Site icon HashtagU Telugu

Liquor Scam : కుటుంబాల `లిక్క‌ర్` సిత్రం!

All Four

All Four

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను తెలుగుదేశం పార్టీ తాడేప‌ల్లి ప్యాలెస్ కు లింకు చేసింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి స్కామ్ తో సంబంధం ఉంద‌ని ఆధారాల‌ను బ‌య‌ట పెడుతోంది. లిక్క‌ర్ స్కామ్ లో ఏ5గా ఉన్న ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థ ను సీబీఐ పేర్కొంది. దానికి అదాన్ డిస్టిలరీస్ ద్వారా రూ. 2 వేల కోట్లను మళ్లించినట్టు టీడీపీ చెబుతోంది.

ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జగన్, విజయసాయిరెడ్డిల సూట్‌కేస్ కంపెనీ గా మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జగన్ కుటుంబం, ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధం ఉందన్న విషయం సీబీఐ విచారణలో బయటపడిందని ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు. గ‌త రెండు రోజులుగా టీడీపీ నేత‌లు ప‌లువురు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ గురించి ప‌లు ర‌కాలుగా చెబుతున్నారు. సాక్షాత్తు సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి పేరును తెర‌మీద‌కు తీసుకొచ్చారు. గ‌తంలోనూ కాకినాడ పోర్ట్ కేంద్రంగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని టీడీపీ ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది. గుజరాత్ లోని పోర్టు నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్ డైరెక్ష‌న్లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగింది. అసెంబ్లీలోనూ ఆ విష‌యంపై టీడీపీ వాదించింది.

తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ద్వారా ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌ల కుటుంబీకులను విప‌క్షాలు తెర‌మీద‌కు తీసుకొచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత మీద సీబీఐ కేసు న‌మోదు చేసింద‌ని బీజేపీ చెబుతోంది. ఆ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా హైలెట్ చేస్తోంది. ఇక ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తిని ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లోకి టీడీపీ తీసుకొచ్చింది. ప్ర‌తిగా వైసీపీ శ్రేణులు నారా భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణిల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా సీన్లోకి తీసుకొచ్చారు. అంతేకాదు, వైసీపీ ఎమ్మెల్సీ క‌ల్యాణి వాళ్లిద్ద‌రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఎస్పీవైరెడ్డి డిస్ట‌ల‌రీ నుంచి భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి ఎన్ని ముడుపులు తీసుకున్నార‌ని ఆరోపించారు. కేవ‌లం 2 ఎక‌రాల భూమి ఉన్న చంద్ర‌బాబుకు రూ.2ల‌క్ష‌ల కోట్లు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయ‌ని క‌ల్యాణి నిల‌దీశారు.

మొత్తం మీద డిస్ట‌ల‌రీల ద్వారా భార‌తి ముడ‌పులు తీసుకున్నార‌ని టీడీపీ ఆరోపిస్తుంటే, చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎస్పీవైరెడ్డి డిస్ట‌ల‌రీ నుంచి బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి తాయిలాలు తీసుకున్నార‌ని వైసీపీ దుమ్మెత్తి పోస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించిన విచార‌ణ వేగంగా ఈడీ, సీబీఐ చేస్తోన్న క్ర‌మంలో క‌ల్వ‌కుంట్ల‌, నారా, వైఎస్ కుటుంబ మ‌హిళ‌ల్ని తెర‌మీద‌కు తీసుకురావ‌డం రాజ‌కీయం ప‌రాకాష్ట‌కు నిద‌ర్శ‌నం.