TDP Vs BJP: విశాఖ సమావేశంపై విరుచుకుపడిన టీడీపీ,బీజేపీ

మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఈ రోజు విశాఖలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంపై తెలుగుదేశం, బీజేపీ విరుచుకుపడ్డాయి.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 03:50 PM IST

మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఈ రోజు విశాఖలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంపై తెలుగుదేశం, బీజేపీ విరుచుకుపడ్డాయి. విశాఖలో జరిగేది రౌండ్‍టేబుల్ సమావేశం కాదని, వైసీపీ సర్వసభ్య సమావేశమని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. వైసీపీ నాయకులు మూడేళ్లలో దోచుకున్న దానిలో వాటాలు పంచుకునేందుకే సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. లేకుంటే అధికార పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కులేదని, మూడు రాజధానులు ఎక్కడ కడతారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ కబ్జాలు మాత్రమే చేస్తుందని విమర్శించారు.

అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతమవుతోందని, ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ నాటకాలాడుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ధ్వజమెత్తారు.
మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. కొత్తవి రాకపోగా చక్కెర మిల్లును కూడా మూసివేయించారన్నారు. ఏం సాధించారని వైసీపీ నేతలు విశాఖలో సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చారని సత్యకుమార్‌ మండిపడ్డారు.