌కీయ ర‌గ‌డ ప్రారంభం అయింది. బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టును జ‌గ‌న్ స‌ర్కార్ బ్యారేజి కింద మార్చేసింద‌ని చంద్ర‌బాబు ఆరోపించాడు. తెలుగుదేశం మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే, 2020 నాటికే పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి అయ్యేద‌ని శుక్ర‌వారం జ‌రిగిన రైతు స‌ద‌స్సులో గుర్తు చేశాడు. దీంతో జ‌గ‌న్ స‌ర్కార్ రియాక్ట్ అయింది. ఫ‌లితంగా మ‌రోసారి పోల‌వ‌రం నిర్మాణంలో రాజ‌కీయ ప్ర‌వాహం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది.ఏపీ సీఎంగా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రం స‌మీక్ష‌కు కేటాయించాడు. వేగంగా ప‌నులు పూర్తి చేయ‌డానికి కాంట్రాక్ట‌ర్ల‌పై ఒత్తిడి పెట్టాడు. కానీ, 2019లో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత రివ‌ర్స్ టెండ‌ర్స్ వేసింది. మేఘా కంపెనీకి నిర్మాణ ప‌నుల‌ను అప్ప‌గించింది. ఆ ప్రాజెక్టు ఎత్తును, వ్య‌యాన్ని కేంద్రం కుదించింది. 2021 నాటికి పూర్తి చేస్తామ‌ని స‌వాల్ చేసిన రాష్ట్ర నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ రివ‌ర్స్ లోకి వెళ్లాడు. అందుకే, పోల‌వరం బ్యారేజి ని కూడా స‌కాలంలో పూర్తి చేయ‌లేక‌పోయార‌ని బాబు వేసిన సెటైర్ వైసీపీకి మండేలా చేసింది. ప్ర‌తిగా రియాక్ట్ కావ‌డానికి ఎంపీ మార్గాని భ‌ర‌త్ సీన్లోకి వ‌చ్చాడు. పోల‌వ‌రం ప్రాజెక్టును బ్యారేజీ మాదిరిగా కుదించాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ఆనాడు ప్ర‌య‌త్నం చేసింద‌ని భ‌ర‌త్ రివ‌ర్స్ అటాక్ ఇచ్చాడు. పోల‌వ‌రాన్ని ప్రాజెక్టుగానే క‌డుతున్నామ‌ని చెప్ప‌డానికి ఎవ‌రితోనైనాచ‌ర్చ‌కు సిద్ధమ‌ని స‌వాల్ విసిరాడు. తొలి నుంచి పోల‌వ‌రం వైసీపీ, టీడీపీ మ‌ధ్య రాజ‌కీయ ప్రాజెక్టుగా మారింది. దాన్నో ఏటీఎంగా చంద్ర‌బాబు మార్చాడ‌ని బీజేపీ చేస్తోన్న విమ‌ర్శ‌. ప్రాజెక్టు మీద ఓట్లు దండుకోవాల‌ని ఏ పార్టీకి ఆ పార్టీ దానిలోని లోపాల‌ను త‌వ్వే ప్ర‌యత్నం చేస్తున్నాయి. విభ‌జ‌న హామీ ప్ర‌కారం నిర్మించాల‌ని ఏ పార్టీ అనుకోవ‌డంలేదు. ఆ విష‌యాన్ని నిర్వాసితులు ప‌దేప‌దే చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి అన్యాయం జరిగింద‌ని టీడీపీ చెబుతోంది. కుదించ‌డం కార‌ణంగా 30 వేల కోట్ల వ‌ర‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆ పార్టీ వాద‌న‌. పోలవరం ప‌నులు 70 శాతం బాబు హ‌యాంలోనే జ‌రిగాయ‌ని చెబుతోన్న మాట‌ను మంత్రి అనిల్ త్రోసిబుచ్చాడు. ఒకవేళ 70 శాతం పనులు పూర్తి అయినట్లు చూపిస్తే మీసం తీయించుకుంటాన‌ని స‌వాల్ చేశాడు. అందుకు భిన్నంగా ఉంద‌ని నిరూపిస్తే మాజీ మంత్రి దేవినేని ఉమా మీసాలు తీసేయాలని చాలెంజ్ విసిరాడు. అప్ప‌ట్లో ఆ ఛాలెంజ్ మీద కొంత కాలం రాజ‌కీయం న‌డిచింది. ఆ త‌రువాత కొన్ని రోజుల‌కు సీఎం జగన్ రివ్యూ చేసిన సంద‌ర్భంగా 70 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్ప‌డంతో ఆనాడు మంత్రి అనిల్ కు సంక‌టంగా మారింది.వాస్త‌వంగా పెరిగిన రేట్ల ప్ర‌కారం పోల‌వ‌రం నిర్మాణంకు 55 వేల కోట్ల రూపాయలు అవ‌స‌ర‌మ‌ని బాబు హ‌యాంలోని ఏపీ స‌ర్కార్ కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్రం అంగీక‌రించింద‌ని టీడీపీ చెబుతుంటే, కాద‌ని వైసీపీ వాదిస్తోంది. ఆ మేర‌కు డిమాండ్ చేయ‌లేని జ‌గ‌న్ స‌ర్కార్ కేవ‌లం రూ. 25వేల కోట్ల‌కు అంగీక‌రించింది. దీంతో రూ. 30వేల కోట్ల ఏపీకి న‌ష్టం జ‌రిగింద‌ని టీడీపీ లెక్కిస్తోంది.

వాస్త‌వానికి కేంద్ర‌ జలశక్తిశాఖ పరిధిలోని సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు గ‌త ఏడాది ఫిబ్రవరిలోనే ఆమోదించింది. అదే శాఖ ప్ర‌స్తుతం ఆ అంచనాల్లో భారీ కోతపెట్టి రూ.47,725.74 కోట్లకు పరిమితం చేసింది. దీంతో రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయం ఫైల్‌ కేంద్ర ఆర్థికశాఖకు చేరింది. ఆర్థికశాఖ ఆ అంచ‌నా వ్యయాన్ని మదింపు చేసి.. రూ.33 వేల కోట్లకే ప‌రిమితం చేసే వీలుంద‌ని తేల్చింది. దీంతో 14,725 కోట్ల మేర భారీగా కోత ప‌డేలా ఆర్థిక‌శాఖ రివ‌ర్స్ అంచ‌నాల‌ను వేసింది. భూ సేకరణకు అంచనా వ్య‌యం రూ.33,168.23 కోట్లతో జలశక్తి శాఖ విభేదించింది. దాన్ని రూ.28,172.21 కోట్లకే ప‌రిమితం చేసింది. మొత్తానికి రూ.47,725.74 కోట్లకు కుదించిన అంచనా వ్యయం ఫైల్ ను కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. అంటే, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్ల నుంచి కేంద్ర జలశక్తి శాఖ 47,725 కోట్లకు కుదించింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మ‌రింత తెగ్గోసి రూ.33 వేల కోట్లకు ఖ‌రారుకు ప్లాన్ చేసింది.

ప్రాజెక్టు కోసం 55,656 కోట్ల రూపాయల సవరించిన అంచనాలను ఆమోదించేందుకు ఏళ్ల తరబడి ఉత్తర ప్రత్యుత్తరాలతో కేంద్రం సాగ‌దీసింది. 2010-11 నాటి ధరలతో ఆమోదించిన 16010.45 కోట్ల రూపాయల అంచనాలనే కేంద్రం పరిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఆ నిధులను కూడా ఇచ్చేందుకు కొర్రీలు వేస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో మొత్తం 30.7 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఇందులో 7.2 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు కాగా, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. కానీ, దాని అస‌లైన రూపురేఖ‌లు మార్చేస్తూ నానాటికీ కుదిస్తోన్న కేంద్రం బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టును నిజంగానే బ్యారేజి స్థాయికి తీసుకొచ్చింద‌ని సాగునీటి రంగ నిపుణుల భావ‌న‌. ఆ విష‌యాన్నే చంద్ర‌బాబు చెబుతున్నాడు. ఆ ప్రాజెక్టు విష‌యంలో అఖిల‌ప‌క్షాన్ని నియ‌మించ‌డం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం కూడా జ‌గ‌న్ స‌ర్కార్ చేయ‌డంలేదు. అందుకే, కేంద్రం మంత్రి ష‌కావ‌త్ విజిట్ త‌రువాత పోల‌వ‌రంపై మ‌ళ్లీ రాజ‌కీయం రాజుకుంది.